Suryaa.co.in

Telangana

లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ టీచర్లకు నీతి వచనాలు చెబుతున్నారు

– టీచర్లకు బిల్లా రంగాల గురించి చెబుతావా ?
– అది నోరా? మోరా ?.. నాలుకనా లేక తాటి మట్టనా?
– తెలంగాణకు అసలు సిసలు కొరివి దయ్యం నువ్వే
– తెలంగాణ ద్రోహులకు కట్టు బానిసవు నువ్వు
– సంస్కార హీన సీఎం రేవంత్ రెడ్డి
– 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే
– సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి తీరు వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఉన్నది. డబ్బు సంచులతో ఎమ్మెల్యేకు లంచం ఇవ్వబోతూ పట్టబడ్డ దొంగ, ఈ రోజూ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నారు.

ప్రభుత్వ సొమ్మును తెలంగాణ నిర్మాత కేసీఆర్ ను తిట్టడానికి వినియోగిస్తున్నాడు. సమాజాన్ని తీర్చి దిద్దాల్సిన టీచర్ల మెదళ్లలో, అసభ్యకరమైన భాషను ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ సంస్కార హీన సీఎం. కేసీఆర్ ను కొరివి దయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప, ఎవ్వరూ అనరు.

తెలంగాణ ఉద్యమం లో రేవంత్ లాంటి ఎన్నో కొరివి దయ్యాలను తుదముట్టించి, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నిజం చేసిన ఉద్యమ సూరీడు కేసీఆర్. తెలంగాణ రావడం ఇష్టం లేని మాతృ ద్రోహి రేవంత్ కు, ఈ మట్టి బిడ్డ కేసీఆర్ త్యాగాలు ఎలా కనిపిస్తాయి? నీ లాంటి కొరివి దయ్యాన్ని తెచ్చుకుని పొరపాటు చేశామని తెలంగాణ సమాజం పాశ్చాతాపం తో ఉంది. నీ లాంటి వాడి చేతికి పొరపాటున 2014 లో అధికారం ఇస్తే తెలంగాణ వాడిని అమ్మేసే వాడివి.

కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితం గా ఉంది కనుకే నువ్వు సీఎం కాగలిగావు. నీకు సీఎం అనే ఉద్యోగం కూడా కేసీఆర్ చలవే అని గుర్తు పెట్టుకో. నువ్వు ఇచ్చిన 30వేల ఉద్యోగ నియామక పత్రాలు కూడా కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ల వల్లే అని గుర్తు పెట్టుకో.

నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్. ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్షలు నిర్వహించింది కూడా బీఆర్ఎస్. ఈయన చేసిన పనేందంటే వంట అయినంక గంటె తిప్పిండు గంతే. నియ్యతున్నోడైతే నిజం చెబుతుండే. నియ్యత్ అనేది ఆయన డిక్షనరీల లేదు గనుక అలవాటు ప్రకారం అబద్ధమే చెప్పిండు.

మూడు నెలల్లోనే ఇచ్చినం అని చెప్పుకున్న 30వేల ఉద్యోగాల సంగతి కూడా ఇదే. వాటికీ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్సే, పరీక్షలు నిర్వహించి బీఆర్ఎస్సే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్సే.

7,094 స్టాఫ్ నర్సుల నియామకాల దగ్గర ఇదే అబద్ధం.
రేవంత్ నియామక పత్రాలు ఇచ్చిన స్టాఫ్ నర్సుల ఉద్యోగాలకైనా, సింగరేణిలో ఇచ్చిన ఉద్యోగాలకైనా, పోలీసు ఉద్యోగాలకైనా, టీచర్ల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్సే, పరీక్ష నిర్వహించింది బీఆర్ఎస్సే.

నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఈ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చినట్లా? నోటిఫికేషన్లు లేకుండా, పరీక్షలు నిర్వహించకుండా, ఏకంగా నియామకపత్రాలు ఇవ్వడం కుదురుతుందా? 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా 8792 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గురుకులాల్లో 11వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశాం. గురుకులాల్లో 12వేల నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్మెంట్ శాంక్షన్ ఇచ్చాం.

