• ప్రజలతో… ప్రజలచే… ప్రజల కోసం చేస్తున్న గొప్ప అభివృద్ధి పండుగ
• 30 వేల పనులు, రూ.4,500 కోట్ల నిధులతో ముందడుగు
• సంక్రాంతి నాటికి పనులు పూర్తయ్యేలా ప్రణాళిక
• అన్ని శాఖల సమన్వయంతో పనులు జరగాలి
• అధికార యంత్రాంగం బాధ్యతగా మెలగాలి
• గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో కూడా తెలియని దౌర్భాగ్యం
• నిధుల మళ్లింపు ఎలా, ఎక్కడికి చేశారన్నది బ్రహ్మ పదార్థం అయిపోయింది
• ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవం రాష్ట్రానికి వరం
• మోదీ దిశానిర్దేశం, కేంద్ర సాయంతో రాష్ట్రాభివృద్ధికి ముందడుగు
• కంకిపాడులో పల్లెపండుగ కార్యక్రమంలో అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి, ప్రసంగించిన ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్
‘రాజకీయాల్లో ప్రజల మన్ననలు పొందడం, వారి కోసం పాలకులతో పోరాడటం సులభమే కావొచ్చు. పరిపాలన చేతికొచ్చాక ప్రజల అభిమానం చూరగొనడం, వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని జాగ్రత్తగా ముందుకు నడిపించడంలోనే అసలైన నాయకత్వం దాగుంటుంది. గ్రామగ్రామాన నేటి నుంచి వారం రోజులుపాటు సాగే పల్లె పండుగ కార్యక్రమం ఇంత నిండుగా జరుగుతుంటే మదిలో ఆనందంగా ఉంది. ఎన్నికల ముందు కూటమి జట్టుగా ముందుకు వెళితేనే రాష్ట్రాభివృద్ధి పరుగులు తీస్తుందని నేను నమ్మి తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తోంద’ని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయం అయినా వారి మధ్యనే జరగాలి.. వారితోనే జరగాలి.. వారి వల్లనే జరగాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. ఎలాంటి గుట్టుమట్లకు తావివ్వకుండా పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వారం రోజుల పాటు పల్లెల్లో నిర్వహించబోయే ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని కంకిపాడులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. కంకిపాడు, పునాదిపాడుల్లో చేయతలపెట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ‘‘రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభల్లో 30 వేల పనులకు తీర్మానాలు చేశారు. ప్రజలంతా కలిసి తమ గ్రామాల్లో కావల్సిన అభివృద్ధి పనులను వారే తీర్మానించుకున్నారు. దీనిలో ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేదు. పూర్తిగా ప్రజలు తీసుకున్న అభివృద్ధి పనులకు నేటి నుంచి వారం రోజులపాటు శంకుస్థాపనలు జరగనున్నాయి. సంక్రాంతి నాటికి పనులు పూర్తి కావాలన్నదే లక్ష్యం.
కీలకమైన పనులన్నీ ఇప్పటికే గుర్తించాం. దానికి కలెక్టర్లు పరిపాలన ఆమోదాలు ఇచ్చారు. దీంతో పనులన్నీ మొదలుకానున్నాయి. ప్రతి పనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునేలా సమాచార బోర్టులు ఏర్పాటు చేయనున్నాం. శంకుస్థాపన చేసిన దగ్గరే ఆయా పనుల పూర్తి వివరాలు దీనిలో ఉంటాయి. సామాన్యుడు సైతం సులభంగా పనులు, నిధులు, నాణ్యత తెలుసుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి పారదర్శకతతో పనులు జరగాలన్నదే ప్రధాన లక్ష్యం. ప్రజలంతా ఈ పనుల్లో భాగస్వామ్యం కావాలి.
• గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ మంత్రి ఎవరో తెలీదు
ప్రతిసారీ గత ప్రభుత్వాన్ని విమర్శించాలని అనుకోను కానీ… గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం మాత్రం కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. గత ప్రభుత్వంలో జరిగిన విధానం ఎలా ఉంది.. ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలను ఎంత పారదర్శకతతో ఉన్నాయో ప్రజలకు చెప్పాలని భావిస్తాను. గత ప్రభుత్వంలో ప్రజలకు కనీసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా తెలీని దౌర్భాగ్యం ఉండేది. అధికారులు, సిబ్బంది అనేది అసలు తెలీదు. ఇక గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రజలు పనులు చేసేందుకు తీర్మానం కాదు కదా… పనులు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని అర్జీ ఇచ్చినా పరిష్కరించిన దాఖలాలు లేవు. అసలు పంచాయతీరాజ్ నిధులు ఏమయ్యాయో కూడా తెలీదు.
