– వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం
– రోగులకు గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో ఉచితంగా చికిత్స
– మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం : సమాజాన్ని పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. శనివారం సాయంత్రం వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్యాన్సర్ వ్యాధి బాధితులు, వారి సహాయకులుతో మంత్రి సుభాష్ తన క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ఎవరు భయపడవద్దని, మనోధైర్యంతో వ్యాధిని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వ్యాధి తీవ్రతను బట్టి మెరుగైన వైద్య సేవలు, అవసరమైన మందులు గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య సేవలు అందేలా ఇప్పటికే వైద్యులతో మాట్లాడామని, బాధితులు ముందుకొస్తే ఉచితంగా వైద్యం, మందులు అందిస్తామన్నారు.
రామచంద్రపురం కెవిఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగ సతీష్ కుమార్ కోట మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఏటా క్యాన్సర్ తో 70 వేలమంది చని పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు మామోగ్రఫి, పాప్ స్మియర్ పరీక్షలు, పురుషులు కొలనోస్కోపీ పరీక్షలు ముందుగా చేయించుకుని క్యాన్సర్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
8 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలు సర్వావాక్ (Cervavac) వ్యాక్సిన్ ముందస్తుగా తీసుకుంటే క్యాన్సర్ ను రాకుండా అడ్డుకోవచ్చు అన్నారు. నిరంతరంగా దగ్గు, శ్వాస ఆడక పోవడం, బరువు తగ్గడం, అలసట, గడ్డలు, మల మూత్రాలలో రక్తం పడడం,నోటిలో పుండ్లు, తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లాలని సూచించారు. మంచి ఆహారపు అలవాట్లు, రోజువారి వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం అలవర్చుకోవడం ద్వారా క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు అన్నారు.
మంత్రి సుభాష్ క్యాన్సర్ బాధితులకు, నిరుపేదలకు సహాయపడాలనే ఉన్నత ఆశయంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. వ్యాధి బాధితుల వివరాలు నమోదు చేయడంతో పాటు, అవసరమైన కొన్ని మందులను ఉచితంగా మంత్రి సుభాష్ తండ్రి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.