ఇంటర్ కాలేజీల్లో 3096 మందిని, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 520 మందిని, డిగ్రీ కాలేజీల్లో 280 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం. హయ్యర్ ఎడ్యుకేషన్ 3232 పోస్టులను, యూనివర్సిటీల్లో 1061 పోస్టులను మంజూరు చేసినం. ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలు. ఉద్యోగాలు పొందిన వారికి అనుభవంలో ఉన్న వాస్తవాలు. 25వేల మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి, మేమిచ్చిన 5089 డీఎస్సీ పోస్టులకు అదనంగా 6వేలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసినవు.

ఉపాధ్యాయులకు బిల్లా రంగాల గురించి చెబుతావా ?
విద్యార్థులకు బిల్లా రంగాల గురించి భోధించమని టీచర్లకు చెబుతున్నావా ? రాహుల్ గాంధీ ని తీవ్రవాది అని ఓ కేంద్రమంత్రి అంటే దిష్టి బొమ్మలు కాల్చారు కదా? నువ్వు సీఎం స్థానంలో ఉండి బిల్లా రంగాలతో పోల్చవచ్చా? నీ దిష్టి బొమ్మలు ఎన్ని కాల్చాలి ? రాహుల్ గాంధీ కి ఒక నీతి మాకో నీతా ? కాంగ్రెస్ లో ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా ? ఇదేమైనా కొత్తనా? నువ్విపుడు ఓడిపోయిన వారికి పదవులు ఇవ్వలేదా ?

కవిత ఎమ్మెల్సీ గా ఓట్ల తోనే గెల్చింది. కేసీఆర్ హయం లో లక్షా 60వేలకు పైగా ఉద్యోగాలిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా? కేసీఆర్ మొదలు పెట్టిన 30 వేల ఉద్యోగనియామకాల ప్రక్రియను, చివరి దశలో పూర్తి చేస్తే నువ్వు ఉద్యోగాలు ఇచ్చినట్టా? అది నోరా? మోరా ? నాలుకనా లేక తాటి మట్టనా? కట్టిన ఇంటికి సున్నం వేస్తే ఇల్లు నువ్వు కట్టినట్టేనా ?
కేసీఆర్ హాయం లో ఉద్యోగాల నియామక ప్రక్రియను కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలు కాదా ? నిరుద్యోగులను నీ స్వార్ధం కోసం రెచ్చగొట్టి మోసం చేస్తున్న దగా కోరువి నువ్వు.

జాబ్ కేలెండర్ ను జాబ్ లెస్ కేలండర్ గా మార్చింది నువ్వు కాదా ? ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని విద్యార్థులను, నిరుద్యోగులను మభ్య పెట్టావు. పది నెలలు అయినా రెండు లక్షల నియామకాల ఊసే లేదు.

విద్యార్థులు, నిరుద్యోగులు నీ మోసాన్ని అర్థం చేసుకున్నారు. నీకు కొలువు ఇచ్చిన నిరుద్యోగులే నీకు కొరివి పెడతారు. నిన్ను పడగొడతాం అని ఎవరో అన్నట్టు సానుభూతి రాజకీయాలు మొదలు పెడుతున్నావ్. నీ మాటలే నిన్ను పడగొడతాయి ..నీ గ్యారంటీలే నీకు ఘోరీ కడతాయి. హర్యానా ఓటర్లు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారెంటీలకు గోరి తవ్వారు. తెలంగాణ లో ఇపుడు బొంద తవ్వడం మొదలైంది.

గంట కూడా రెస్ట్ లేకుండా పని చేస్తున్నా అని ఈ సిపాయి చెబుతున్నాడు. అంత పని చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలు ఎందుకు ? ప్రజలను ఎలా భాధ పెట్టాలో రెస్ట్ లేకుండా ఆలోచిస్తున్నావా? తెలంగాణకు అసలు సిసలు కొరివి దయ్యం నువ్వే ..నీ నుంచి తెలంగాణ ను కాపాడే కొర్రాయి కేసీఆర్.

నీ కాళ్లలో కట్టెలు పెట్టడం కాదు. తెలంగాణ ను నీ దుష్ట పన్నాగం నుంచి కాపాడేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తాం. ఉద్యమం తెలియని వాడివి. తెలంగాణ ఆర్తి లేనివాడివి. తాత కు దగ్గులు నేర్పుతావా ? తెలంగాణ ద్రోహులకు కట్టు బానిసవు నువ్వు.. తెలంగాణ ప్రజలకు బానిసలం మేము.

LEAVE A RESPONSE