(నవీన్)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెను కష్టాన్ని మిగిల్చింది. ఇది వాయుగుండంగా మారి కోస్తాంధ్రను ముంచెత్తింది. తుపాను కాకపోయినా, దాని తీవ్రత పెను తుపానును తలపించింది. ఆగస్టు 13 నాటికి పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది.
రుతుపవనాలకు కాస్త విరామం తర్వాత బంగాళాఖాతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా అల్పపీడనం మొదలైంది. అది కొన్ని రోజులు సముద్రంపైనే స్థిరంగా ఉండి, తేమను భారీగా పీల్చుకుంది. క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆగస్టు 19 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు తప్పవని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
వాయుగుండం ప్రభావం కోస్తా జిల్లాలను వణికించింది. ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక్కరోజులోనే 142.8 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అక్కడ ఏకంగా 279 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో పట్టణం వాననీటిమయంగా మారింది.
భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్దకు 3,09,438 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. విజయవాడ, గుంటూరు నగర శివార్లలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జాతీయ రహదారులు సైతం నీట మునగడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రజల సెల్ ఫోన్లకు ఫ్లాష్ హెచ్చరికలు పంపి అప్రమత్తం చేసింది.
ఖరీఫ్ సీజన్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. పత్తి, మిరప, పప్పుధాన్యాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పంటలు ఎక్కువ రోజులు నీటిలో నానుతుండటంతో పూర్తిగా కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. వరి పంట నీరు తగ్గితే కొంత కోలుకునే అవకాశం ఉన్నా, మిగతా పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి, పంట చేతికొచ్చే సమయంలో వచ్చిన ఈ వరద రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. సుమారు రెండు లక్షల మంది రైతులు ప్రభావితమైనట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితిని కేవలం భారీ వర్షాలు అనలేం. జరిగిన ఆస్తి, పంట నష్టం, జనజీవనంపై పడిన తీవ్ర ప్రభావాలు, ఇది కచ్చితంగా ఒక ప్రకృతి విపత్తు (Disaster) అని స్పష్టం చేస్తున్నాయి. ఒకేసారి లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసేంత నష్టం జరిగినప్పుడు, దానిని వైపరీత్యం అనడంలో సందేహం లేదు.
ఈ సంఘటన భవిష్యత్తులో పట్టణ ప్రణాళిక, వ్యవసాయ విధానాలు, విపత్తు నిర్వహణలో తీసుకోవాల్సిన మార్పులను గుర్తుచేస్తోంది. వాతావరణ మార్పుల తీవ్రతను తట్టుకునేలా మన వ్యవస్థలను మార్చుకోవాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోంది.
( రచయిత సీనియర్ జర్నలిస్టు)