Suryaa.co.in

Andhra Pradesh

50 రోజులు గడిచినా వరద బాధితులకు ఇంకా అందని సహాయం

– అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
– ఈనెల 23వ తేదీన అజిత్ సింగ్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద వరద బాధితుల ఆందోళనకు పిలుపు
– ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు

విజయవాడ: అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, శాంతినగర్ ఇతర ప్రాంతాల్లో బాబురావు, సిపిఎం నాయకులు పర్యటించారు. బాధితులను కలుసుకొని మాట్లాడారు. పలు సభలలో ప్రసంగించారు సహాయం ఇంకా అందలేదని, సమాధానం చెప్పే నాథుడు కరువయ్యారని బాధితులు నేతలు వద్ద గగ్గోలు పెట్టారు. బాధితులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి.

పలువురికి నయా పైసా సహాయం అందలేదు. కొందరికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండగా పై అంతస్తులో ఉన్నట్లు 25 వేల రూ” బదులు పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు కొన్ని కుటుంబాలలో వాహనాలకు మూడువేల రూపాయలు జమ అయినా, ఇంటికి 25 వేలు ఇవ్వలేదు.

తోపుడు బళ్ళు, చిరు వ్యాపారులకు అత్యధిక మందికి చిల్లు గవ్వ ఇవ్వలేదు ,ట్రేడ్ లైసెన్స్ ఉండాలని నిబంధనలు పెడుతున్నారు. కొన్ని ఆటోలకు సహాయం అందక, రిపేర్లు చేయించుకోలేక 50 రోజులుగా ఆటోలు ఇళ్ల వద్దే ఉంచుకున్నారు. ఫైనాన్సర్లకు బళ్ళు అప్పగిస్తున్నారు.

అప్పులు చేసి కార్లు కొని, సొంతంగా కిరాయికి తిప్పుకుంటుండగా, వరదలో మునిగిన వారికి ప్యాకేజీ ప్రకటించలేదు. కొందరికి అర్హుల జాబితాలో పేర్లు కనపడుతున్నాయి. కానీ ఏ బ్యాంకు లోను డబ్బు జమ కాలేదు.సచివాలయాలు, ఎమ్మార్వో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, శాసనసభ్యుడు ఆఫీసు చుట్టూ అనేక రోజుల నుండి తిరుగుతున్నా సమాధానం చెప్పే నాథుడు కరువయ్యారు.

ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ….. వరద హెచ్చరికలు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బాధితులు నిండా మునిగిపోయారు. ఏ వస్తువులు మిగల్లేదు. ప్రతి ఒక్క బాదితుడికి సహాయం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి, 50 రోజులు గడిచినా ఇంకా వేలాది మందికి సహాయం అందకపోవటం
శోచనీయం.

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు చేసిన ఎన్యూమరేషన్ తప్పులతడకగా ఉంది. ఎన్నికల సందర్భంగా ఓట్లకు అర్హులైన వారు, వరద సందర్భంలో సహాయానికి అనర్హులుగా ప్రకటించడం గర్హనీయం.బాధితుల సమస్యలను పరిష్కరించాల్సిన శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.

నేతలు మద్యం,ఇసుక సిండికేట్లలో బిజీగా ఉన్నారు. బాధితులు గోడు పట్టించుకునే తీరిక వారికి లేదు. దాతలు 500 కోట్ల విరాళాలు ఇచ్చినా బాధితులకు సహాయం అందించడంలో మీనమేషాలు లెక్కించడం తగదు. కేంద్రం 7500 కోట్ల రూ” వరద సహాయం ఇవ్వవలసి ఉన్నా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడగదు.

సహాయం అందలేదని బాధితులు పెట్టుకున్న దరఖాస్తులపై ప్రభుత్వం స్పందించాలి. సమాధానం చెప్పాలి, సహాయం అందించాలి. వరద బాధితులకు అందరికీ సహాయం అందించే విషయంపై ముఖ్యమంత్రి ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలి.వరదల సందర్భంలో హడావిడి చేసిన మంత్రులు, ఉన్నతాధికారులు నేడు ఎందుకు మౌనం వహిస్తున్నారు పదేపదే దరఖాస్తులు పెట్టినా, పట్టించుకోనందున బాధితులు ఆందోళన చేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

పాదయాత్ర కార్యక్రమాల్లో సిపిఎం నేతలు బి రమణ రావు, సిహెచ్ శ్రీనివాస్, నిజాముద్దీన్, అరుణ, విజయ, శివ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE