మతమార్పిడి.. లవ్ జిహాద్.. ఉగ్రవాదం.. గురించి అవగాహన పొందేందుకు ప్రతి ఒక్కరూ “ది కేరళ స్టోరీ” సినిమా చూడాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ (VHP) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ పేర్కొన్నారు. కళాశాల అమ్మాయిలను ప్రేమ పేరుతో మతం మార్చి.. తల్లిదండ్రులకు దూరం చేసి ఉగ్రవాదం వైపు ఏ విధంగా మళ్లిస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించే కేరళ స్టోరీని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. మతమార్పిడి వ్యవస్థ వల్ల కుటుంబాలు ఆగమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం దుర్గా వాహిని, మాతృ శక్తి ఆధ్వర్యంలో 100 మంది కళాశాల విద్యార్థినులు కాచిగూడ లోని వెంకటరమణ థియేటర్ లో సినిమాను తిలకించారు. ప్రతి కళాశాల విద్యార్థిని కేరళ స్టోరీ తప్పకుండా చూడాలని.. లవ్ జిహాద్ ను ఎదుర్కోవాలని పండరినాథ్ సూచించారు. నిన్నటి వరకు హిందీ భాష లో ఉన్న సినిమా.. 18 వ తారీకు నుంచి తెలుగు భాషలో కూడా ప్రదర్శిస్తున్నారు. సినిమాను తప్పక చూసి మతమార్పిడిని ఎదుర్కోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు సమాజాన్ని కోరుతున్నారు. సినిమాకు వెళ్లిన వారిలో విశ్వహిందూ పరిషత్ నాయకులు పుప్పాల వెంకటేష్, పగుడాకుల బాలస్వామి, పద్మశ్రీ, వాణి సక్కుబాయి ఇతర ప్రముఖులు ఉన్నారు.