Suryaa.co.in

Editorial

మోదీ చెప్పినా డోంట్ కేరేనా?

– బీజేపీ చార్జిషీట్ చెట్టెక్కినట్లేనా?
– కోర్ కమిటీలో అంశాలను నిర్ణయించాలంటున్న సీనియర్లు
– ఆ భేటీ ఎప్పుడో చెప్పని నాయకత్వం
– మోదీ చెప్పి 20 రోజులవుతున్నా అమలు చేసే దిక్కు లేదు
– నాయకత్వ వైఖరిపై సీనియర్ల అసంతృప్తి
– సర్కారు వైఫల్యాలు, అవినీతిపై చార్జిషీట్ వేయాలని మోదీ ఆదేశం
– గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చార్జిషీట్ ఉండాలని సూచన
– మోదీ ఆదేశాలపై చర్చ జరగకపోవడంపై బీజేపీ సీనియర్ల అసంతృప్తి
( మార్తి సుబ్రహ్మణ్యం)

మోదీ చెప్పారా? అయితే ఏంటట? అన్నట్లుంది ఏపీ బీజేపీ వ్యవహారం. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలను కూడా బుట్టదాఖలు చేస్తున్న బేఖాతరిజంపై ఏపీ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీలో అత్యంత కీలకమైన కోర్ కమిటీకి సాక్షాత్తూ ప్రధాని మోదీ ఇచ్చిన ఆదేశాలను, ఇప్పటిదాకా అమలుచేయకపోవడంపై బీజేపీ నేతలు రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ సర్కారు వైఫల్యాలు, అవినీతి అంశాలకు సంబంధించి చార్జిషీట్ తయారుచేయాలని మోదీ చెప్పి 20 రోజులవుతున్నా, ఇప్పటివరకూ దానిపై స్పందించని నాయకత్వ తీరుపై కమలదళాలు కస్సుబుస్సుమంటున్నాయి.

ఈనెల 11న ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా, ఏపీ బీజేపీ కోర్ కమిటీతో భేటీ అయ్యారు. కోర్ కమిటీతో ప్రధాని భేటీ కావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ2 పనితీరు గురించి, మోదీ కోర్ కమిటీలో వాకబు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ తదితర నేతలు రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ప్రధానికి వివరించారు. ఏయే రంగాల్లో అవినీతి జరుగుతుందన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు.

వాటిని సావధానంగా విన్న మోదీ.. ఆయా అంశాలపై చార్జిషీట్ తయారుచేసి, ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు, అవినీతి అంశాలపై చార్జిషీట్ రూపొందించాలని సూచించారు. అదే సమయంలో సమస్యలపై స్థానికుల నుంచి సంతకాలు తీసుకోవాలని కూడా సూచించడం విశేషం.

ఇది జరిగి ఇరవైరోజులవుతున్నా.. ఇంతవరకూ ఏయే అంశాలు గుర్తించాలన్న దానిపై, రాష్ట్ర నాయకత్వం కోర్ కమిటీ ఏర్పాటుచేయకపోవడంపై, బీజేపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలపై3 రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఏమైనా ఇబ్బందులుంటే.. కనీసం సంఘటనా మంత్రి మధుకర్‌జీ అయినా చొర తీసుకోకుండా, మౌనంగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

‘స్వయంగా మోదీగారు ఆదేశించినా ఇప్పటిదాకా కోర్ కమిటీతో చర్చించలేదంటే, ఇక ప్రధానికి మనం ఏం విలువ ఇస్తున్నట్లు? మోదీ ఆదేశాలను ఏయే స్థాయిలో, ఎలా అమలుచేయాలి? ఏయే అంశాలు గుర్తించాలన్న దానిపై ఒక సబ్ కమిటీలాంటిది వేసుకోవాలి కదా? ఆయా కమిటీలో ఎవరిని భాగస్వాములను చేయాలన్న అంశంపై చర్చించాలి కదా? అవేమీ లేకుండా 20 రోజుల నుంచి మౌనంగా ఉండటం అంటే మోదీగారిని అవమానించినట్లే కదా?’ అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

దానికంటే ముందు కోర్ కమిటీ భేటీ ఏర్పాటుచేసి.. రాష్ట్ర స్థాయి అంశాలను గుర్తించి, వాటిపై చర్చించాలన్న తొందర, నాయకత్వంలో కనిపించకపోవడంపై సీనియర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మోదీ వెళ్లిన వారంలో…. కోర్ కమిటీలో చార్జిషీట్ వేయాల్సిన అంశాలపై చర్చించిన తర్వాత, జిల్లా స్థాయి అంశాలపై చర్చించేందుకు, రాష్ట్ర కమిటీని ఏర్పాటుచేయాల్సి ఉందని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.

మోదీ ఆదేశించి 20 రోజులవుతున్నప్పటికీ.. చార్జిషీట్‌కు సంబంధించి ఇప్పటిదాకా, ఒక్క అడుగు కూడా ముందుకువేయకపోవడంపై పార్టీ వర్గాల్లో ఆసక్తకరమైన చర్చ జరుగుతోంది. ఏపీ బీజే పీ.. జగన్ అనుకూల-వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో, చార్జిషీట్ ఆలస్యం అవుతుందని తాము ముందుగానే4 గ్రహించామని, కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ అనుకూల వర్గానికి చార్జిషీట్ అంత వేగంగా రూపొందించడం ఇష్టం లేదని, అందుకే కోర్ కమిటీ ఏర్పాటుచేయడం లేదన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అన్ని అంశాలపై ఒకేసారి రాష్ట్రకమిటీలో చర్చించేందుకే రాష్ట్ర నాయకత్వం, బహుశా చార్జిషీట్ వ్యవహారాన్ని ఆలస్యం చేస్తుందేమోనని మరికొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదేమైనా ప్రధాని ఆదేశించిన అదే వారంలో కోర్ కమిటీ ఏర్పాటుచేసి.. చార్జిషీట్ అంశాలపై కమిటీలు వేసి ఉంటే, మోదీని గౌరవించినట్లు ఉండేద ంటున్నారు. దానికి భిన్నంగా.. 20 రోజులయినా మోదీ ఆదేశాలపై, ప్రాధమికస్థాయి చర్చలు కూడా ప్రారంభించకపోవడమంటే, ఆయనను కచ్చితంగా అవమానించినట్లేనన్నది సీనియర్ల ఆవేదనలా కనిపిస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం.. కోర్ కమిటీ, రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తుందో లేదో చూడాలి.

LEAVE A RESPONSE