- వేణుంబాక విజయసాయిరెడ్డి ( రాజ్యసభసభ్యులు)
గనులు, ఖనిజాల బిల్లుపై రాజ్యసభలో విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ, ఆగస్టు 2: అరుదైన పరమాణు ఖనిజాల వెలికితీత భారీ పెట్టుబడులతో కూడిన సంశ్లిష్ట ప్రక్రియ అని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అన్నారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుదైన పరమాణు ఖనిజాలు ఇతర ఖనిజాలలో అంతర్భాగమై ఉంటాయి. కాబట్టి వాటిని వెలికితీసే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు.
అరుదైన ఖనిజాల వెలికితీతలో జపాన్, చైనా వంటి కొన్ని దేశాలు ప్రావీణ్యాన్ని అభివృద్ధి చేశారు. ఇది కేవలం ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ మాత్రమే కాదు. వెలికితీసిన ఖనిజాలను ఖనిజ మిశ్రమాలుగాను ఇతర ఉత్పాదనలుగా మార్చడం సవాళ్ళతో కూడిన పని అని ఆయన చెప్పారు. అందుకే అరుదైన ఖనిజాల వెలికితీతలో క్లిష్టమైన ఇలాంటి పనులు నిర్వహించడానికి భారీ పెట్టుబడులతోపాటు మౌలిక సదుపాయాలు ఉండాలి.
కానీ మన దేశానికి ప్రస్తుతం ఆ సామర్ధ్యం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. అరుదైన ఖనిజాల వెలికితీతలో పాలుపంచుకునే ప్రైవేట్ రంగ మైనింగ్ సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ప్రోత్సాహకాలను ప్రకటించాలని ఆయన గనుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
రక్షణ, వ్యవసాయం, ఇంధన, ఫార్మా, టెలికామ్ రంగాల అవసరాలను పరిగణలోకి తీసుకుని 30 రకాల అరుదైన ఖనిజాల అవసరం ఉన్నట్లుగా గనుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికను ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి ప్రస్తావించారు. ఈ 30 రకాల ఖనిజాలలో కనీసం 10 ఖనిజాలను పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడ్డాం.
ఈ 10 ఖనిజాలలో 7 రకాలను దేశం చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇది చాలా ప్రమాదకరం అన్నారు ఆయన. అరుదైన ఖనిజాల దిగుమతులపై ఇండియా ఆధారపడవలసిన అవసరం తప్పుతుందని ఈ బిల్లులో చెబుతున్నారు. చైనాతో పోటీపడే స్థాయిలో ఇంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడం ఏ విధంగా సాధ్యమో స్పష్టత ఇవ్వాలని ఆయన గనుల శాఖ మంత్రిని కోరారు.
అరుదైన ఖనిద నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలతోపాటు వినియోగం అనంతరం వాటిని రీసైక్లింగ్ చేసే విధానంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రీసైక్లింగ్ అనేది సుదీర్ఘమైన, సవాళ్ళతో కూడిన ప్రక్రియే అయినప్పటికీ ఇది చాలా చౌకైనది. దీర్ఘకాలంలో అరుదైన ఖనిజాలను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి రీసైక్లింగ్ దోహదం చేస్తుందని అన్నారు. రీసైక్లింగ్ విధాన ప్రక్రియపై ప్రస్తుతం ఎలాంటి చట్టం లేదు. కాబట్టి దీనిపై విధానాన్ని రూపొందించాలని ఆయన గనుల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.