Home » అర్హులైన ప్రతీ రైతుకి రైతు భరోసా ఇవ్వాలి

అర్హులైన ప్రతీ రైతుకి రైతు భరోసా ఇవ్వాలి

-కమిటీలు, కమీషన్ల పేరు మీద కాలయాపన
-రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినయ్…చేతలు తంగేళ్లు దాటుతలేవు
-కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదు
-బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన నుండిరూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ల పేరు మీద అనేక హామీలు ఇచ్చారు.

ఇచ్చిన హామీలకు కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిన లక్షల కోట్ల రూపాయలను వసూల్ చేసి హామీలు అమలు చేస్తామని చెప్పారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతుంటే ఇప్పుడు కమిటీలు, కమీషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులకు పైసలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఉపముఖ్యమంత్రి నాయకత్వంలో ఒక కమిటీ వేసి విచారణ చేయాలని రేవంత్ రెడ్డి కి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? రాహుల్ గాంధీ పార్లమెంటులో శంకరుడి ఫోటో పట్టుకొని అభయముద్ర, అభయహస్తం అని ముచ్చట చెప్పిర్రు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ లోని అభయహస్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఎకరాకు రూ.15వేల రైతు భరోసా, కౌలు రైతులకు రూ.12వేలు, మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించడం, పంటల భీమా, అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు.

రైతు కమీషన్, కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు. వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తమని చెప్పిర్రు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళిచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మీదనే గౌరవం లేదు. తొలుత రైతు రుణమాఫీ అని చెప్పిర్రు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి తో, ఇంకో నలుగురు మంత్రులతో కమిటీ వేసిర్రు. అడ్డగోలుగా మాట్లాడి, హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఆగస్టు 15 నుంచి 30లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పిర్రు. వడ్డీ లేని రుణాలు అని చెప్పిర్రు. 63లక్షల మంది మహిళలకు రూ.5లక్షల బీమా అన్నరు.ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు నెలలోగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ నెలనో చెప్పలేదు.

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి పోతే అక్కడి దేవుడి మీద ఒట్టేసి అగస్టు 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తా అని కొత్త మాట చెప్పిండు. అర్హులైన ప్రతీ రైతుకి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినయ్…చేతలు తంగేళ్లు దాటుతలేవు.

నిన్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు తన భూమిని కొందరు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేలుకొని, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం అధికారంలోకి రావడానికే రేవంత్ రెడ్డి ఆగం ఆగం నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఓడదాటాక ఓడ మల్లన్న..ఓడ దాటినంక బోడ మల్లన్న అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు…వెంటనే రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించాలి.

ఆంధ్రలో కలిసిన ఏడు మండలాల గురించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడు పట్టించుకోలేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదు. నేటి ఫిరాయింపుదారులే రేపు ఫిరంగులై పేలుతరని కేసీఆర్ కి గతంలోనే చెప్పిన.

పాత బస్తీల విద్యుత్ బకాయిలు వసూలు చేయడానికి టెండర్లను పిలిచి ఏజెన్సీలకు అప్పజెప్పడం మేం కాదనలేదు. మాట్లాడితే అంబానీ, అదానీ పేరు తప్ప ఇంకోటి రాదు.. పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం తెలంగాణ ప్రభుత్వంతో అయితలేదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలు నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎంపీలందరం కృషి చేస్తాం.

Leave a Reply