Suryaa.co.in

Andhra Pradesh

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను పక్కదోవ పట్టించేందుకే పచ్చ మీడియా పిచ్చి రాతలు

– పరిశ్రమలపై టీడీపీ ఫ్యాక్ట్‌ చెక్‌ అంటూ విద్వేషాలను రెచ్చగొడుతోంది
– సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్‌లను వేధించి పంపించేసింది చంద్రబాబే
– టాటా, బిర్లా, జిందాల్‌లు వస్తుంటే కనీసం ఒక మూలనైనా చిన్న వార్త రాశావా రామోజీ..?
– లీజు కట్టకుండా లులు గ్రూప్‌ వెళ్లిపోయింది నిజం కాదా..
– మార్కెట్‌ లేదంటూ జాకీ వెళ్లిపోతే మాపై నిందలా..?
– అమరరాజా పక్క రాష్ట్రాల్లో విస్తరణ చేయకూడదా..?
– జగన్‌ హయాంలో పెట్టుబడులు రాకూడదన్న అక్కసుతో పిచ్చి రాతలు, కూతలు
– ఇన్ఫోసిస్‌ విశాఖలో మొదలు పెట్టబోతున్న క్యాంపస్‌ గురించి ఈనాడు రాయదేం..?
– నీ హయాంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అన్నావ్.. అవి ఎక్కడ చంద్రబాబూ..?
– చంద్రబాబు హయాంలో పారిశ్రామిక వృద్ధి రేటు 5 శాతం…మా హయాంలో 12.78 శాతం
– స్థిరమైన లక్ష్యం, దృఢమైన సంకల్పంతో జగన్‌ ముందుకు వెళ్తున్నారు
– ఈ ప్రభుత్వంలో 108 భారీ పరిశ్రలు, 1.08 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వచ్చాయి
– జగన్‌ గారి నాయకత్వంలో రాష్ట్రానికి రూ.74,481 కోట్ల వాస్తవ పెట్టబడులు
– 10.70 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగవకాశాలు
– సమ్మిట్‌ జరుగుతుంటే బాధ్యత గల ప్రతిపక్షనేత చేయాల్సిన పనులేనా ఇవి..?
– రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

గత కొన్ని రోజులుగా పచ్చ మీడియాలో రాష్ట్రంలో పరిశ్రమలపై తప్పుడు వార్తలు రాస్తున్నారు.ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారు ఫ్యాక్ట్‌ చెక్‌ అంటూ ఓ బుక్‌ లెట్‌ విడుదల చేశారు రేపు, ఎల్లుండి విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌–2023 జరుగుతోంది. ప్రపంచం మొత్తం మనవైపు చూస్తున్న శుభసందర్భంలో ప్రజల్లో అయోమయం సృష్టించి, తప్పుడు సందేశాన్ని తీసుకెళ్లేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.విద్యేషం పెంచేందుకు ఇలాంటి తప్పుడు బుక్‌లెట్స్‌ టీడీపీ ప్రచారం చేస్తోంది.వాళ్లు రిలీజ్‌ చేసిన బుక్‌లెట్లో మొదటి పేరా సత్యం రామలింగరాజు, నిమ్మగడ్డ ప్రసాద్, కోనేరు ప్రసాద్‌లను మా ప్రభుత్వం వేధించిందని రాశారు.

సత్యం రామలింగరాజుకి ఈ ప్రభుత్వానికి అసలు ఏమైనా సంబంధం ఉందా..?సత్యం రామలింగరాజు కంపెనీని ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబే.కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్‌లు కూడా ఆయన హయాంలోనే ఇబ్బందులు పడ్డారునిమ్మగడ్డ ప్రసాద్‌పై నేరుగా కేసులు బనాయించింది చంద్రబాబే అలాంటిది వారి పేర్లు తీసుకొచ్చి ఈ రోజు బుక్‌లెట్‌ వేయడానికి కనీసం అర్ధం పర్ధం ఉండనక్కర్లేదా..? మా మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి ఎవరున్నా మేం ఒప్పుకోము అన్నట్లుంది పచ్చ మీడియా విషపు రాతలు.మేం అబద్దాలను మాత్రమే ప్రచారం చేస్తాము…నిజా నిజాలతో మాకు పనిలేదు అంటున్నారు.తమ పగ, విద్వేషం,కుట్ర,పంతం.. అంతా జగన్ మీదనే అని చాటి చెప్తున్నారు.

