– వెన్నుపోటు పొడిచిన చేతులతోనే దండేసి దండం పెట్టే దౌర్భాగ్యుడు
– టీడీపీలో మసకబారిన చంద్రబాబు మార్క్
– బాబు పిట్టలదొర కబుర్లు.. ప్రజలు నమ్మరు
– మేనిఫెస్టో మాయం చేసినోడు.. మళ్లీ రోడెక్కాడు
– చంద్రబాబు మాయా రాజకీయం జగమెరిగిన సత్యం
– 2014 ఎన్నికల్లో 650 హామీలిస్తే 10 శాతమే నెరవేర్చాడు
– అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తానని ఎగొట్టాడు..
– డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మొండి చేయిచ్చాడు
– కర్ణాటకలో కాంగ్రెస్ హామీల్ని కాపీకొట్టి ఇప్పుడు ఊదరేస్తున్నాడు
– ఆల్‌ఫ్రీ బాబు మాటల్ని నమ్మేవారు ఎవరూ ఉండరు
– తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వెంటిలేటర్‌పై ఉంది
– అందుకే ఎల్లో మీడియాతో బతికించాలనుకుంటున్నాడు
– ఎన్టీఆర్ ఫొటోతో ఓట్లు దండుకునే ఎత్తుగడకు దిగాడు
– అయినా.. 2024లో బాబు ఘోర పరాభవం తప్పదు
– తేల్చి చెప్పిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు
డ్రామా కంపెనీని తలపించిన మహానాడు:
రాజమండ్రిలో రెండ్రోజుల పాటు చంద్రబాబు ఒక డ్రామా నడిపాడు. మహానాడు పేరిట జగన్‌మోహన్‌రెడ్డి ని తిట్టిపోయడానికి, శాపనార్ధాలు పెట్టడానికి ఒక సభను నిర్వహించాడు. ఏ చేతులతోనైతే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి, ఆయన ప్రాణాల్ని నిలువునా తీశారో.. అదే చేతులతో ఆయన ఫొటోలకు దండలేసి దండం పెట్టడం చూస్తుంటే చంద్రబాబు ఎంత దౌర్భాగ్యుడో అర్థమౌతుంది.
శక పురుషుడ్ని చంపిన శకలక పురుషుడు బాబు:
పెద్దలు చెబుతున్నట్లు నంగనాచి కబుర్లు చెప్పేవాళ్లు.. చేసిందంతా చేసి ఏమీ చేయనట్లు నటించేవారు ఉంటారని చరిత్ర ఎప్పుడో చెప్పింది. ఇవాళ చంద్రబాబు తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే .. ఎన్టీ రామారావు కు నైతిక విలువల్లేవని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆయన ఒక శకపురుషుడు అని చెబుతున్నాడు. ఆయన దగ్గర్నుంచి అధికారం లాక్కున్న మరుక్షణమే ఎన్టీఆర్ ఫొటోలన్నీ తీసేసి హిమాయత్ నగర్‌లో ఉండే పార్టీ ఆఫీసు బాత్రూమ్‌లో పడేశారని అప్పట్లో పత్రికల్లో కథనాలు వచ్చాయి.
ఎన్టీఆర్ బర్త్‌డేకు ప్రతేటా మహానాడు పెట్టాల్సిన ఆనవాయితీ ఉంటే మే నెలలో ఎండలు మండిపోతున్నాయని నిన్నటిదాకా చెప్పి మహానాడును వాయిదాలేసుకుంటూ వచ్చిన బాబు ఇప్పుడు ఎన్నికలు రాగానే రాజమండ్రిలో మహానాడు పెట్టాడు. ఎన్టీఆర్ ఒక శకపురుషుడు అని బాబు చెబుతున్నాడు గదా.. అలాంటి శకపురుషుడికే వెన్నుపోటు పొడిచి ఆయన ప్రాణాలు పోయేవరకు క్షోభపెట్టిన బాబు శకలక పురుషుడు అవతారంగా చెప్పుకోవాలి.
