– భారతక్క ‘సాచ్చీ’కంలో ఉత్తుత్తి ఖండనల ఉబలాటం
– తనను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తిట్టారంటూ రోజా కడివెడు కన్నీరు
– అమాయకురాలిపై దాడి అంటూ వైసీపీ మీడియా రాతల విలాపం
– రోజాను తిట్టినందుకు మాజీ హీరోయిన్ల ఖండనలంటూ సాక్షిలో కథనం
– కవిత, కుష్బూ, రాధిక, మీనా, నవనీత్‌కౌర్, రమ్యకృష్ణ పేరుతో ఖండనలు
– అసలు మేం ఎవరితోనూ మాట్లాడలేదంటున్న మాజీ హీరోయిన్లు
– అవన్నీ గతంలో రోజాకు మద్దతుగా ఇచ్చిన ప్రకటనలేనట
– లేటెస్టు ఎపిసోడ్లో కట్ అండ్ పేస్ట్ చేసిన భారతక్క ‘సాచ్చీ’కం
– నేను చెప్పకుండా ఎలా రాస్తారన్న సీనియర్ నటి కవిత
– ఇలా కూడా రాస్తారా అంటూ బీజేపీ నేత కవిత ఆశ్చర్యం
– బట్టబయలయిన ‘సాచ్చీ’కం ఉత్తుత్తి మద్దతు కథనం
( మార్తి సుబ్రహ్మణ్యం)
మాజీ మంత్రి రోజా. తెలుగురాష్ట్రాల్లో అతి వినయంగా మాట్లాడే నేతల్లో ఒకరు. ‘పొరపాటున’ కూడా పరుష పదజాలం వాడటం ఆమె నిఘంటువులోనే లేదు. బూతు అన్నది ఆమెకు తెలియనే తెలియని పదం. బూతు పదానికి ఆమె అరవై అడుగుల దూరంలో ఉంటారు. ఠాగూర్ సినిమాలో చిరంజీవికి క్షమించడం అనే పదం ఎలా నచ్చదో.. రోజక్కకూ బూతు అనే పదం అస్సలు నచ్చదు. అసలు అచ్చతెలుగు భాషకు చీర కడితే ఆమె రోజా అవుతుంది. ఏమిటి నమ్మడం లేదా? ఇది వెటకారం కాదండీ.. నిఖార్సయిన నిజం!
అలాంటి ‘పదకవితా పితామహురాలు’ ఈ మధ్య ‘అమాయకురాలైన’ తనను, ఒక ‘మహిళ అని కూడా’ చూడకుండా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ బూతులతో దూషించారంటూ క న్నీటి పర్యంతమయ్యారు. ఆ మేరకు ఒక వీడియా కూడా జనంలోకి వదిలారు. అసలే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్న వేళ. హైదరాబాద్‌ను మరో అమెరికా చేస్తానన్న ‘తెలంగాణ జాతిపిత’ జమానాలో నిర్మించిన రోడ్లు కూడా మునిగిపోయిన విషాదం. దానికితోడు రోజక్క చేసిన వీడియో విలాపంతో, నగరి సహా రెండు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఫలితంగా కేంద్రం మిలటరీ బలగాలను రంగంలోగి దింపి, పడవల సాయంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. రోజక్క విలాపం ఆ స్థాయిలో ఉంది మరి!
నిజమే. రోజక్కను అలా ఆడిపోసుకోవడం, తిట్టిపోయడం తప్పున్నర తప్పే. ఎందుకంటే ‘ సంస్కారవంతమైన సోప్ త్రిబుల్ ఎక్స్’ మాదిరిగా, ఆమెది కూడా చాలా సంస్కారవంతమైన భాష కాబట్టి! అలాంటి నోట్లో నాలుకలేని.. నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకురాలిని పట్టుకుని వెయ్యి, రెండువేలని దూషించడం దారుణాతిదారుణం. దీన్ని ‘బూతేతర శక్తుల’న్నీ కత్తితో ఖండించాల్సిందే!
