– నెల్లూరు జిల్లా వైసీపీ నేతల డాన్సు పార్టీ రచ్చ రచ్చ
– బుచ్చిరెడ్డిపాళెం డాన్సులపై సోషల్‌మీడియాలో హల్‌చల్
– అక్కడ గ్రావెల్, శాండ్‌కు అర్థరాత్రి కాళ్లొస్తాయట
( మార్తి సుబ్రహ్మణ్యం)
సిటీ చివరలో జరిగే రేవ్ పార్టీలు, వాటి హంగామా చూస్తూనే ఉంటాం. ఎవరికీ తెలియకుండా కొంతమందిని ఎంపిక చేసుకుని, రాత్రి వేళ రచ్చరంబోలా చేసే యూత్ పార్టీలపై పోలీసులు అప్పుడప్పుడు మెరుపుదాడులు చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రేవ్‌పార్టీల్లో మందేసి, చిందేసేది బాగా బలిసిన వాళ్ల పుత్రికలు, పుత్రరత్నాలే. కాబట్టి పోలీసులు రేవ్ పార్టీలపై మెరుపుదాడులు చేశారన్న వార్తలే తప్ప, అందులో చిందేసి, మందేసిన చిరంజీవుల పేర్లు మాత్రం పోలీసులు ఎప్పటికీ చచ్చినా చెప్పరు. తర్వాత ఆ లెక్కలు ఆటోమేటిక్‌గా సెటిలవుతుంటాయంతే. తెలంగాణ అయినా, ఆంధ్రా అయినా ఇది కామన్. రాష్ట్రాల పేర్లు తప్ప మిగిలిన ‘ఇండోర్‌గేమ్స్ యవ్వారమంతా’ సేమ్‌టు సేమ్.
ఇప్పుడు నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ నేతలు ఒక పోరీతో చేసిన డాన్సులు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మాంఛి ఊపునిచ్చే సాంగులతో వైసీపీ తమ్ముళ్లు రెచ్చిపోయారు. అమ్మడిని స్టేజీ
దించి ఆమెతో డాన్సులేసిన ఆ వీడియో ఇప్పుడు అందరికీ కనువిందు చేస్తోంది. ఇది ఎప్పుడు జరిగిందో తెలియకపోయినా.. లేటయినా లేటెస్టుగా రచ్చరంబోలా చేస్తోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అనుచరగణం ఓ గెస్టుహౌస్‌లో వేసిన చిందులు చూసి వైసీపీ యువజనం తెగ లొట్టలేసుకుంటున్నారట.
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ వైఎస్ చైర్మన్ సాహుల్, తహసీల్దార్ హమీద్, ఇంకొంతమంది కౌన్సిలర్లు ఆ పార్టీలో వేసిన చిందులు చూసి.. తమకు జిందాబాదులు కొట్టే లీడర్లకు, ఇంత టాలెంటు ఇందా అని వైసీపీ అగ్రనేతలు తెగ హాశ్చర్యపోతున్నారట. వారిలో కళాతృష్ణ ఈ రేంజ్‌లో దాగుందా అని నోరెళ్లబెడుతున్నారట. బహుశా.. ప్రజలకు ఇసుక సర ఫరా చేయడంలో రోజంతా తెగ
కష్టపడిపోతున్నందున, కాస్త రిలాక్స్ అయ్యేందుకు వైసీపీ నేతాశ్రీలు ఇలా చిందేస్తే.. వారు తీసుకువచ్చిన అమ్మడు కూడా బావలూ.. సయ్యా.. అని ఎంటర్‌టైన్‌మెంట్ పంచినట్లుంది. దీన్ని కూడా సోషల్‌మీడియా పాపాత్ములు విమర్శించడం దారుణం.
ప్రజాసేవలో పునీతులవుతున్న నేతాశ్రీలకు ఆమాత్రం ప్రైవసీ లేకపోతే, ప్రజాసేవలో కిక్కురాదేమో? అన్నట్లు… జగనన్న సర్కారు అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాల పప్పుబెల్లాలు పంచుతున్నట్లే.. యువతరం ఈవిధంగా వారానికోసారి రిలాక్స్ అయేందుకు ‘జగనన్న చిందులు’ స్కీమ్ పెడితే.. వారికీ కాస్తంత మానసిక ఉల్లాసం ఉంటుందన్నది ఈ వీడియో చూసిన నెటిజన్ల ఉచిత సలహా.
అన్నట్లు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం, పరిసర ప్రాంతాలకు బాగా బతికిన రోజుల్లో ఘన చరిత్రే ఉంది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, జస్టిస్‌పార్టీ, టీడీపీ వ్యవస్థాపకుల్లో ఒకరయిన బెజవాడ పాపిరెడ్డి, మద్రాసు రాష్ట్ర స్పీకర్ బెజవాడ రామచంద్రారెడ్డి వంటి మహామహులంతా బుచ్చిరెడ్డిపాళెం బిడ్డలే. బెంగాల్, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా పనిచేసిన సత్యనారాయణరెడ్డి కూడా ఆ ప్రాంతంలోని వారే.
అంత ఘనత వహించిన బుచ్చిరెడ్డిపాళెం.. ఇప్పుడు లే అవుట్లలో ‘‘హెల్త్ సెంటర్లు’’ (మానసిక ఉల్లాస కేంద్రాలు) పుట్టుకొచ్చి, అక్కడికి రసానుభూతితో వచ్చే కళాకారుల సేద తీరుస్తోందట. నెల్లూరు, కడప
నుంచి కూడా డబ్బున్న రసహృదయులు బుచ్చిరెడ్డిపాళాన్ని దర్శిస్తుండటంతో అది ఇప్పుడు కళకళలాడుతోందట. పెన్నానది పక్కనే ఉండటంతో బుచ్చిరెడ్డిపాళెం శాండ్‌హబ్‌గా మారింది. అదేం విచిత్రమో.. అక్కడ విఠలాచార్య సినిమా మాదిరిగా, లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌కు అర్ధరాత్రిళ్లే కాళ్లొచ్చి, వాటిని కాకి ఎత్తుకు వెళుతుందట. దానిదుంపతెగ! పాపం జిల్లా కలెక్టరు ఈ మాయదారి యవ్వారంపై ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎమ్మార్వో సార్లు కలెక్టరు సాబ్‌ను ఖాతరే చేయరట.
కలెక్టర్లంటే ఇవాళ వస్తారు. రేపు వెళతారు. కానీ తహశీల్దారు చంటిగాడిగా లోకల్ కదా? పైగా ఎమ్మెల్యేల మనసు గెలిస్తే చాలు. ఎంచక్కా ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగు తెచ్చుకోవచ్చు. పోనీలెండి… ఆంధ్రాలో ఈవిధంగా డబ్బున్న వారి ఒంటినొప్పులు తీర్చేందుకు, మానసిక ఉల్లాసం పెంచేందుకు హెల్త్‌సెంటర్లు రావడం బుచ్చిరెడ్డిపాళెం ప్రజలకూ, వాటిని ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నేతాశ్రీలకూ గర్వకారణమే. మేరా బుచ్చిరెడ్డిపాళెం మహాన్..