Suryaa.co.in

Andhra Pradesh

బొప్పూడి ప్రజాగళం సభకు సర్వం సిద్ధం

(ఎం.ఎస్.రాజు)

ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ప్రజాగళం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడుపార్టీల నాయకుల నిర్విరామ కృషితో వేదిక నిర్మాణం శరవేగంగా పూర్తయింది. తదనంతరం వేదికను ఎన్ఎస్ జి అధికారులకు అప్పగించారు. ఇక ప్రధాని మోడీ రాక దృష్ట్యా 3 హెలీప్యాడ్లు, అలాగే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, ఇతర నేతలకోసం మరో 3 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు.

ఇప్పటికే భారత వాయుసేన హెలీకాప్టర్లపై ప్రధాని మోడీ భద్రతా సిబ్బంది సభా ప్రాంగణానికి వచ్చి ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది.సభా ప్రాంగణంలో 5వేలమంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు, జాగిలాలతో అణువణువు తనిఖీలు నిర్వహించడం చేశారు.రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలమందికి పైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో అందుకు తగినట్లుగా ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.అలాగే సభా ప్రాంగణంలో మోడీ, చంద్రబాబు, పవన్ ప్రసంగాలను వీక్షించేందుకు ప్రజల సౌకర్యార్థం 20 భారీ ఎల్ ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

ఇదిలావుంటే తాజాగా ఎన్నికల షెడ్యూలు కూడా విడుదలైన నేపథ్యంలో ప్రజాగళం సభపై రాష్ట్ర ప్రజానీకం ఆసక్తి మరింత పెరిగింది. దీంతో ప్రజలు అన్ని భయాలు వీడి భారీగా సభకు తరలిరావడం ఖాయమని మూడు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు మూడు పార్టీల పొత్తు అనంతరం నిర్వహిస్తున్న తొలి ఉమ్మడి సభ కావడంతో ఈ సభపై జాతీయ మీడియా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఢిల్లీనుంచి పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు తరలిరావడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఇక ఈ ప్రజాగళం సభలో మూడు పార్టీల అధినేతలు త్రిమూర్తులు లాగా రాష్ట్ర భవిష్యత్తుకు దశ-దిశ నిర్దేశించడం ఖాయమని,వారి భరోసా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కూటమి మద్దతుదారులు అంటున్నారు. ఇక ప్రజాగళం సభావేదిక పైన టిడిపి, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తారని, ఒక్కోపార్టీకి 10 మంది చొప్పున మాత్రమే అనుమతి ఇస్తారని సమాచారం. ఈ సభలోనే జగన్ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ప్రకటించే అవకాశం ఉందని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు.

LEAVE A RESPONSE