– ‘చేయి’ వైపు చూపించిన ఎగ్జిట్‌పోల్స్
– ‘కారు’కు సిగ్నల్ ఇవ్వని ఎగ్జిట్‌పోల్స్
– ఇంటిలిజన్స్ బ్యూరో సంకేతాలు 70కి పైగా
– గ్రేటర్’లోనే కొద్దిగా పరుగులు తీసిన ‘కారు’?
– కామారెడ్డిలో సీఎం కేసీఆర్ గెలుపు అనుమానమే
– గజ్వేలులో కేసీఆర్ కష్టంగా గెలుపు?
– బీజేపీకి ఊహించని సీట్లు-ఓట్ల శాతం
– సెటిలర్లు కేసీఆర్‌కు రిటర్ను గిఫ్టు ఇవ్వాలంటూ సోషల్‌మీడియా సందేశాలు
– కాంగ్రెస్‌కు జై కొట్టిన ముస్లిం-సెటిలర్లు
– బీజేపీకి కనిపించని మాదిగల మద్దతు
– తాజా పరిణామాలతో కాంగ్రెస్ 80 వరకూ చేరే అవకాశం?
( మార్తి సుబ్రహ్మణ్యం)
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. దాదాపు 20 చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇవ్వడంతో, ఓట్లు చీల్చిన ఆ పార్టీ ఎవ రిని పుట్టిముంచుతుందో తెలియని గందరగోళం. ఇక మొన్నటిదాకా కారెక్కిన ముస్లింలు, ఈసారి కాంగ్రెస్‌కు జైకొట్టడంతో బీఆర్‌ఎస్ విజయావకాశాలు దారుణంగా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో యువకులు కాంగ్రెస్-బీజేపీ వైపు మొగ్గు చూపగా, బ్రాహ్మణ-వైశ్య-ముదిరాజులు బీజేపీ-కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపినట్లు కనిపించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మాత్రం బీఆర్‌ఎస్ పరువు కొద్దిగా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఆంధ్రా నుంచి స్థిరపడిన సెటిలర్లు, ప్రధానంగా కమ్మ సామాజికవర్గం గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటేసింది. ఆంధ్రాకు చెందిన రెడ్లు కూడా కాంగ్రెస్‌కే ఓటేసినట్లు కనిపించింది. ‘‘మీరు ఊరికి వెళ్లే ముందు కాంగ్రెస్‌కు ఓటు వేసి, కేసీఆర్‌కు రిటర్ను గిఫ్ట్ ఇచ్చి వెళ్లండి’’ అన్న సోషల్‌మీడియా సందేశాలు వైరల్ అయ్యాయి.
ఇక ‘‘నేను ఊరెళ్తున్నా. రేవంత్‌రెడ్డి సీఎం అయితేనే మళ్లీ శేరిలింగంపల్లి వస్తా. కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత మీదే’’నంటూ ఒక మహిళ తన భర్తకు చెబుతున్న మాటలు కూడా, పోలింగ్ రోజు తెగ వైరల్ అవడం విశేషం. అయితే మహిళలు మాత్రం ఎక్కువ శాతం బీఆర్‌ఎస్- ఆ తర్వాత కాంగ్రెస్‌కు వేసినట్లు చెబుతుండటం గమనార్హం.
బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించడంతో పాటు, ఓటు శాతం కూడా పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇంటలిజన్స్ బ్యూరో కాంగ్రెస్‌కు 70కిపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా ఎగ్జిట్‌పోల్స్‌లో సర్వే కంపెనీలు కారు వైపు కాకుండా, చేయి వైపే చూపించడం విశేషం. జాతీయ-రాష్ట్ర-స్థానిక సర్వే కంపెనీలన్నీ కాంగ్రెస్‌నే ముందస్తు విజేతగా ప్రకటించాయి. అందులో ‘ఆరా’ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉండటం విశేషం. తాజా పరిస్థితులు గమనిస్తే కాంగ్రెస్‌కు 80 స్థానాల వరకూ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కుటుంబపాలన ఎక్కువయింది… రెండుసార్లు అధికారంలో ఉన్నారు కదా ఇక చాల్లే.. మళ్లీ ఆయన వస్తే రాజరికపు పాలన వస్తుంది. ఇక ఎవరినీ లెక్క చేయరు.. డబుల్‌బెడ్‌రూములు ఇయ్యలె.. దళితబంధుకు 10 లక్షలిచ్చి మాకు లక్ష రూపాయలిచ్చుడు నాయమా? మా యువతను కేసీఆర్ మోసం చేశారు. కొలువులని మోసం చేశారు.. ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైపోయింది…ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. అణచివేత పెరిగిపోయింది.. కేసీఆర్ మైనారిటీలకే బాగా పనులు చేశారు.. రేవంత్‌రెడ్డిని సీఎంగా చూడాలి.. కాంగ్రెస్ వస్తే స్వేచ్ఛ ఉంటుంది. రాజరికం ఉండదు.. ఇలాంటి వ్యాఖ్యలన్నీ పోలింగ్ రోజు వివిధ వర్గాల నుంచి వినిపించాయి. అంటే ఆ మేరకు వారి మనోభావాలు పోలింగ్‌బూత్‌లో ప్రతిబింబించినట్లే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక బీజేపీ మద్దతు ప్రకటించిన కృష్ణమాదిగ సారథ్యంలోని ఎమ్మార్పీఎస్.. పోలింగ్ సమయంలో ఆ పార్టీకి పెద్దగా అక్కరకు వచ్చినట్లు, మురికివాడలున్న బూత్‌లో కనిపించలేదు. మాదిగలు బీఆర్‌ఎస్-కాంగ్రెస్-కొన్నిచోట్ల బీఎస్పీ వైపు మొగ్గు చూపినట్లు వారి మాటలు స్పష్టం చేశాయి. ముదిరాజుల ఓట్లు ఎక్కువ శాతం బీజేపీ- తర్వాత కాంగ్రెస్‌కు పోలయినట్లు కనిపించింది.
తాజాగా ఆరా-రేస్-సీపాక్-రాజనీతి స్ట్రాటజీస్-పొలిటికల్ లెబోరేటరీ-సీఎన్‌ఎన్‌న్యూస్ వంటి ప్రముఖ సంస్థలన్నీ కాంగ్రెస్‌నే విజేతగా ప్రకటించాయి. ఇక ప్రివర్ మీడియా సోల్యూషన్స్-సునీల్‌వీర్-థర్డ్ విజన్ రీసెర్చి- పల్సు టుడే వంటి సంస్థలు బీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. ఎన్డీటీవీ మాత్రం 48-64 సీట్లు స్తాయని చెప్పిన ప్పటికీ, హంగ్ వస్తుందని జోస్యం చెప్పడం విశేషం.
మొత్తంగా రాష్ట్ర విభజన తర్వాత.. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ తొలిసారి గద్దెనెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. అయితే అవన్నీ తప్పుల తడకేనని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎగ్జిట్‌పోల్స్ నిజమా? అబద్ధమా అని తేలాలంటే మరో మూడురోజులు వేచిచూడాల్సిందే.
చాణక్య స్టాటజీస్
కాంగ్రెస్: 67-78
బీఆర్ఎస్ 22-31
బీజేపీ : 6- 9
ఇతరులు : 6-7
పీపుల్స్ పల్స్
కాంగ్రెస్: 62-72
బీఆర్ఎస్: 35-46
ఎంఐఎం: 6-7
బీజేపీ : 3-8
ఇతరులు : 1-2
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్
కాంగ్రెస్ :56
బీఆర్ఎస్ : 58
బీజేపీ :10
ఆరా ప్రీ పోల్ సర్వే
బీఆర్ఎస్ : 41-49
కాంగ్రెస్: 58-67
బీజేపీ: 5-7
ఇతరులు: 7- 9
ఓటింగ్ శాతం..ఏ పార్టీకి ఎంతంటే?
బీఆర్ఎస్ – 39.58 శాతం
కాంగ్రెస్ – 41.13 శాతం
బీజేపీ – 10.47 శాతం
ఇతరులు- 8.82 శాతం
1 COMMENTS