Suryaa.co.in

Editorial Telangana

బే‘కారు’

( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఎన్నికల్లో అహంకారం ఓడింది. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ సీపీఐ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలో అణువంత అబద్ధమైనా లేదు. పదేళ్లపాటు నియంత్రృత్వంతో, రాజరికపు పాలన నిర్వహించి ప్రజాస్వామాన్ని పదడుగులలోతు పాతరేసిన కేసీఆర్ పార్టీకి, తెలంగాణ ప్రజలిచ్చిన వజ్రాఘాతమిది. ఫలితాల సునామీలో పెద్దతలలు నేలకొరడం చూస్తే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో సుస్పష్టం.ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఖాతాలో సెటిలర్లు.. ముస్లింలు..

ప్రజలు-ప్రజాప్రతినిధులను కలుసుకోకుండా అవమానించిన భారసా దొరల గడీలు బద్దలుకొట్టిన తెలంగాణ ప్రజల తెగువ చారిత్రాత్మకం. చివరాఖరకు సీఎం కేసీఆర్ కూడా పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఫలితం రౌండ్లవారీగా దోబూచులాడిదంటే, ప్రజావ్యతిరేకత తీవ్రతను ఊహించడం పెద్ద కష్టమేమీకాదు. జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన పార్టీ ప్రతిష్ఠను, విజయాలతో కాపాడింది మాత్రం హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలే. కాంగ్రెస్-బీజేపీ బలహీనతలు, బలమైన నేతలే కారును కాపాడాయి.ఇది కూడా చదవండి: లోక్‌పోల్ సర్వేలో కాంగ్రెస్‌దే హవా

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు-ప్రజాప్రతినిధులు-పాత్రికేయులు సెక్రటేరియేట్ ముఖం చూసింది లేదు. విచిత్రంగా అటు ఫాంహౌస్ ఇటు ప్రగతిభవన్‌లో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకే ప్రవేశం లేదు. కేసీఆర్‌కు పొద్దున్నే ఎవరైనా కలపడితే తప్ప, ఆ ప్రజాప్రతినిధులకు సారు దర్శనభాగ్యం ఉండదు. ఆరేడుసార్లు గెలిచి మంత్రులుగా పనిచేసిన పెద్దలు సైతం చిన్నసారు కోసం చకోరపక్షుల్లా వేచి చూడాల్సిన అవమానకర పరిస్థితి.

‘సీఎం అయితే అందరినీ కలవాలని ఉందా?’ అన్న ఆయన పుత్రరత్నం కేటీఆర్ వేసిన ఎదురుప్రశ్న, నయా నియంతల అహంకార భావజాల పోకడకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆ అహాన్ని ఓటు అనే ఆత్మగౌరవంతో అణచివేశారు. తన ఆలోచనలే తెలంగాణ ప్రజల ఆలోచన కావాలనుకునే నియంతభావాలకు తెరదించిన తెలంగాణ ప్రజల తెగువ మెచ్చదగిందే.

ఎవరిదైనా నడిచినంతవరకే. అధికారంలో ఉన్నంతవరకే అందరి చక్రాలు తిరుగుతుంటాయి. అధికారంలో ఉంటే అంతా చాణక్యులవుతారు. గతంలో చాలామందిని చూశాం. అందుకు కేసీఆర్ ఏమీ అతీతుడు కాదు. తెలంగాణ ఉద్యమకారులను పూచికపుల్లల మాదిరిగా పక్కనపెట్టిన ఉద్యమపార్టీ, ఇప్పుడు పేరు-తీరు-నడక-నడత మార్చుకుని, జాతీయ పార్టీగా రూపు మార్చుకుంది. అయినా అది తన ప్రాంతీయపోకడను మార్చుకోలేదన్నది ఎన్నికల ప్రచారంలో తేలిపోయింది.ఇది కూడా చదవండి: రాహుల్ ముందస్తు ‘మైండ్’గేమ్