కోతలరాయుడి అవతారంలో బాబు
రాజమండ్రిలో బాబు వల్లె వేసిన అబద్ధాల్ని చూస్తే ఆయన అధికారంలో లేడనే ఫ్రస్టేషన్ కనిపించింది. మళ్లీ కొత్త అబద్ధాల పుట్టతో ఆయన తయారయ్యాడు. ఎందుకంటే, 2024 ఎన్నికలు వస్తున్నాయి కనుక ప్రజల్ని ఏదోరకంగా ఆకట్టుకోవాలని.. తన మాయమాటలతో నమ్మించి అధికారంలోకి రావాలనే తాపత్రయంతో బాబు కోతలరాయుడి అవతారం ఎత్తాడు. అందులో భాగంగానే మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను తీసుకొచ్చి తన మేనిఫెస్టోగా చంద్రబాబు కొన్ని వాగ్దానాల్ని నిన్న వినిపించి బిల్డప్ ఇస్తున్నాడు. అయితే, ప్రజలు తనను గతంలోనే బాగా అర్థం చేసుకున్నారనే విషయం ఈ కాపీరాయుడు బాబు మరిచిపోయాడు. అతనికి గతం గుర్తు రావడం లేదు. ఆయన హయాంలో ప్రజల్ని ఎంతగా మోసం చేశాడంటే.. ఇక ఎప్పటికీ చంద్రబాబును నమ్మే ప్రసక్తే లేదనే నిర్ణయానికొచ్చిన స్థాయికి చేర్చాడు.
5 తొలిసంతకాల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు:
టీడీపీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోను చూస్తే అందులో 650కి పైగా వాగ్దానాలు ఉంటే.. ఆయన అధికారంలోకి వచ్చాక కేవలం 10 అంశాల్ని మాత్రమే బాబు నెరవేర్చారు. ఏ ముఖ్యమంత్రైనా తాను అధికార బాధ్యతలు స్వీకరించేటప్పుడు చేసిన తొలి సంతకానికి చాలా ప్రాధాన్యమిస్తాడు. తన తొలి సంతకంతో రాష్ట్రంలోని ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది కూడా ఆ ముఖ్యమంత్రి తనకు తాను సమీక్షించుకుంటాడు. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన ఐదు తొలి సంతకాల్లో ఏ ఒక్క సంతకానికి సంబంధించిన హామీని తాను నెరవేర్చలేదు.
మద్యం బెల్టుషాపులు ఎత్తేస్తానన్నాడు. రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అన్నాడు. వీటిల్లో ఏ ఒక్కటీ బాబు చేయలేదు. ఇవన్నీ చంద్రబాబు చేస్తానన్న తొలి సంతకాలు. వీటిల్లో ఒక్క సంతకాన్నైనా అమలు చేయలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయాడు. అలాంటిది, మళ్లీ ప్రజల ముందుకొచ్చి తనకు అధికారం ఇస్తే ఏదో ఊడబొడుస్తానని.. పీకుతానని ప్రగల్భాలు పలుకుతున్నాడు ఈ బాబు.
ధనవంతుల్ని చేస్తానంటూ బాబు డ్రామా అర్థమేంటంటే
2009 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు ప్రతీ ఇంటికి టీవీ ఇస్తానన్నాడు. అయితే, ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు. 2014 ఎన్నికల్లో ప్రతీ విద్యార్థికి ఐప్యాడ్ ఇస్తానన్నాడు. అధికారంలోకి రాగానే ఐప్యాడ్ కాదు గదా.. ఏ ఒక్క విద్యార్థికి కనీసం, నోట్‌ప్యాడ్ కూడా ఇవ్వలేదు. తక్కువలో తక్కువగా ఒక్క నోటు పుస్తకం కూడా అందజేయలేదు. మరి, అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేనోడు మళ్లీ ప్రజలకు పెద్దపెద్ద వాగ్దానాలు వినిపిస్తున్నాడు.
