– సింగిల్ విండో ద్వారా అనుమతులిచ్చేలా ఏర్పాట్లు చేయండి
– టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట కోసం రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయం
– ఆన్ లైన్ అనుమతులను ఏకీకృతం చేయడంపై మంత్రి నారాయణ సమీక్ష
అమరావతి: భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో మంత్రి మంగళవారం సమీక్షించారు. సీడీఎంఏ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ హరినారాయణన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ల శాఖ ఐజీ శేషగిరి బాబుతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, గనులు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకూ ఆయా శాఖల వారీగా అనుమతులు జారీ చేస్తున్న విధానం, అనుమతుల మంజూరుకు తీసుకుంటున్న గడువు వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అన్ని శాఖలను ఆన్ లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్జానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆయా శాఖలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఒక్కో శాఖ నుంచి అనుమతి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ జాప్యాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
భవన నిర్మాణాల కోసం అగ్నిమాపక శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ప్రస్తుతం పరిశ్రమలకు ఇస్తున్న ఆన్ లైన్ అనుమతుల అప్లికేషన్ ను డీపీఎంఎస్ వెబ్ సైట్ కు అనుసంధానం చేస్తే సరిపోతుందని సూచించారు. ఇక గనుల శాఖ కూడా పెద్దపెద్ద భవనాల విషయంలో అనుమతులు జారీ చేయాల్సి ఉంటుంది. భవన నిర్మాణాల కోసం భారీ గుంతల తవ్వకాల కోసం గనుల శాఖ అనుమతి తప్పనిసరి. దీనికి సంబంధించి సీనరేజి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరిశ్రమలకు అనుమతుల విషయంలో ప్రస్తుతం ఇదే రకమైన విధానాన్ని పాటిస్తున్నారు. ఈ విధానాన్నే భవన నిర్మాణాల అనుమతులకు అనుసంధించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మరోవైపు భవనం నిర్మాణం సమయంలోనే ఎంతమేర ఇసుక అవసరం అవుతుందనేది కూడా తమకు ఇవ్వాలని గనుల శాఖ అధికారులు కోరారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ చీఫ్ ఇంజినీర్ గోపాల కృష్ణా రెడ్డికి మంత్రి నారాయణ సూచించారు. ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి కూడా రెవెన్యూ అధికారులు ఇచ్చే అనుమతులు సులభతరం చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా ఇప్పటికే పరిశ్రమల శాఖకు ఇస్తున్న విధానాన్ని ఏకీకృతం చేయాలని నిర్నయించారు. ఆయా శాఖల సమన్వయంతో సింగిల్ విండో ద్వారా అనుమతులు జారీ చేసేలా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.
అక్రమాలకు అడ్డుకట్ట కోసం రిజిస్ట్రేషన్ శాఖతో సమన్వయం
గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్న టీడీఆర్ బాండ్ల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్తులో బాండ్ల జారీలో అక్రమాలు జరగకుండా ఉండేలా పగడ్బందీ చర్యలు తీసుకుంటుంది. దీనికోసం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ అంశంపై ఓసారి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో చర్చించిన మంత్రి నారాయాణ… నేటి సమావేశంలో ఈ అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
వాస్తవంగా భూమి కోల్పోతున్న సర్వే నెంబర్ కు బదులు దొంగ సర్వే నెంబర్లు వేసి బాండ్ల కోసం దరఖాస్తు చేస్తున్నారనే విషయం ప్రస్తావనకు వచ్చింది. రిజిస్ట్రేషన్ శాఖలో ఇంటి నెంబర్ ల డేటా లేకపోవడంతో సర్వే నెంబర్లు, అక్కడ ప్రాంతం ఆధారంగా భూముల ధర నిర్ధారిస్తున్నారు. ఇలా నిర్ధారించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. బాండ్ల జారీ సమయంలో భూమికి సంబంధించిన ఈసీలు ఆన్ లైన్ లో ఆటోమేటిక్ గా వచ్చేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేయాలన్నారు.
ఓనర్ షిప్ డాక్యుమెంట్ లు కూడా ఆన్ లైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ శేషగిరి బాబు చెప్పారు. వారంరోజుల్లో పట్టణ ప్రణాళిక శాఖకు టీడీఆర్ బాండ్ల జారీకి అవసరమైన అన్ని అంశాలతో సమీకృతం చేసేలా సాంకేతిక పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.