ఉమ్మడి రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రం వరకూ చాలామంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో చాలామంది మంత్రులూ అయ్యారు. కానీ వారిలో రోజక్క తెలుగువారికి దొరికిన ఓ ఆణిముత్యం కమ్ స్వాతిముత్యం. టోటల్‌గా పులుకడిగిన ముత్యం! టీడీపీ స్కూల్లో రాజకీయ అక్షరాభ్యాసం చేసినరోజుల్లోనే రోజక్క ‘పదకవితా పితామహురాల’న్న బిరుదును అచిరకాలంలోనే సొంతం చేసుకుంది.
‘కేసీఆర్‌ది పగలు బారు రాత్రి దర్బారు’ అంటూ నోరారా ప్రశంసించిన నేత. అంతేనా? వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కూడా నోరారా తిట్టిపోసి, మళ్లీ ఆయన కొడుకు జగన్ పార్టీలో చేరి మంత్రి అయిన మహా నాయకురాలు. విపక్షంలో ఉండగా వైకాపా గ్యాంగుతో కలసి అసెంబ్లీలో టీడీపీ సర్కారును.. కాల్‌మనీ సెక్స్‌రాకెట్ అంటూ, నాలిక బయటపెట్టి ఆడిస్తూ బూతులతో ర్యాంగింగ్ చేసిన వీరవిప్లవ నారీమణి.
మంత్రి అయిన తర్వాత కూడా రోజక్క ,తన భాషా మహత్యం చూపించారు. ఓ సందర్భంలో సీఐ ఎదుట ఆ లం.. కొడుకు… డబ్బులు దెం… స్తున్నాడంటూ చెవులకు ఇంపుగా మాట్లాడిన మాటలు, నెటిజన్లకు శ్రవణానందం మిగిల్చిన మధుర జ్ఞాపకాలు గూగుల్మాతను అడిగినా ఠక్కున చెప్పేస్తుంది. ఇలా రోజక్క తెలుగు భాషా పాండిత్యం గురించి రాస్తే రామాయణం. వింటే మహాభారతం అవుతుందన్నది ‘బూతేతర భాషాపిపాసుల’ ఉవాచ.
సీన్ కట్ చేస్తే.. కొద్దిరోజుల క్రితం నగరిలో టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ .. రోజా అక్కియ్య మీద బూతు పదం వాడారన్నది ఓ ఆరోపణ. దానితో రోజక్కియ్య బాగా ఫీల్ అయ్యారట. అదేదో సినిమాలో బ్రహ్మానందం ‘‘ఐ హర్ట్. ఐవాంట్ టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ’’ అని సీరియస్‌గా బిల్డప్ ఇచ్చినట్లు, ఒక మహిళను..పైగా ఒక మాజీ మంత్రిని.. ఇంకా మాట్లాడితే ‘పవిత్రమైన’ ఒకప్పటి హీరోయిన్ను పట్టుకుని బూతులు మాట్లాడటం ఏమిటి? దానిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని, రోజక్కియ్య ముక్కు చీదుకుంటూ చేసిన విలాపం.. భారతక్క ‘సాక్షి’ రంగంలోకి దిగకపోతే, రక్తి కట్టేదే!
కానీ.. రోజక్కియ్యకు మద్దతుగా రంగంలోకి దిగిన భారతక్క సాక్షి, పాపం రోజక్కియ్యకు రావలసిన ఆ కాస్త సానుభూతిని రాకుండా చేయడమే కాదు. సాక్షి ఇలాంటి అబద్ధాలతో బతుకుతూ.. తన వైసీపీ నేతలను ఇలా కూడా బతికిస్తుందా? అన్న అనుమానం వచ్చేందుకు కారణమయింది. ఫలితంగా.. ఫాఫం.. రోజక్కియ కన్నీరు వృధా అయిపోవలసి వచ్చింది. సోషల్‌మీడియాలో ఆమె కన్నీటికి వ్యూస్ అయితే వచ్చాయి. పోనీలే.. వ్రతం చెడినా వ్యూస్ ఫలితం దక్కింది!