నేను ఈ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకసార్లు నిధుల మీద సమీక్షించినా గత ప్రభుత్వంలో నిధులు ఎలా, ఎటు వెళ్లాయనేది ఓ బ్రహ్మ పదార్థంలా కనిపించింది. కూటమి ప్రభుత్వంలో ప్రతి పని ప్రజలకు తెలియాలి. ప్రజలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో గ్రామసభలను రికార్డు స్థాయిలో నిర్వహించాం. గ్రామాల్లో ప్రాధాన్యతలను బట్టి ఏం పనులు చేయాలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు చేసిన తీర్మానాలతోనే ఇప్పుడు పనులు మొదలుపెడుతున్నాం.
• ప్రజల బాగు కోసం బలమైన నాయకత్వం కావాలన్నదే ఆకాంక్ష
ప్రజలందరి బాగు కోసం బలమైన నాయకత్వం, అనుభవపూర్వక నాయకత్వం కావాలన్నదే నా ఆకాంక్ష. 2014 నుంచి నేను చెబుతున్నది ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన అనుభవం రాష్ట్రానికి వరం అవుతుంది. అది రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న పనులను చూస్తే గతంలో కూటమి కోసం నేను తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తుంది. కేంద్రం సహకరించడం రాష్ట్రానికి అదనపు బలం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిశానిర్దేశం, కేంద్ర సహకారంతో ముందడుగు వేస్తున్నాం. పాలనలో చంద్రబాబు పనితనం నాకు స్ఫూర్తి. ఆయన క్యాబినెట్ సమావేశాల్లో లేవనెత్తే అంశాలు సీనియర్ బ్యూరోక్రాట్ లు కూడా సమాధానం చెప్పలేనంత లోతుగా ఉంటాయి. పాలనలో ఆయన చూపించే చొరవ అద్భుతం. నిరంతరం ప్రజల గురించి ఆలోచించే తీరు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకున్న విజన్ కచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తుందని భావిస్తున్నాను.
• నిజాయతీగా పనిచేసే అధికారులకు ప్రొత్సాహం
ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. దీన్ని అంతే బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాకినాడలో ఓ అటవీ శాఖ అధికారి నా పేరు ఉపయోగించి చేస్తున్న కొన్ని పనులు నా దృష్టికి ప్రజలే తీసుకొచ్చారు. వెంటనే నేను స్పందించాను. అసలు జరిగిన విషయాన్ని విచారించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించాను. వచ్చిన ఆరోపణలు రుజువైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదు. మేమెంత నిజాయతీగా, నిబద్దతతో ప్రజల కోసం పనిచేస్తున్నామో అధికారులు కూడా అలాగే పని చేయాలి. ప్రజల ఆకాంక్షలు, వారి అవసరాలు తీర్చడానికి అధికారం పనిచేయాలి. అధికారుల విషయంలో చిత్తశుద్ధితో ముందుకు వెళ్తాం. పని చేసిన వారికి తగిన ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఏమైనా తేడా వస్తే అంతే కఠినంగా వ్యవహరిస్తాం.
• సమన్వయంతో ముందుకు వెళ్లాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జరిగే పనులను ఇతర శాఖలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలి. దాదాపు 10 శాఖలను జాగ్రత్తగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తేనే పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. ఉపాధి హామీ పథకం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దానిని సరిగా వినియోగించుకుంటే గ్రామాల్లో చాలా పనులు చేసుకోవచ్చు.
కేంద్రం దీనికి వెచ్చిస్తున్న నిధులను, పనిదినాలను గ్రామీణుల జీవనస్థితిగతులు మార్చడానికి ఉపయోగించుకోవచ్చు. పెనమలూరు నియోజకవర్గం, కంకిపాడులో జరుగుతున్న ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కంకిపాడు – రొయ్యూరు వయా గోడవరం రోడ్డును నవీకరణ చేయాలని కోరారు. వెంటనే దానిపై తగు చర్యలు తీసుకొని రోడ్డు వేసేలా ముందుకు వెళ్తాం. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎదురుమొండి – గొల్లమంద పరిధిలోని లంక గ్రామాల్లో అనుసంధాన రహదారులు కావాలని ప్రతిపాదించారు. వీటిని కూడా పూర్తి చేసేలా ఆదేశాలు ఇస్తున్నాను. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని, అక్కడ నీటిని ఓ బాటిల్ లో పట్టి మరీ సమస్య చెప్పారు.
దీనిపై గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్కడి సమస్యను తీర్చాలని ఆదేశిస్తున్నాను. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పదల్చుకున్నాను. గత ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే ప్రజా సమస్యల కోసం ఇలా చెప్పిన దాఖలాలు లేవు. ఎప్పుడూ బూతులు, తిట్లు తప్ప గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు చేసింది శూన్యం. కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా నడుచుకోవడం ముచ్చటగా ఉంది. ఎంతోకాలంగా పెండింగ్ లో మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైను విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్తాను.