టాటా, బిర్లా, జిందాల్‌లు వస్తుంటే కనీసం ఒక మూలనైనా వార్త రాశావా..?
అదానీ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతుంటే ఒక్క వార్తయినా రాశావా రామోజీ?అంబానీ లాంటి వారు రేపటి కార్యక్రమానికి వస్తుంటే దాన్ని ప్రజలకు చేరువ చేయాలని అనుకున్నావా.. టాటా, బిర్లా, జిందాల్‌ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఈ రాష్ట్రం వైపు చూస్తుంటే కనీసం ఒక మూలనైనా వార్త రాశావా రామోజీ..? -రిలయన్స్‌ కంపెనీని మేం వెనుకకు పంపామని అబద్దాలు వండి వారుస్తున్నారు చంద్రబాబు హయాంలో సెటాప్‌ బాక్సుల తయారీ కోసం రిలయన్స్ వారికి 50 ఎకరాల భూమి కేటాయించారు. ఆ భూమి లిటిగేషన్స్‌ ఉన్న కారణంగా దానిపై కొంత మంది కోర్టుకు వెళ్లారు..కోర్టుల్లో కేసులు తేలకముందే ప్లాంట్‌ ఇక్కడ పెట్టలేమని రిలయన్స్‌ వారు వెళ్లిపోయారు.

ప్రముఖ కంపెనీ పెట్టుబడులకు ముందుకు వచ్చినప్పుడు ఇబ్బంది లేని భూమిని కేటాయించాలి.ఇలా రిలయన్స్‌కి లిటిగేషన్‌ భూమి కట్టబెట్టడం చంద్రబాబు తప్పిదం కాదా..దాన్ని కూడా మా ప్రభుత్వానికి ఆపాదించి రిలయన్స్‌ కంపెనీని మేం వెనక్కు పంపామని అవాస్తవాలు చెప్తున్నారు. లులు గ్రూప్‌ కంపెనీకి విశాఖపట్నం నడిబొడ్డున 14 ఎకరాల భూమి కేటాయించారు.దాని విలువ ఎకరాకు రూ. 50 నుంచి రూ.100 కోట్లు ఉంటుంది. మొత్తం భూమి విలువ రూ. 750 కోట్ల నుంచి రూ. 1400 కోట్ల మధ్యలో ఉంటే నామమాత్రపు ధరకు కట్టబెట్టారు. 2017లో భూమి అప్పజెప్తే 2019 వరకూ కనీసం ఒక్క రూపాయి లీజు డబ్బు చెల్లించలేదు. ఆ తర్వాత వారే వెళ్లిపోతే మేమేదో వెనక్కి పంపామని రామోజీ రాస్తుంటాడు. అదానీ డేటా సెంటర్‌ కు గతంలో భూమి కేటాయించారు..రూ.70 వేల కోట్లు పెట్టుబడులు పెడతారని ఆనాడు చెప్పారు.దానిలో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి పెట్టించారా..?ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత పెట్టుబడులు పెడతారని అడిగితే రూ.14500 కోట్లు వాస్తవ పెట్టుబడులు పెడతామని చెప్పారు.

మేము వచ్చాక అదానీ డేటా సెంటర్‌ కు 150 ఎకరాలు కేటాయించాం..గత క్యాబినెట్‌లో మరో 50 ఎకరాల భూమి కేటాయించాం.ఇప్పుడు అదే అదానీ గ్రూప్‌ వారు గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్లో హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు కింద వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు.జాకీ కంపెనీని పంపించింది ఎవరు..? మాకు అంత మార్కెట్‌ లేదు..పెట్టుబడులు పెట్టలేమని మీ ప్రభుత్వ హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారు. మేమేదో దాడులు చేశాం..బెదిరించాం అందుకే వెళ్లిపోయింది అని తప్పుడు రాతలు రాస్తారు. ప్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ కంపెనీపై సెబీ వారు అవినీతి ఆరోపణలు చేశారు.దివాళా దిశగా ఉన్న కంపెనీ అది..అది వెళ్లిపోవడాన్ని కూడా మా ఖాతాలో వేసేసి వార్తలు రాస్తారు.

అమరరాజా పక్క రాష్ట్రాల్లో విస్తరణ చేయకూడదా..?:
దుష్టచతుష్టయం, పచ్చ మీడియా ఈ ప్రభుత్వం మీద బురద జల్లడమే ఒక పనిగా పెట్టుకున్నారు.అమరరాజా కంపెనీని కూడా ఈ లిస్టులో యాడ్‌ చేశారు.. అమరరాజా వారు ఒక్క ఏపీలోనే పెట్టుబడులు పెట్టాలని ఏమైనా రూల్‌ ఉందా..? వాళ్లు వ్యాపార కార్యకలాపాలు విస్తరించడానికి వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోకూడదా..? విస్తరణలో భాగంగా తెలంగాణాలో పెట్టుబడి పెడితే.. తెలంగాణాకు వెళ్లిపోతుంది అని రాయడం విడ్డూరం. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టిన తర్వాత కూడా ఏపీలో ఉన్న తమ సంస్థకు వారు కొన్ని పెట్టుబడులు పెట్టడం వాస్తవం కాదా..?వాటర్‌ లో లెడ్‌ లెవల్స్‌ మోతాదును మించి ఉన్నప్పుడు కాలుష్య నియంత్రణ మండలి అదుపుచేయమని నోటీసులు ఇచ్చింది.కోర్టులు కూడా నోటీసులు ఇచ్చి అదుపుచేయమంటే దాన్ని మేం వేధించామని రాస్తారు.