అన్నింటికన్నా.. బాబు నోట్లో నుంచి పెద్ద ఆశ్చర్యకరమైన వాక్యమేమంటే.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరినీ ధనవంతుల్ని చేస్తాడంట. అంటే, ప్రతీ సామాన్యుడు ఇప్పట్నుంచి పెద్దపెద్ద భవనాల్లో నివసిస్తున్నట్లుగా.. హెరిటేజ్ లాంటి పెద్దపెద్ద కంపెనీలు పెట్టినట్లు.. పెద్దపెద్ద బెంజి కార్లల్లో తిరుగుతున్నట్లు మనం భావించుకోవాలనేది బాబు ఆలోచన. ఇదే బాబు చెబుతున్న కొత్త డ్రామాగా అందరూ అర్ధం చేసుకోవాలి.
ఆ విషయాన్ని బాబు ఒప్పుకున్నాడు:
చంద్రబాబు ఇటీవల పర్యటనల్లో మరో కొత్త మాట మాట్లాడుతున్నాడు. రాష్ట్ర సంపద అంతా కొందరు చేతుల్లోనే ఉందని ఆయన చెబుతున్నాడు. ఇది ముమ్మాటికీ నిజమే. మేము ఇదే విషయాన్ని ఎప్పట్నుంచో చెబుతూ ఉన్నాం. చంద్రబాబు వల్లనే ఈ రాష్ట్ర సంపద కొందరికి మాత్రమే అందిందని.. ఆ మేరకు పేదలకు, పెత్తందార్లకు మధ్య క్లాస్‌వార్ జరుగుతుందని మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు.
బాబు వల్ల ఈ రాష్ట్రంలో కొంతమంది మాత్రమే బాగుపడ్డారు. బాబు తాబేదార్లు, ఆయన్ను భుజాలనెత్తుకున్న పచ్చమీడియా, ఆయన సామాజికవర్గ కొందరు పారిశ్రామికవేత్తలకు మాత్రమే మేలు జరిగి బాగు పడ్డారని మేం గతం నుంచి చెబుతూనే ఉన్నాం. ఇన్నాళ్లకు ఇదే విషయాన్ని చంద్రబాబు ఒప్పుకున్నాడు.
పేదల్ని ధనవంతుల్ని చేస్తాడా?:
పేదలు ధనవంతులు కావాలంటే, బాగా డబ్బు గడించిన ఉన్నత వర్గాలు వారిని దత్తత తీసుకోవాలంటూ చంద్రబాబు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు, ఈ మాట అనడానికే చంద్రబాబు సిగ్గు పడాలి. పేదలకు ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వం ఇస్తుంటే.. ఈ బాబు మాత్రం వాటిని సమాధులతో పోలుస్తూ కామెంట్లు చేస్తాడు. పెత్తందార్లను ఉసిగొలిపి పేదలకు వ్యతిరేకంగా లక్షల్లో ఫీజులు చెల్లించి కోర్టుల్లో ఇళ్ల స్థలాలు రాకుండా అడ్డంపడ్డాడు. అంటే, సెంటు భూమిని ప్రభుత్వం పేదలకు ఇస్తుంటే కన్నుకుట్టిన బాబు.. ఇప్పుడొచ్చి పేదల్ని ధనవంతులుగా మార్చుతామంటే ఎవరైనా నమ్మగలరా..? నమ్మరుగాక నమ్మరు.
అమరావతి ప్రాంతంలో 50వేల మందికి పైగా పేదలకు ఇళ్లు పట్టాలిస్తే.. చంద్రబాబు రేపు తాను అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తానంటాడా..? ఎటూ.. బాబు అధికారంలోకి వచ్చేది లేదు. పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేసేదీ లేదు. అసలు, రద్దు చేసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందర్నీ ధనవంతుల్ని చేస్తానని చెప్పడానికి ఆయనకు బుద్ధుందా..? అని అడుగుతున్నాను.