సుందర గ్రామాలు సాకారం కావాలి
చిత్తశుద్ధి, పారదర్శకత, అభివృద్ధి కాంక్షతో పనులన్నీ చేస్తున్నాం. పనులతో గ్రామాలు సుందరం కావాలి. పల్లెల్లో మెరిసిపోవాలి. రోడ్లు, గోకులాలు, పాఠశాలలకు ప్రహరీలు, ఉద్యానవనాలు, ట్రెంచ్ లు, రూఫ్ టాప్ లు, పారిశుద్ధ్య పనులు ఇలా ప్రాధాన్యం ఉన్న పనులన్నీ తీసుకున్నాం. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 120 పాఠశాలలకు ప్రహరీలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలకు రూఫ్ టాప్స్, సామాజిక భవనాలు రావాలని భావిస్తున్నాం.
అలాగే ఆర్థిక సంవత్సరంలో 25.50 కోట్ల పని దినాలు, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఊరి అభివృద్ధి కోసం జరుగుతున్న పల్లె పండుగలో గ్రామస్థులంతా ఉమ్మడిగా పాలు పంచుకోవాలి. దీనిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామం కోసం కదలిరండి. దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేనంత అభివృద్ధిని గ్రామాల్లోకి తీసుకొస్తున్న ఈ శుభతరుణంలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ముందుండి నడిపించాలి’’ అని అన్నారు.
ఈ సభలో మంత్రి కొల్లు రవీంద్ర , ఎంపీ వల్లభనేని బాలశౌరి , ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్ , వెనిగండ్ల రాము , కాగిత కృష్ణ ప్రసాద్ , వర్ల కుమార్ రాజా , ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ , పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ , పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచులు రోడ్లపాలయ్యారు : మంత్రి కొల్లు రవీంద్ర
ఎక్సైజ్, గనులు.శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ “గత ప్రభుత్వ హయంలో రోడ్లు వేసిన వారు రోడ్లు పాలయ్యారు. సకాలంలో బిల్లులు చెల్లించపోవడంతో సర్పంచులు ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకొచ్చారు. కేంద్రం విడుదల చేసిన రూ.12 వేల కోట్ల నిధులు కూడా సక్రమంగా ఖర్చు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. 3 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల తారు రోడ్లు, 10వేల వాననీటి సంరక్షణ కందకాలు నిర్మిస్తున్నాం అంటే దానికి కారణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ .
గత ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు పార్టీ కలర్స్ వేసుకున్నారు తప్ప గ్రామాల్లో చేసిన పనులు అయితే ఏమీ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలుగా పదవులు వెలగబెట్టిన నాయకులు జిల్లాకు చేసింది ఏమీ లేకపోయినా… జిల్లా పరువు మాత్రం తీశార’ని అన్నారు.
మహాత్ముడి మాటల స్ఫూర్తితోనే పల్లె పండుగ : బాలశౌరి
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ…“గ్రామాలు సామాజికంగా, ఆర్థికంగా పరిపుష్టి చెందితేనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయి అని మహాత్మాగాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు సృష్టించాం. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం తెలియాలంటే ఆయన తీసుకున్న శాఖలను చూస్తే సరిపోతుంది.
గత ప్రభుత్వంలో దాదాపు 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ కుటుంబాలు రోడ్డున పడకూడదని భావించి ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందించారు. వరదల వల్ల 400 పంచాయతీలకు నష్టం జరిగితే … పంచాయతీకి రూ. లక్ష చొప్పున రూ. 4 కోట్లు అందించి దాతృత్వం అంటే ఏంటో చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ . గత ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ నిధులు సక్రమంగా వినియోగించుకోలేకపోయింది. ఆ నిధులను సద్వినియోగం చేసుకొని మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ప్రజల దాహార్తి తీరుస్తాం. ఈ ప్రాంత వాసుల చిరకాల వాంఛ మచిలీపట్నం- రేపల్లె రైల్వే లైన్. ఆ ప్రాజెక్ట్ అతి త్వరలోనే సాకారం చేస్తాం” అని అన్నారు.
గ్రామాలను స్వర్గసీమలుగా మారుస్తాం : బోడే ప్రసాద్
పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ… “రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. సంక్రాంతి కల్లా పనులు పూర్తి చేసి గ్రామాలను స్వర్గసీమలుగా మారుస్తాం. పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు మంత్రి గా ఉన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో దాదాపు 90 గ్రామాల్లో మౌలిక సదుపాయలు పూర్తి చేస్తామ”ని అన్నారు.