దానికి కారణమేమిటంటే… రోజక్కను ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తిట్టినందుకు మాజీ హీరోయిన్లు కట్టకట్టుకుని.. కట్టలుతెగిన దుఃఖంతో సాక్షి రిపోర్టరును పిలిపించుకుని మరీ విలవిలమని విలపించారట. రోజా లాంటి అమాయకురాలు-పైగా మహిళను తిట్టడం అన్యాయం-అక్రమం-అనాగరికమని వంకాయలు తరిగే కత్తితో ఖండించారట. అసలు రోజా లాంటి అమాయకురాలికే ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇక సామాన్య మహిళల సంగతేమిటని వాళ్లంతా సాక్షి రిపోర్టరు మీద మూకుమ్మడిగా ముక్కుచీదేశారట. అలా కవిత, రాధిక, ఖుష్బు, మీనా, నవనీత్‌కౌర్, రమ్యకృష్ణ విలాపానికి(?) సదరు సాక్షి రిపోర్టరు తన పత్రికలో అక్షరరూపం ఇచ్చారు.
అంతవరకూ బాగానే ఉంది. అబద్ధం కూడా అతికినట్లు ఉంటేనే వర్కవుటవుతుంది. తమ ప్రత్యర్ధులు ఎవరినైనా తిట్టిన సందర్భాల్లో.. రాజకీయ నాయకులు మీడియా పేరంటం పెట్టి, ఎదురుతిట్లు తిట్టడమో, ఖండించడమో, నిరసన వ్యక్తం చేయడమో సహజం. రాజకీయ పార్టీలయితే ఫలానా నేత పేరుతో ఆయన సంతకం చేసిన ప్రకటన విడుదల చేస్తుంటాయి. అంటే తమ నేతల డిజిటల్ సిగ్నేచర్లు ముందస్తుగా తీసుకుని, వాటిని సందర్భానుసారంగా పత్రికా ప్రకటనలకు పార్టీ కార్యాలయ వర్గాలు వాడుకుంటాయి. లేదా వ్యక్తులు సొంతంగా పత్రికా ప్రకటనలివ్వడమో రివాజు.
కేవలం పత్రికా ప్రకటనలు-టీవీ చర్చలపైనే బతికే బాపతు నేతలు, ఉద్యమకారులు బోలెడనుకోండి. వీరికి ఎన్నికల ముందు టీవీ చర్చల్లో బాగా గిరాకీ ఉంటుంది. ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు ఏదో ఒక పదవి కొట్టేస్తుంటారు. వీరంతా కనీసం పక్కింటి వారితో కూడా తమ పార్టీలకు ఓట్లు వేయించే బాపతు కాకపోయినా, ప్రజల దృష్టిలో ఆయా పార్టీల కోసం పనిచేసిన మేధావుల కింద లెక్క. అది వేరే వ్యవహారం. ఇంకొందరు ‘ఉత్తుత్తి జర్నలిస్టులు’, ఫలానా నాయకుడు ఫలానా అంశంపై మాట్లాడారంటూ ఉత్తుత్తి ప్రకటనలు విడుదల చేస్తుంటారు.
కానీ.. ఇక్కడ రోజాది, సినిమా భాషలో చెప్పాలంటే ‘రొటీన్‌కు భిన్నమైన’ వ్యవహారం. ఇది ఉత్తుత్తి జర్నలిస్టుల యవ్వారం అన్నమాట! అసలు రోజక్కియ్యకు ఎవరూ బాసటగా నిలవలేదు.. ఎవరూ ఆమెకు మద్దతుగానూ మాట్లాడలేదు.. కనీసం ఒక్క మాజీ హీరోయిన్ కూడా సదరు రిపోర్టరును పిలిచి, రోజక్కకు సపోర్టుగా మాట్లాడిందీ లేదు.
కానీ కవిత, రాధిక, ఖుష్బు, మీనా, నవనీత్‌కౌర్, రమ్యకృష్ణ లాంటి వాళ్లంతా రోజాను.. ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తిట్టినందుకు తెగ బాధపడి, ఆయన చర్యను ఖండించారంటూ భారతక్క ‘సాచ్చీ’కంలో వచ్చిన వార్త చూసి.. సదరు మాజీ హీరోయిన్లే మూర్ఛపోయారట.
తీరా తరచిచూస్తే.. వైసీపీ జమానాలో రోజాపై చేసిన ఆరోపణల కాలంలో ఈ మాజీ హీరోయిన్లు చేసిన ఖండనలనే.. తాజా ఎపిసోడ్లో మళ్లీ కట్ అండ్ పేస్ట్ చేసినట్లు చివరాఖరకు తేల్చుకున్నారట. కనీసం బాబ్బాబూ.. మా కవితక్కకు సపోర్టుగా ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వమని బతిమిలాడుకున్నా వర్కవుటయ్యేదేమో?! బలవంతపు బ్రాహ్మణార్ధం అంటే ఇదేనేమో?!
భారతక్క ’సాచ్చీ’కం చూసి సీనియర్ నటి, బీజేపీ రాష్ట్ర నాయకులు కవిత నోరెళ్లబెట్టారు. తాను రోజక్కను టీడీపీ ఎమ్మెల్యే తిట్టిన ఎపిసోడ్లో స్పందించి రోజాకు బాసటగా నిలిచి, ఎమ్మెల్యే చర్యను ఖండించినట్లుగా సాక్షిలో వచ్చిన వార్తపై కవిత నోరెళ్లబెట్టారు. అసలు నిజానికి కవితకు తాను రోజాకు మద్దతు ప్రకటించినట్లు సాక్షిలో వచ్చిన వార్త కూడా తెలియకపోవడం మరో వింత. ఈ వ్యవహారంపై కవితను కదిలించిన ‘సూర్య’.. ఆమె ఇచ్చిన ప్రకటనను ప్రస్తావించగా, అసలు నిజం బయటపడింది.
ఇదేం ‘సాచ్చీ’కం?: కవిత
‘‘నేను రోజాకు బాసటగా నిలిచి టీడీపీ ఎమ్మెల్యే చర్యను ఖండించినట్లు ఇప్పుడు మీరు పంపించిన క్లిప్పింగ్ చూస్తేనే అర్ధమయింది. చూసి ఆశ్చర్యపోయా. ఇదెక్కడి అన్యాయం అండి? అసలు నాతో సాక్షి రిపోర్టరెవరూ మాట్లాడలేదు. నేను ఖండించిందీ లేదు. అయినా నేను ఒక బీజేపీ నాయకురాలిగా మా పార్టీతో పొత్తు ఉన్న టీడీపీని ఎలా విమర్శిస్తాను? ఆ మాత్రం స్పృహ నాకు లేదా? ఇలా కూడా రాస్తారా? నన్ను అడక్కుండా నా పేరు ఎలా వాడతారు? జర్నలిస్టులు ఇలా కూడా ఉంటారా?’’ అని కవిత వాపోయారు.
నిజానికి కవిత నటి మాత్ర మే కాదు. పొలిటీషియన్ కూడా. సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసి, బీజేపీలో చేరారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నాయకురాలిగా నల్లగొండ జిల్లా పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అలాంటి యాక్టర్ కమ్ పొలిటికల్ లీడర్‌కు.. తాను వైసీపీ నేత రోజాకు మద్దతుగా ప్రకటనలు ఇస్తే, ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందో తెలియదా? ఆపాటి చిన్నపాటి లాజిక్ కూడా భారతక్క ‘సాచ్చీ’కం మిస్ అవడమే వింత.