పెట్టుబడులు రాకూడదన్నదే వారి అక్కసు:
-గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరుగుతున్న ఈ శుభసందర్భంగా జగన్‌ హయాంలో ఈ రాష్ట్రానికి అసలు పెట్టుబడులే రాకూడదనే అక్కసుతో చేస్తున్న ప్రచారం ఇది.ఎంత సేపు ఐటీ కంపెనీలు రావడం లేదు అని గోలచేస్తున్న ఈనాడు ఇన్ఫోసిస్‌ విశాఖలో మొదలు పెట్టబోతున్న క్యాంపస్‌ గురించి రాయదేం..? ర్యాండ్‌స్టాడ్‌ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖపట్నం వస్తున్నాయి..దీన్ని ప్రజలకు తెలియజేయమని అడుగుతున్నాం. డబ్ల్యుఎన్‌ఎస్‌ గ్లోబల్‌ 3300 మందితో కార్యకలాపాలు ప్రారంభించింది.ఇది జగన్మోహన్‌రెడ్డి చొరవతో మాత్రమే ప్రారంభం అయిందని ఆ సంస్థ వారు చెప్పారు.

ఆ రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ బాబూ..?
-మాట్లాడితే రూ.20 లక్షల కోట్ల ఎంఓయూలు చేశాను అని చంద్రబాబు ఊదరగొడుతున్నాడుఏవి నీ 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ.. చూపించు..?కేవలం 7 నెలల కాలంలోనే ఏపీకి రూ.40 వేల కోట్ల పెట్టబడులు వచ్చాయని కేంద్ర సంస్థలే చెప్పాయి.ఒక్కసారన్నా ఇది మీ పత్రికల్లో ప్రచురించారా..? టీవీలో చూపించారా..? 2021–22లో వృద్ధి రేటు దేశం మొత్తంలో 8.9 శాతం ఉంటే అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా మన ఏపీలో 11.40 శాతం ఉంది.ఇలాంటటివి ఎందుకు ప్రజలకు చేరువ చేయడం లేదు..ఈనాడు, ఆంధ్రజ్యోతి వైఖరిని ప్రజలు గమనించి, వారి రాతలను ఖండించాలని కోరుతున్నా.

ఈ పచ్చ మీడియా వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరగడం లేదు.కనీసం ఈ పత్రికలను ప్రజల మనసుల్లో నుంచి తీసేయాలి.2019–20లో ఎగుమతుల్లో ఏపీ 7 వ ర్యాంకులో ఉంటే 2021కి 4వ స్థానానికి తీసుకొచ్చాం.లాజిస్టిక్‌ ఈజ్‌ ఎక్రాస్‌ డిఫరెంట్‌ స్టేట్స్‌ ఇండెక్స్‌లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది.చంద్రబాబు హయాంలో 2018–19 పారిశ్రామిక వృద్ధి రేటు 5 శాతం ఉంటే మా హయాంలో సుమారు 12.78 శాతం ఉంది. చంద్రబాబు తన హయాంలో పారిశ్రామిక బకాయిలు రూ.3675 కోట్లు పెట్టి వెళ్లాడు.చంద్రబాబు బకాయిలను తీర్చడంతో పాటు రూ.1715 కోట్లు రాయితీలు మేం వచ్చాక ఇచ్చాం. విద్యుత్‌ బకాయిలు చూస్తే.. చంద్రబాబు హయాంలో రూ.1143 కోట్లు విద్యుత్‌ రాయితీలను క్లియర్‌ చేశాం.

స్థిరమైన లక్ష్యం, దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం:
ఒక స్థిరమైన లక్ష్యం, దృఢమైన సంకల్పం, మొక్కవోని ఆత్మ విశ్వాసంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.కోవిడ్‌ మహమ్మరి వచ్చినా జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం 11.40 శాతం వృద్ధి రేటును సాధించింది.ఇది జగన్‌ పరిపాలన దక్షతకు నిదర్శనం.ఈ ప్రభుత్వంలో 108 భారీ పరిశ్రలు వచ్చాయి…1.08 లక్షల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వచ్చాయి.రూ.74481 కోట్ల వాస్తవ పెట్టబడులు వచ్చాయి.10.70 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ కల్పన జరిగింది.

