– ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పాత్రపైనా విచారణ జరపాలి
– సీబీఐ దర్యాప్తు తోనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి
: ప్రధాని మోడీని విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా
నగరి: రాష్ట్రంలో వెలుగుచూసిన భారీ కల్తీ లిక్కర్ రాకెట్ వ్యవహారంలో వేళ్లన్నీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వైపే చూపిస్తున్నా, ఆధారాలతో పట్టుబడిన నిందితులు వైయస్సార్సీపీ కోవర్టులంటూ డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరలేపారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు.
కల్తీ లిక్కర్ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని, అప్పుడే తాళిబొట్లు తెగిపోయి వీధిన పడిన మహిళల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని.. ఆ మేరకు సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోడీ కి మాజీ మంత్రి ఆర్కే రోజా విజ్ఞప్తి చేశారు. నిందితులంతా టీడీపీ నాయకులేనని ఆధారాలతో సహా దొరికిపోతున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాకనే రాష్ట్రంలో 16 నెలలుగా కల్తీ లిక్కర్ తయారవుతోందని ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారని రోజా వివరించారు.
అయినా పాపపు సొమ్ముతో కళ్లు మూసుకుపోయాయి. మంత్రి కొల్లు రవీంద్ర వైయస్సార్సీపీ వారి మీదకు నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ఆఫ్రికా మోడల్ మద్యం తయారు చేసి దోచుకోవాలన్న ఆలోచనతోనే, ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న జయచంద్రా రెడ్డిని పార్టీలో చేర్చుకుని తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇచ్చారని, ఓడిపోయాక కూడా నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
కల్తీ మద్యం వ్యవహారంలో వైయస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని మహిళలు భారీ ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి రోజా పిలుపునిచ్చారు.