– ప్రధాన నగరాలను పోల్చితే హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ మెరుగు
– పట్టణీకరణ ట్రాఫిక్ నియంత్రణకు ఒక సవాలు
– ట్రాఫిక్ ప్రమాదాలు ప్రతీ ఒక్కరికీ సమస్యలు
– రిటైర్డ్ పోలీస్ అధికారి పి. తిరుపతి రెడ్డి ‘ట్రాఫిక్ ఆక్సిడెంట్ – ఇన్వెస్టిగేషన్’ పుస్తకావిష్కరణలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్
హైదరాబాద్ : సమాజంలోని ప్రతీ వ్యక్తి స్వయంగా తామే ట్రాఫిక్ నియంత్రణకు పాల్పడ్డప్పుడే మెరుగైన ట్రాఫిక్ విధానాల అమలు జరుగుతుందని డీజీపీ అంజనీ కుమార్ అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ పోలీస్ అధికారి పి. తిరుపతి రెడ్డి రాసిన ‘ట్రాఫిక్ ఆక్సిడెంట్ – ఇన్వెస్టిగేషన్’ అనే పుస్తకాన్ని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. జాతీయ పోలీస్ అకాడమీ రిటైర్డ్ డైరెక్టర్ కమల్ కుమార్, అడిషనల్ డీజీ లు శివధర్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, అభిలాష బిస్త్, సంజయ్ కుమార్ జైన్ తదితర సీనియర్ పోలీస్ అధికారులు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ, దేశంలోని ప్రధాన నగరాలను పోల్చితే హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు. దీనికి నిదర్శనమే, హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున వస్తున్న విదేశీ పెట్టుబడులని అన్నారు. అప్రతిహతంగా పెరుగుతున్న పట్టణీకరణ ట్రాఫిక్ నియంత్రణకు ఒక సవాలుగా మారిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతీపౌరుడు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమ, నిబంధనలను పాటించాలని సూచించారు.
పోలీస్ శాఖ ఎదుర్కునే నేరాలైన భౌతిక దాడులు, చోరీలు తదితర నేరాలన్నీ వ్యక్తులకు సంబంధించి ఉంటాయని, ట్రాఫిక్ ప్రమాదాలు మాత్రం ప్రతీ ఒక్కరికీ సమస్యలు కలగ చేస్తాయని అన్నారు. తిరుపతి రెడ్డి రాసిన ఈ పుస్తకం తెలంగాణ పోలీస్ అధికారులకు ఉపయుక్తంగా ఉందని ప్రశంసించారు. నేషనల్ పోలీస్ అకాడమీ రిటైర్డ్ డైరెక్టర్ కమల్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో ప్రతీ సంవత్సరం రోడ్డు ప్రమాదాలలో నాలుగున్నర లక్షల మంది గురవుతున్నారని, వీరిలో దాదాపు ఒక లక్ష మంది మరణిస్తున్నారని వెల్లడించారు. ప్రమాదాలకు గురైన వారు కేవలం భీమా మొత్తాన్ని పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ, ప్రమాద దర్యాప్తు, కారకులైన వారికి శిక్ష పడే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసుల విషయంలో సమర్ధవంతమైన దర్యాప్తు, తగు శిక్షపడ్డప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని కమల్ కుమార్ అన్నారు. తిరుపతి రెడ్డి రాసిన ఈ పుస్తకం ట్రాఫిక్ ప్రమాదాల దర్యాప్తు అధికారులకు కరదీపికగా ఉపయోగ పడుతుందని అన్నారు. ఈ సందర్బంగా పుస్తక రచయితా తిరుపతి రెడ్డి ని డీజీపీ అంజనీ కుమార్, కమల్ కుమార్ లు ఘనంగా సన్మానించారు. అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి స్వాగతం పలకగా, సంజయ్ కుమార్ జైన్ వందన సమర్పణ చేశారు.