Suryaa.co.in

Telangana

విభజన చట్టం హామీల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం

-8 ఏళ్లుగా కేంద్రంతో ఎందుకు పోరాటం చేయడం లేదు
-తెలంగాణపై మొదటి నుంచి మోడీకి ప్రేమ లేదు
-తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను చాలా మార్లు మోడీ అవహేళనగా మాట్లాడారు
-ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో ఎలా కలుపుతారు
-తెలంగాణలో తిరిగి కలపాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన కేంద్రం స్పందించలేదు
-ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ రూ. లక్ష కోట్లుకోల్పోయింది*
-పోలవరం ఎత్తు పెంచి భద్రాచలాన్ని ముంచడం అన్యాయం
-తెలంగాణకు మంజూరు అయిన ఐటిఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిన మోడీ సర్కార్
-విభజన చట్టం హక్కుల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించాలి
-అసెంబ్లీ లఘు చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

విభజన చట్టం ద్వార తెలంగాణకు రావలసిన హక్కులను గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రం ఇవ్వలేదని, వాటిని పోరాడి తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం అసెంబ్లీలో ఎ.పి పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం పై జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. విభజన చట్టం హామీల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.

గత ఎనిమిది సంవత్సరాల కాలంలో కేంద్రంతో మీరు ఎన్నోసార్లు కలిసిన ఎందుకు సాధించలేకపోయారని నిలదీశారు. విభజన చట్టం హామీల సాధనకై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడితే వారికి తోడుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కూడా కలిసి వస్తామని చెప్పారు. ఇప్పటికైనా విభజణ చట్టం హామీల సాధనకై రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ రూపొందించాలని డిమాండ్ చేశారు. మీ సభ్యులను రాష్ట్రంలో ఉన్న ఇతర పార్లమెంటు సభ్యులతో ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు.

ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ ఎంపీలు విభజన చట్టం హామీల సాధనకై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారని గుర్తు చేశారు. ప్రపంచంతో దేశం పోటీపడుతున్నదని గొప్పలు చెబుతున్న కేంద్ర పాలకులు తెలంగాణకు చట్టంలో పొందుపరిచిన హక్కులను ఇవ్వకుంటే ఎలా అని నిలదీశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని చట్టంలో ఉన్న ఇప్పటివరకు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రావలసిన దాదాపు లక్ష కోట్ల రూపాయల కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకపోవడంతో పాటు కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు మంజూరు అయిన ఐటిఐఆర్ ప్రాజెక్టును మోడీ సర్కార్ రద్దు చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు వస్తున్న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు వచ్చిన ప్రతి సందర్భంలో ఒక ప్రాజెక్టు మంజూరు చేశామని శంకుస్థాపన చేసి బడ్జెట్ ఇస్తే బాగుండేది అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పట్ల అవహేళనగా మాట్లాడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.

తల్లిని చంపి బిడ్డను బతికించిన విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని ప్రధాని మోడీ అన్న మాటలు తెలంగాణ ప్రజల మనసులను గాయపరుస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రాలో కలిపి మోడీ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి 3 వేల ఎకరాలు అవసరమంటే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడని మోడీ ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి ప్రాజెక్టుకు తెలంగాణలోని రెండు లక్షల ఎకరాలు అవసరం ఉన్నదని తెలంగాణను సంప్రదించకుండా ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను ఆంధ్రాలో ఎలా విలీనం చేస్తారని ప్రశ్నించారు.

కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే ఇప్పటివరకు దానిపై ఎలాంటి స్పందన లేదన్నారు. గోదావరి వరదలు వస్తే భద్రాచలం, ములుగు నియోజకవర్గంలోని గ్రామాలు నీట మునిగాయన్నారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల ఆ గ్రామాలు మునిగాయని అక్కడికొచ్చిన మంత్రి ప్రకటన చేశారని గుర్తు చేశారు. అమాయకమైన గిరిజనులే కదా, నోరులేని గిరిజనులే కదా అని పోలవరం ఎత్తు పెంచి ముంచితే సరైనది కాదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండు లక్షల ఎకరాల భూమి కోల్పోయిన గిరిజనుల ఆవేదనను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి సిద్ధమైనట్లు తెలుస్తుందన్నారు. దీన్ని రాష్ట్రం గట్టిగా వ్యతిరేకించి వాటిని కాపాడుకోవాలని సూచించారు.

LEAVE A RESPONSE