అధికారంలో ఉంటే అంతా సలాము చేసి గులాములవుతారు. కానీ అది కృత్రిమాభిమానమే. తమచుట్టూ పనులు-పదవులు-బిల్లుల కోసం ప్రదక్షణలు చేసేవారిని పాలక పార్టీలు పట్టించుకోవు. మీడియా కూడా అంతే. పదేళ్లు కేసీఆర్ సర్కారుకు సాగిలబడి ఊడిగం చేసిన మీడియాకు ఇప్పుడు మొఖమెక్కడ? కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే మీడియా దానిని జనంలోకి వెళ్లకుండా ముసుగేసి అమ్ముడుపోవడాన్ని ఏ పేరుతో పిలవాలి? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇద్దరు సీఎంలను పిలిచి, జాతీయ మీడియాలో దానికి ప్రచారం కల్పించి, తానే దానిని డిజైను చేసిన మరో మోక్షగుండం విశ్వేశ్వరయ్యనని సొంత డబ్బా కొట్టుకున్న కేసీఆర్…. మరి ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ముచ్చట ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించిన మీడియా ఉంటే ఒట్టు.

గతంలో ఎంతోమంది సీఎంల వద్దకు స్వేచ్ఛగా వెళ్లగలిగిన మీడియాకు లక్ష్మణరేఖ గీసి, చివరకు అపాయింట్‌మెంట్ల కోసం తన చుట్టూ చకోరపక్షులా తిరిగేలా చేసిన కేటీఆర్, రేపటి నుంచి ఏ మీడియా చుట్టూ తిరుగుతారో చూడాలి. ఇక విభజన ముందు హక్కుల కోసం నినదించిన జర్నలిస్టు సంఘాల నోళ్లు, ఈ పదేళ్లలో అదిమిపెట్టినా సదరు నేతలు ఆనందంగా భరించడం చూసిందే.

తనకు నచ్చని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వను పొమ్మనమని.. అహంకారపూరిత స్వరం వినిపించిన కేసీఆర్ సమక్షంలో నిరసన తెలిపేందుకు, నవరంధ్రాలూ తడిచిపోయిన పరాధీనత సిగ్గుచేటు. తనను వ్యతిరేకించే మీడియాను పదడుగులలోతు పాతరేస్తానన్న కేసీఆర్ అహంకార స్వరం ఇంకా వినిపిస్తూనే ఉంది. ఒకవేళ కేసీఆర్ దారిలోనే నయా పాలకులు పయనిస్తే, వారిని ప్రశ్నించే ైనైతిక ధెర్యం ఈ జర్నలిస్టులకు సంఘాలకు ఉండదు కదా?

కలంగళాలు సచివాలయంలో వినిపించకుండా-కనిపించకుండా, కేసీఆర్ మోపిన ఉక్కుపాదాన్ని ప్రశ్నించని జర్నలిస్టు సంఘాలు.. ఈ ఐదేళ్లూ కాంగ్రెస్ పాలన నిర్ణయాలనూ, అంతే ఆనందంతో స్వాగతించి అనుభ వించక తప్పదు. అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేచాయంటే, దానిని అనుమానించాల్సిందే కదా?

సొంత రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా… ఇంకా తెలంగాణ సెంటిమెంటే తమకు దిక్కని, కవిత నుంచి కేటీఆర్ వరకూ ఎన్నికల ప్రచారంలో నిరూపించారు. తెలంగాణ పార్టీకే ఓటేయాలని.. తెలంగాణ పేరును తొలగించిన పార్టీ ఓటు అడగడమే వింత. గతంలో చంద్రబాబు భుజంపై తుపాకి పెట్టి కాంగ్రెస్‌ను పేల్చిన కేసీఆర్‌కు, పాపం ఈసారి ఎవరి భుజాలూ కనిపించలేదు. దానితో కర్నాటకను తెరపైకి తెచ్చినా, తెలివైన తెలంగాణ ప్రజలు నమ్మలేదు. పాపం. పోలింగ్ రోజున మిత్రుడైన కేసీఆర్‌ను కాపాడేందుకు, పక్క రాష్ట్ర సీఎం జగన్ నాగార్జునసాగర్ వద్ద వేసిన ప్రాజెక్టు పథకం పారలేదు. ఫలితంగా సెంటిమెంటూ వర్కవుటవలేదు. ఐడియా బూమెరాంగయింది.

