Suryaa.co.in

Andhra Pradesh

పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఫల్యం

-వాలంటీర్ల వ్యవస్థ చట్టవిరుద్ధం, అనైతికం, హానికరం
-సొంత ప్రయోజనాల కోసమే వారి నియామకం
-ప్రతిపక్ష పార్టీ దాన్ని ప్రోత్సహించడం అవకాశవాదం
-బాధ్యులపై చర్యలకు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
-రాజీనామా చేసిన వాలంటీర్లను ఏజెంట్లుగా నియమించరాదు
-సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌

విజయవాడ, మహానాడు: వలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్న అధికార పార్టీ విధానం తిరోగమనచర్య కాగా కొద్దిపాటి మార్పులతో అదే వ్యవస్థను కొనసాగించాలన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ విధానం అవకాశ వాదంతో కూడుకున్నదని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. శనివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ హానికరమైనదే కాకుండా చట్టవిరుద్ధం, అనైతికమని అందువల్లే తొలి నుంచి తాము వ్యతిరే కిస్తున్నామన్నారు. రాష్ట్రంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలన్న ఏకైక ఉద్దేశంతో తమ సొంత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. వాలం టీర్ల వ్యవస్థ వల్ల ఏటా దాదాపు రూ.2 వేల కోట్ల భారం అంతిమంగా రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడుతుందని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి ముంగిటికి అందుతున్నాయన్న అంశాన్ని ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
అధికారాల వికేంద్రీకరణ ఉద్దేశంతో చేసిన 73,74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఈ వాలంటీర్లు కూడా నియమితులయ్యారు. వీరు గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు జవాబుదారీగా లేరు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆర్టికల్‌ 16కు, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వాలంటీర్ల నియామకం జరిగింది. అసలు అలాంటి నియామకమే చట్టవిరుద్ధమైనదని పేర్కొన్నారు. అందువల్లనే ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత వహించాలి
వయోవృద్దులకు, దివ్యాంగులకు ఇంటి దగ్గరే పింఛన్లు అందచేయాలని కూడా తన ఆదేశాల్లో ఎన్నికల కమిషన్‌ స్పష్టంగా చెప్పింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం విఫలం కావడం విచారకరం. పింఛన్ల పంపిణీలో జరిగిన పాలనా వైఫల్యానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి బాధ్యత వహించాలి. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధి బృందం త్వరలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని, భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నాం. అలాగే వచ్చే నెల ఎలాంటి అయోమయానికి తావు లేకుండా పింఛన్ల పంపిణీ సజావుగా సాగాలని డిమాండ్‌ చేస్తున్నాం.

అధికార పార్టీ నేతల ప్రేరణతో తాజాగా రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లను పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లుగా అనుమతించరాదని కూడా కోరుతున్నాం. ప్రజలకు నిజంగా అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి, శాంతి భద్రతలు, రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని, కానీ, వాలంటీర్లు లాంటి అంతగా ప్రాధాన్యత లేని అంశంపై చర్చ కేంద్రీకృతం అయ్యేటట్లు ఒక ఉద్దేశ పూర్వక ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, జంధ్యాల శంకర్‌ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE