– నేడు ధర్మవరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
– ఏర్పాట్లను పర్యవేక్షించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జాతీయ కార్యదర్శి, మంత్రి సత్యకుమార్ యాదవ్
*అటల్ జీ నాటి పాలనా విజయాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా జిల్లా కేంద్రాల్లో సభలు!
*పాల్గొనున్న కూటమి పార్టీ నేతలు
*ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ విగ్రహాల ఆవిష్కరణ
– దేశంలో సుపరిపాలనకు దివంగత వాజపేయి నాంది
– భాజపా జాతీయ కార్యదర్శి, మంత్రి సత్యకుమార్ యాదవ్
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రంగా ‘ఆటల్- మోదీ సుపరిపాలన యాత్ర’ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలో గురువారం అటల్ జీ విగ్రహావిష్కరణతో బస్సు యాత్ర ప్రారంభమై ,ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది.
జిల్లా కేంద్రం మీదుగా జరగనున్న ఈ యాత్ర అమరావతిలో డిసెంబరు 25వ తేదీ (అటల్ జీ శత జయంతి)న జరిగే సభతో ముగుస్తుంది. ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీనియర్ కేంద్ర మంత్రి అమిత్ షా లేదా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు. పార్టీ జాతీయ అధిష్ఠానవర్గం ఆదేశాలు అనుసరించి బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగించేందుకు, భాజపా రాష్ట్ర నాయకత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లా కేంద్రాలన్నింట్లో అటల్ విగ్రహావిష్కరణ జరిగేలా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు భాజపా జిల్లా శాఖ అధ్యక్షుల ద్వారా జరుగుతున్నాయి. స్థానిక తెదేపా, జనసేన నేతలు జిల్లా కేంద్రాల్లో జరిగే బహిరంగ సభ నిర్వహణలో భాగస్వాములు కానున్నారు. ఎన్డీఏ కూటమి నేతలు బహిరంగ సభల్లో పాల్గొనాలని కూటమి అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు
ధర్మవరంలో 3 కార్యక్రమాలు!
రాష్ట్ర మంత్రివర్గంలో భాజపా తరపున సత్యకుమార్ యాదవ్ ఏకైక మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహించే ధర్మవరం పట్టణం నుంచే బస్సు యాత్ర ప్రారంభించాలని అధిష్ఠానవర్గం నిర్ణయించడం గమనార్హం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పార్టీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ ధర్మవరం పట్టణంలో జరగనున్న అటల్ జీ విగ్రహావిష్కరణ, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లను బుధవారం స్వయంగా పర్యవేక్షించారు.
ఈ బహిరంగ సభలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నాయకుడు శ్రీనివాస వర్మ, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర కూటమి నేతలు పాల్గొనబోతున్నారు. ధర్మవరం పట్టణం కాషాయ జెండాలతో నిండింది. ఫెక్సీలు వెలిశాయి. కూటమిలోని తెదేపా, జనసేన పార్టీల జెండాలు కూడా రెపరెపలాడుతున్నాయి. ఈ పరిణామం కూటమి ఐక్యతను చాటుతోంది బహిరంగ సభ నిర్వహణ సందర్భంగా.. ధర్మవరo నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2వేల మంది పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం మంత్రి సత్యకుమార్ తన కుమార్తె ‘సంస్కృతి’ పేరుతో నిర్వహించే సేవా సమితి ద్వారా కోటి రూపాయల వరకు వ్యయంచేశారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థుల తరపున రూ.2.60 లక్షలను ఫీజుల కోసం మంత్రి సత్యకుమార్ తన సేవా సమితి ద్వారా చెల్లించారు.
ప్రత్యేక బస్సులు సిద్ధం!
‘ఆటల్-మోదీ సుపరిపాలన యాత్ర’ (ఆటల్ యోచన-మోదీ ఆచరణ) పేరుతో మూడు బస్సులను సిద్ధంచేశారు. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కూటమి నేతల ఫొటోలతో బస్సులను అందంగా తీర్చిదిద్దారు. ఈ బస్సులోనే నేతలు పర్యటించనున్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో భాజపా జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
అధిష్టానవర్గం నేతల పేర్లను ఖరారుచేసే పనిలో నిమగ్నమైంది. బస్సు యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బస్సు యాత్రలో పాల్గొనాలని కూటమి నేతలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు తెలిపారు. దేశంలో సుపరిపాలనకు దివంగత వాజపేయి నాంది పలికారు ఆయన ప్రవేశపెట్టిన విధానాలు ముఖ్యంగా స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు, గ్రామీణ రహదారులు, పంటల భీమా పథకం, కిసాన్ క్రెడిట్ కార్డులు, పనికి ఆహార పథకాలు, టెలీ కమ్యూనికేషన్ రంగం, విమానయానరంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యమైనవి.
ఆటల్ స్ఫూర్తితో పీఎం మోదీ కూడా దేశాన్ని అన్ని రంగాల్లో 2047 నాటికి నెంబర్ వన్ గా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అటల్ జీ పాలన గొప్ప తనాన్ని ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నాం. ఆటల్ జీ శతజయంతి సందర్భంగా అమరావతిలో జరిగే ముగింపు సభలో సీఎం చందబ్రాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, ఇతర నేతలు, మంత్రులు పాల్గొంటారు’ అని వివరించారు.