ఈ ఎన్నికల్లో ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడిన వారు, కేసీఆర్‌కు ఇచ్చిన రిటర్ను గిఫ్టు మరో ముచ్చట. జగనన్నతో కలసి చంద్రబాబుపై మాయోపాయం పన్నిన కేసీఆర్‌కు వారంతా పోలింగ్ రోజు రిటర్ను గిఫ్టు ఇచ్చినట్లే స్పష్టమయింది. హైదరాబాద్‌లో ఆందోళనలు ఎందుకు? మీ విజయవాడలోనో కర్నూలులోనే చేసుకోండి అన్న చిన్నసారు కేటీఆర్ అంహకారపూరిత స్వరమే, వారిలో రిటర్ను గిఫ్టు ఆలోచనకు ప్రాణం పోసి ఉంటుంది.ఇది కూడా చదవండి: పోలింగ్ పరుగులో దౌడు తీసిన కాంగి‘రేసు గుర్రం’

ఎన్నికల ప్రచారసభల్లో కేటీఆర్ అండ్ ఫ్యామిలీ, ఆసాంతం కాంగ్రెస్ నామజపం చేసినప్పుడే, కాంగ్రెస్ విజయం ఖరారయినట్లు లెక్క. బీజేపీతో చీకటి స్నేహం చేసినా, చివరకు ఆ పార్టీ అభ్యర్ధులే బీఆర్‌ఎస్ ఓట్లకు భారీగా గండికొట్టడం మరో విషాదం. ఎన్నికల సమయంలో బీజేపీ ప్రాయోజిత దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్ అభ్యర్ధుల ఇళ్లపై దాడులు చేసి, జనంలో మరింత సానుభూతి పెంచినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి.

ఈ ఎన్నికల్లో తాను చేసిన మంచిని చెప్పడం బదులు, కాంగ్రెస్‌నే తిట్టిపోసిన కేసీఆర్ వ్యూహం ఫలించలేదు. అసలు ప్రపంచంలోనే అత్యంత చేయి తిరిగిన ఇంజనీరయిన.. కేసీఆర్ మస్కిష్కం నుంచి ఉద్భవించిన కాళేశ్వరం గొప్పతనం గురించి, ప్రచారంలో ఒక్కరు కూడా చెప్పకపోవడమే వింత. తొలుత కాంగ్రెస్‌ను చిన్నగా చూపి, దాని స్థాయి తగ్గించడానికి తండ్రీకొడుకులు చేసిన ప్రయత్నాలు, వారిలో కాంగ్రెస్‌పై ఉన్న భయానికి పరాకాష్ఠ. చివరకు తన పార్టీ పేరెత్తకపోతే ముద్దదిగని పరిస్థితికి.. కేసీఆర్ అండ్ ప్యామిలీని తీసుకువచ్చిన, కాంగ్రెస్ ఫిరంగి రేవంత్‌ను అభినందించాల్సిందే.ఇది కూడా చదవండి: రవ్వంత’రెడ్డి నుంచి.. ‘సీఎం రేవంత్‌రెడ్డి’ అనేంతవరకూ..

అధికారబలంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ప్రజాస్వామ్యానికి నిలువెత్తుపాతర వేసిన బీఆర్‌ఎస్, ఇప్పుడు ప్రజాతీర్పునకు ఏం భాష్యం చెబుతుందో చూడాలి. కాంగ్రెస్ వచ్చేది లేదు సచ్చేది లేదని వెటకారమాడిన అపర చాణక్యుడు కేసీఆర్ మీడియా ముందుకు ఎప్పుడు వస్తారో చూడాలి.

