– ఇది కేవలం విద్యా సమస్య కాదు.. జాతీయ భవిష్యత్తుపై పడే ప్రభావం
– ముస్తాబులు, ముచ్చట్లు ఇంట్లోనే జరగాలి
– బడిలో కేవలం చదువు మాత్రమే సాగాలి
– విద్యా వ్యవస్థ వైఫల్యంపై నిజాల ప్రకటన
ప్రస్తుత విద్యా విధానం “చదువు” అనే మూల లక్ష్యం నుంచి నెమ్మదిగా తప్పుకుని “ ఈవెంట్ మేనేజ్మెంట్ + చెక్‌లిస్ట్ కల్చర్” వైపు దూసుకుపోతోంది . ఇది అభిప్రాయం కాదు … ఇది వ్యవస్థాగత వైఫల్యం .
ఈరోజు ఉపాధ్యాయుడు చాక్ పీస్ పట్టాల్సిన చేతులతో ఫోటోలు తీస్తున్నాడు, పాఠం చెప్పాల్సిన సమయాన్ని డేటా అప్లోడ్స్కు త్యాగం చేస్తున్నాడు.
ఒక ఉపాధ్యాయుడు రోజుకు సగటున 2 గంటలు ముస్తాబు, భోజనం పర్యవేక్షణ, యాప్ పనులకు వెచ్చిస్తే, అది సంవత్సరానికి దాదాపు 400 గంటల బోధనా నష్టం.
ఇది భావోద్వేగం కాదు… ఇది గణితం.
ఫలితం ఏమిటి?
పిల్లల జడలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, యూనిఫాం శుభ్రంగా ఉంది, LEAP లో ఫోటోలు గ్రీన్‌గా కనిపిస్తున్నాయి…
కానీ.. చదవడం రాదు.. రాయడం రాదు..అర్థం చేసుకునే సామర్థ్యం లేదు. Foundational Literacy లేకపోతే రేపటి చదువు అర్థం కాదు. రేపటి ఉద్యోగం దక్కదు. రేపటి దేశం బలంగా ఉండదు. ఇది కేవలం విద్యా సమస్య కాదు. ఇది జాతీయ భవిష్యత్తుపై పడే ప్రభావం.
* * *
ఇప్పుడు సామాజిక కోణం చూద్దాం.
బిడ్డను శుభ్రంగా బడికి పంపడం, తల దువ్వడం, ముఖం కడిగించడం…
ఇవి ప్రభుత్వ పనులు కావు. ఇవి ఉపాధ్యాయుల బాధ్యతలు కావు. ఇవి తల్లిదండ్రుల కనీస కర్తవ్యాలు.
కానీ సంక్షేమం పేరుతో ఆ బాధ్యతను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే.. తల్లిదండ్రుల్లో నిర్లక్ష్యం పెరుగుతుంది. పిల్లల్లో ఆధారపడే స్వభావం పెరుగుతుంది. కుటుంబ వ్యవస్థ బలహీనమవుతుంది.
సంక్షేమం అంటే ఆదుకోవడం…అన్ని పనులు మనమే చేయడం కాదు. అది దయ కాదు. అది సంస్థాగత సోమరితనానికి బీజం!
* * *
వ్యవస్థాత్మక దోపిడీ – అసలు గాయం ఇక్కడే.
D.Ed, B.Ed, PG, PhD చదివిన ఉపాధ్యాయుడు.. బకెట్ పట్టాలి. మగ్గు పట్టాలి. జడలు వేయాలి. చెక్‌లిస్ట్ నింపాలి. ఇది గౌరవం కాదు. ఇది నైపుణ్య వినియోగం కాదు. ఇది Human Resource Misuse.
దీని ఫలితం?.. ఆత్మగౌరవం దెబ్బతింటుంది. బోధనపై ఉత్సాహం తగ్గుతుంది. ఉపాధ్యాయుడు యంత్రంలా మారిపోతాడు. నిరుత్సాహపడిన ఉపాధ్యాయుడు .ఎప్పటికీ ప్రేరణనివ్వలేడు.
* * *
LEAP & డిజిటల్ మానిటరింగ్ – సాయం కాదు.. నిఘా.
సిద్ధాంతంగా టెక్నాలజీ బోధనను సులభతరం చేయాలి. వాస్తవంలో.. ఫోటో తప్పితే ప్రశ్న. అప్లోడ్ ఆలస్యం అయితే భయం. చెక్‌లిస్ట్ మిస్ అయితే నోటీసు.
ఇది సపోర్ట్ సిస్టమ్ కాదు. ఇది భయంతో నడిచే స్కూల్ కల్చర్.
* * *
నిజాలు
బడి అంటే సంస్కారాన్ని నేర్పే దేవాలయం…అది ముస్తాబు చేసే సెలూన్ కాదు.
అక్షరం నేర్పాల్సిన చేతులు అలంకరణకే పరిమితమైతే రేపటి తరం అజ్ఞానంలోనే ఉంటుంది.
తల్లి /తoడ్రిచేసే పని టీచర్ చేస్తే టీచర్ చేయాల్సిన పని (బోధన) ఎవరు చేస్తారు?
యాప్‌లో ఫోటోలు గ్రీన్‌గా కనిపిస్తే సరిపోదు. విద్యార్థి భవిష్యత్తు బ్రైట్‌గా ఉండాలి.
ఇది విద్యార్థుల సంక్షేమం కాదు…ఇది ఉపాధ్యాయుల శ్రమపై జరిగే వ్యవస్థాత్మక దోపిడీ.
* * *
తుది మాట
ప్రభుత్వాలు మారవచ్చు.. పథకాలు మారవచ్చు. కానీ ఉపాధ్యాయుడి ప్రాథమిక విధి బోధన మాత్రమే. తల్లిదండ్రుల బాధ్యతను ఉపాధ్యాయులపై రుద్దడం ఒక విఫల సామాజిక ప్రయోగం.
డిమాండ్ ఒక్కటే
ఉపాధ్యాయుడిని చాక్ పీస్ పట్టనివ్వండి.
సమాజాన్ని నిర్మించనివ్వండి.
ముస్తాబులు, ముచ్చట్లు ఇంట్లోనే జరగాలి.
బడిలో కేవలం చదువు మాత్రమే సాగాలి.