గత ప్రభుత్వం వనరులను నిర్లక్ష్యం చేస్తే మేం ఇప్పుడు వినియోగిస్తున్నాం:
సుదీర్ఘమైన తీరప్రాతం, మూడు ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ ఉన్న ఏకైక రాష్ట్రం మనది.మూడు కంటే ఎక్కువ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులున్న రాష్ట్రం మనది.ప్రపంచ స్థాయిలో విశాఖలాంటి అద్భుతమైన నగరం మనకు ఉంది. ఇన్ని వనరులున్నా గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది.చంద్రబాబుకు సిగ్గు లజ్జా ఉండి ఉంటే ఈ రోజు రాసిన ఫ్యాక్ట్‌ షీట్‌ కు సరైన సమాధానం.. ప్రత్యేక హోదా అని చెప్పాల్సింది.

బీజేపీ వారు ప్రత్యేక హోదా మనకు ఇచ్చి ఉంటే ఇలాంటి వార్తలు రాసుకునే బాధ చంద్రబాబుకు ఉండేది కాదు.ఆ ప్రభుత్వంలో చంద్రబాబు భాగస్వామిగా ఉండి, హోదా గురించి డియాండ్‌ చేయలేదు.సొంత కలెక్షన్‌ కోసం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుని నంగనాచి వేషాలు వేస్తే ప్రజలు లాగి గూబమీద కొడతారు.అదే మొన్నటి ఎన్నికల్లో జరిగింది…చంద్రబాబు ఎన్నటికీ మారడు అని ప్రజలు అనుకుంటున్నారు. డబ్బు మీద ప్రేమ తప్ప సామాన్యుడిపై ఆయనకు ప్రేమ ఉండదని ప్రజలు లెంపకాయ కొట్టి మరీ పక్కన పెట్టారు.అలా పక్కన పెట్టారనే ప్రజల మీద ద్వేషం, కోపం, రాష్ట్రం మీద ఉన్న పగ వల్ల చేతిలో ఉన్న మీడియా ద్వారా నిరంతం విషం చిమ్ముతూనే ఉన్నాడు.

సమ్మిట్‌ జరుగుతుంటే బాధ్యత గల ప్రతిపక్షనేత చేయాల్సిందేంటి..? చేస్తుందేంటి..?
చంద్రబాబూ .. నీ పద్దతి మార్చుకో…బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఇలాంటి సమ్మిట్‌ జరిగేటప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటి..?సలహాలు సూచనలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా..?చంద్రబాబు పోతే తప్ప ఈ రాష్ట్రానికి దరిద్రం పోదు అని సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

నాలుగు వారాల్లో భావనపాడు పోర్టుకు సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన:
దశాబ్ధాలుగా కలగా ఉన్న భావనపాడు పోర్టుకు.. ప్రజలందరి ఆనందోత్సాహాల మధ్య మరో నాలుగు వారాల్లోనే జగన్‌ శంకుస్థాపన చేయబోతున్నారు.పోర్టుతో పాటు పారిశ్రామిక వాడ కోసం 4వేల నుంచి 6 వేల ఎకరాల ల్యాండ్‌బ్యాంకు కూడా తీసుకొస్తున్నాం. భావనపాడు పోర్టుకు గంటన్నర దూరంలో అన్ని రకాల కనెక్టివిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

పవన్‌ కళ్యాణ్‌ కు స్క్రిప్ట్‌ ఎక్కడ నుంచి వస్తుందో చెప్పగలడా..?
ఐప్యాక్‌ అనేది మా పార్టీకి సలహాలు, సూచనలు చేయడానికి ఉందని మేం ఓపెన్‌గా చెప్పుకున్నాం. పవన్‌ కళ్యాణ్‌కి స్క్రిప్ట్‌ ఎవరు రాస్తారో ఓపెన్‌గా చెప్పుకోమనండి. ఏ ఫిల్మ్‌ డైరెక్టర్‌ రాసిస్తాడో… ఏ రాజకీయ పార్టీ కార్యాలయంలో ఆ స్క్రిప్ట్‌ తయారవుతుందో పవన్ చెప్పాలి. రోడ్లు ఐప్యాక్‌ టీం ఎలా డిసైడ్‌ చేస్తుంది..? ఇది దుష్ప్రచారం మాత్రమే.

LEAVE A RESPONSE