ఇక పదేళ్లు పాలకుల గడీలకు పహారా కాసిన, ఐఏఎస్-ఐపిఎస్ సార్లు కూడా ఫలితం అనుభవించక తప్పదేమో?! ప్రధానంగా ‘ఆ అరడజను’ అధికారుల శ్రమదానం చూసి, కూలీలు కూడా సిగ్గుపడ్డారు. అలాంటి శ్రమదానం చేసిన అధికారుల పేర్లు.. ఎలాగూ రెడ్‌బుక్‌లో రాసిపెట్టానని రేవంత్ చెప్పారు కాబట్టి, ఇక వారిని దేవుడే కాపాడాలి. పోస్టింగులు, పాలకుల మెరమెచ్చుల కోసం సాగిలబడే ఏ అధికారులైనా ఫలితం అనుభవించక తప్పదు.

కేసీఆర్ కోటలకు పదేళ్లు రక్షణ కవచంలా నిలిచిన ఆ రెండు చానెళ్లు ఫలితం అనుభవిస్తాయా? లేక అర్జెంటుగా విధేయత మారుస్తాయా? అదీకాకపోతే కాంగ్రెస్‌లో చాలా తలుపులు ఉంటాయి కాబట్టి, ఏదో ఒక తలుపులోకి వెళ్లి వారి ద్వారా తప్పించుకునే చావు తె లివికి పాల్పడతాయా? అన్నది ఒకటి రెండ్రోజుల్లో తెలిసిపోతుంది.

అప్పుడు ఇతర పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేసి.. ‘అభివృద్ధి కోసం వారంతా పార్టీ మారితే తప్పా? మీడియా కూడా కొత్తగా ఆలోచించాలి’ అని ప్రవచించిన కేసీఆర్… ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేసినా, దానిని విమర్శించకుండా స్వాగతించక తప్పని ఇరకాటం. ‘నవ్వుతూ అనడం-ఏడుస్తూ అనుభవించటం’ అని పెద్దలు సామెత ఊరకనే చెప్పలేదు.

ఇప్పుడు అందరికంటే పెద్ద పరేషాను జగనన్నదే. నిన్నటి వరకూ తెలంగాణలో తన ఫ్రెండ్లీ పాలకులే ఉన్నారు కాబట్టి, జగనన్న కోరుకున్నదే నడిచింది. ఉమ్మడి శత్రువైన చంద్రబాబు పార్టీని నిర్వీర్యం చేసేందుకు, కేసీఆర్ ఆలోచనల ప్రకారమే జగనన్న అడుగులేశారు. మరిప్పుడు పాలకులు మారారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్‌కు, జగనన్నను ఓదార్చాలిన అవసరం లేదు. తెలంగాణలో జగన్ వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడాల్సిన అవసరం కూడా కాంగ్రెస్‌కు లేదు కాబట్టి, అన్నియ్యకు కష్టకాలమన్నట్లే లెక్క. ఇప్పుడు ఎలాగూ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాబట్టి, ఇక కాంగ్రెస్ చూపు ఆంధ్రావైపు మళ్లినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

ఏదేమైనా క ల్వకుంట్ల కుటుంబం లేని కొత్త పరిపాలనను, తెలంగాణ ప్రజలు రేపటి నుంచి చూడబోతున్నారు. తెలంగాణలో నవోదయం మొదలుకానుంది. పదేళ్లు పాతరవేయబడ్డ ప్రజాస్వామ్యానికి, కాంగ్రెస్ ఊపిరిపోస్తుందన్న ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కొత్త పాలకుడి కర్తవ్యం, బాధ్యత కూడా! కాంగ్రెస్ జమానాలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని.. ప్రశ్నించే గొంతును లాఠీతో పొడవకుండా స్వాగతించాలన్నది ప్రజాస్వామ్యవాదుల ఆకాంక్ష.

 

LEAVE A RESPONSE