మాటలకు, చేతలకు పొంతనే ఉండదు:
బాబు మాట్లాడే మాటలకు చేతలకు పొంతనే ఉండదు. 2014 ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోలో ముస్లీంలకు ఇంగ్లీషు రెసిడెన్షియల్ స్కూళ్లు పెడతామని బాబు చెప్పాడు. అదే మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడితే.. అలా పెట్టడానికి వీల్లేదని చంద్రబాబు కోర్టులకెక్కాడు. మరీ, రాజకీయాల్లో ఇంత దుర్మార్గంగా పనిచేసే చంద్రబాబు వంటి నాయకుడు ఎక్కడా కనిపించడని చెబుతున్నాను.
ఆ కుటుంబంపై అంత కడుపుమంటా?
వెన్నుపోటుతో ఎన్టీరామారావు దగ్గర్నుంచి అధికారం లాక్కుని బాబు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన కాలంలో ఎక్కడా ఎన్టీఆర్ ఫొటో లేకుండా చేశాడు కదా..? మరి, ఇప్పుడే ఆయన్ను స్తుతించుకుంటూ.. ఆయన ఫొటోలకు దండలేస్తూ బాబు తిరగడంలో ఆంతర్యమేంటి..? అంటే, టీడీపీలో బాబు ప్రాభవం మసక బారిందని తెలుసుకుని.. మరలా ఎన్టీ రామారావు మొఖం చూపెట్టి ఓట్లు దండుకోవాలనే డ్రామాకు బాబు తెరలేపాడు అనేది అందరికీ అర్థమైంది. మహానాడు వేదికపై ఎన్టీఆర్ ఫొటోతో పాటు చంద్రబాబు, ఆయన కొడుకు ఫొటోల్ని పెట్టుకుని నందమూరి కుటుంబానికి సంబంధించి ఏ ఒక్కరి ఫొటో ఎందుకు పెట్టలేదు. అసలు, నందమూరి కుటుంబమంటేనే నారా చంద్రబాబుకు అంత కడుపుమంట ఎందుకు?
బాబువన్నీ పిట్టలదొర కబుర్లు
పల్లెటూళ్లల్లో యాచనకొచ్చిన పిట్టలదొరల్లా చంద్రబాబు ఈరోజు పనికి మాలిన వాగ్దానాలు చేస్తున్నాడు. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టాను.. కరోనాను నేనే ఆపాను.. ప్రపంచ యుద్ధాన్ని ఆపిన శాంతిదూతను అంటూ పిట్టలదొర కబుర్లును బాబు గత రెండ్రోజులుగా రాజమండ్రిలో వినిపించాడు. గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు గ్యాస్ సబ్సిడీని సైతం ఎత్తేసిన బాబు.. ఇప్పుడు తాను మళ్లీ గద్దెనెక్కితే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం.
మీ శకపురుషుడు ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేస్తే బాబు దాన్ని ఎత్తేశాడు. రూ.2 కిలోబియ్యం పథకం తెస్తే దాన్ని అమలు చేయలేని బాబు ఈరోజు ప్రజల ముందుకొచ్చి ఎన్టీఆర్ తనకు ఆదర్శమని చెబుతున్నాడు. ఇంతకన్నా దారుణంగా రాజకీయాల్ని చేసే నాయకుడెవరైనా ఉంటారా?. బతికుండగా కూడుబెట్టనోడు.. చచ్చాక శ్మశానికి పాడిఆవును తోలాడన్న సామెతగా ఉంది చంద్రబాబు రాజకీయం.
టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది
ఈరోజు టీడీపీ పార్టీ వెంటిలేటర్‌పైన ఉంది. దాన్ని బతికించుకునేందుకు చంద్రబాబు నలుగురు డాక్టర్లును పెట్టుకుని వైద్యం చేయిస్తున్నాడు. ఆ నలుగురు ఎవరంటే.. రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ నాయుడుతో పాటు పవన్‌కల్యాణ్‌ను బాబు ఏర్పాటు చేసుకున్నాడు. మరోవైపు ఆయన మాత్రం ప్రజల్ని ఆకర్షించేందుకు భూత వైద్యం చేస్తున్నాడు. ఈ సందర్భంలో మనమంతా ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. అచ్చెన్నాయుడు చెప్పినట్లు పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నది వాస్తవం. ఈ విషయంలో అచ్చెన్నాయుడుకు ఉన్న అవగాహన కూడా చంద్రబాబుకు లేదని అర్థం చేసుకోవాలి.
ఓట్లకొనుగోలులో బాబే అగ్రగణ్యుడు
ఈరోజు రూ.2వేలు నోటు రద్దు చేయమని ఆర్బీఐకి తానే సలహా ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. అదేమంటే, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తగ్గించేందుకు అని చెబుతున్నాడు. నిజానికి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రూ.2వేల నోట్ల కట్టలు పంపాడో.. రూ.500 నోట్ల కట్టలు పంపాడో గానీ.. ఓట్ల కొనుగోలు ఆద్యుడు.. అగ్రగణ్యుడు చంద్రబాబేనని అందరూ అంగీకరించాల్సిన విషయం.
బాబు పథకాలతో రాష్ట్రం ఏమౌతుందో..?
రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్ జగన్, నవరత్నాల పథకాలు అమలు చేస్తుంటే.. రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. మరి, ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న వాగ్దానాలు అమలు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా..? రామోజీఫిల్మ్‌సిటీ అవుతుందా..? అనేది సమాధానం చెప్పాలి. జగన్ చేస్తే ఈ ఎల్లో మీడియాకు తప్పుగా కనిపిస్తుందంట.. అదే బాబు చేస్తే మాత్ర సంక్షేమ శకానికి నాంది అని హెడ్డింగులు పెడతారా..? ఈ ఎల్లోమీడియాకు సిగ్గుండాలి.
2024లో బాబుకు పరాభవం తప్పదు:
బాబు హామీల ఊదరే గానీ.. చేసేదేమీ లేదు. బాబు హయాంలో రైతులకు రుణమాఫీ పథకం కింద రూ.87,612 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, వాటిల్లో కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశాడు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ అని వాళ్లకు మొండిచేయి చూపితే.. వారంతా కలిసి ఆయనకు 2019లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఓడించి మూలన కూర్చోబెట్టారు. రేపు 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయం. చంద్రబాబు ఇక రాజకీయాలకు స్వస్తిపలికి ఇంటికి పరిమితమవడం మంచిదని చెబుతున్నాను.
మేనిఫెస్టోను పవిత్ర గ్రంధమన్న జగన్ :
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చంద్రబాబుకు, జగన్‌కి నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎన్నికలు, మ్యానిఫెస్టో హామీలు, ప్రజల సంక్షేమంలో చంద్రబాబు హయాన్ని, జగన్‌గారి పాలనతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల మ్యానిఫెస్టో అనేది అన్ని వర్గాల ఆరాధ్యదైవమైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా మనం నమ్మాలని.. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం మేరకు అందులోని 98.5 శాతం హామీల్నీ నిలబెట్టుకున్న దమ్మున్న నాయకుడు మా జగన్‌అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం.
ఎన్నికల మేనిఫెస్టో హామీల్ని నిలబెట్టుకోవడంలో మా నాయకుడు జగన్ ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారో.. అదే మాకు, మాపార్టీకి బలమని మేం దమ్ముగా చెప్పుకుంటున్నాం. అదే బాబు మాత్రం మ్యానిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టతో సమానం. ఆయన మాటల మాయాజాలానికి ప్రజలెవరూ మంత్రముగ్ధులు కాలేరన్నది సత్యం అని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.