మత్స్యకారులను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు ముఖ్యమంత్రి గారూ?

– ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ

విషయం:మూడున్నరేళ్లుగా కానరాని మత్స్సకారుల అభివృద్ధి- గిరిపుత్రులకు అందని సంక్షేమ పథకాలు, రాయితీలు- జీవో 217తో మత్స్యకారులకు ఉరి- వేట నిషేద సమయంలో అందని ప్రభుత్వ ఆర్థిక సాయం, మత్స్యకారులకు ఇళ్ల నిర్మాణం, చంద్రన్న బీమా పునరుద్ధరణ గురించి…

మూడున్నరేళ్లుగా ఎటువంటి సంక్షేమ పథకాలు అందక, ప్రభుత్వం నుంచి సరైన ఆర్థిక ప్రోత్సహకాలు లేక మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రతి పథకం అమల్లోనూ నాడు-నేడు అని మాట్లాడే మీరు తెలుగుదేశం హయాంలో మత్స్యకారులు ఏవిధంగా అభివృద్ధి చెందారో నేడు ఎన్ని విధాలుగా నష్టపోతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. బహిరంగ సభల్లో బటన్ నొక్కుతూ తేనెపూసిన కత్తిలా మాటలు చెబుతూ మత్స్యకారులను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు ముఖ్యమంత్రి గారూ? జీవో 217 తీసుకొచ్చి గంగపుత్రుల పొట్ట కొట్టింది వాస్తవం కాదా? టీడీపీ హయాంలో చెరువులు, రిజర్వాయర్లు, నదుల్లో చేపలవేటను మత్స్యకారులకు అప్పగించగా మీరు మాత్రం మత్స్యకారుల చెరువులను బడా వ్యాపారులకు దోచిపెట్టడం మీ నియంతృత్వ పోకడలకు నిదర్శనం కాదా? ఇదేనా మీరు చెబుతున్న మత్స్యకార అభివృద్ధి అంటే? 2014-19 మధ్య కేవలం మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.788.38 కోట్లను ఖర్చు చేశాం. ఈ మూడున్నరేళ్లలో పలానా ఖర్చు చేశామని ధైర్యంగా చెప్పగలరా?

గతంలో గతంలో వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి ఆర్థిక సహాయం అందించగా నేడు సాకులు చూపించి, లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టి అరకొరగా వేష నిషేద సాయం అందిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చంద్రన్న బీమా అమలు చేస్తే వాటికీ మీరు తూట్లు పొడిచారు. దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వంలో వేటకు వెళ్లి చనిపోయిన వారికి డెత్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గం కాదా? వలస వెళ్లిన మత్స్యకారులకు భృతి, 50 ఏళ్లకే పింఛను కార్యక్రమానికి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టగా మూడున్నరేళ్లుగా వాటినీ ప్రశ్నార్థకం చేయడం దేనికి సంకేతం? మత్స్యకార భరోసా పేరుతో మీరు చేసే సాయం గోరంత . విద్యుత్ చార్జీలు, పెట్రోల్ –డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి వారి నుంచి లాక్కుంటోంది కొండంత.

తెలుగుదేశం హయాంలో అందించిన సంక్షేమ పథకాలతో మత్స్యకారులు సంతోషంగా ఉండగా నేడు ప్రభుత్వ అరకొర సాయంతో వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తెలుగుదేశం ప్రభుత్వం అందించిన ఏ సంక్షేమ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అందడంలేదు. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు సబ్సిడీపై బోట్లు, ఇంజన్లు వలలు అందిస్తు నేడు వాటిని కక్షపూరితంగా ఆపేసి వారిని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశారు. నాడు పెరిగిన డీజిల్ రేటు ప్రకారం సబ్సిడీపై ఆయిల్ అందించి బకాయిలు చెల్లించగా వాటికీ మీరు మంగళం పాడేసి మాటల్లో మాత్రం ఏదో ఉద్దరించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు కాదా? మత్స్య మిత్ర గ్రూపులు, ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేయడంతో పాటు వారికి పట్టాలిచ్చి ఇళ్లు నిర్మించిన ఘనత ఒక్క చంద్రబాబు గారికే దక్కుతుంది. టీడీపీ ప్రభుత్వం మడ అడవులను కాపాడి వేల మందికి ఉపాధి కల్పిస్తే మీ ధనార్జన కోసం వాటినీ సర్వ నాశనం చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వీర్యంతో మత్స్యకార పిల్లల భవితను నాశనం చేశారు. ఇకనైనా మీ కల్లబొల్లి మాటలు, మోసకారి సంక్షేమాన్ని కట్టిపెట్టండి. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అమలు చేసిన అన్ని పథకాలను పునరుద్ధరించి వారిని ఆర్థికంగా ఆదుకోండి.

Leave a Reply