– ఎన్డీఏకు 112?
– వైకాపాకు 62?
– వైసీపీకి రెడ్లు దూరం?
– వాలంటీర్ల పెత్తనమే దానికి కారణం
– బాబు పదివేల హామీతో వాలంటీర్లు తటస్థం
– ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి
– మహిళల ఓట్లపైనే ఆశ
– బీజేపీ ఉన్న చోట మైనారిటీలు వైసీపీ వైపే
– టీడీపీ పోటీ చేసే స్థానాల్లో మైనారిటీలు ఆ పార్టీ వైపే
– క్రైస్తవుల ఓట్లలోనూ చీలిక
– 40 శాతం మంది టీడీపీ-జనసేన వైపే
– ఐప్యాక్ నివేదిక పేరుతో సోషల్మీడియాలో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం ఖాయమని వైసీపీ సలహాబృందాలు భావిస్తున్నాయా? వైసీపీకి మానసిక మద్దతుదారుగా ఉన్న రెడ్డి సామాజికవర్గం ఇప్పుడు ఆ పార్టీకి దూరమయిందా? వాలంటీర్ల రాకతో తమ పలుకుబడి పలచనయిందన్న ఆగ్రహంతో ఉందా? రెక్కలుముక్కలు చేసుకుని జగనన్నను గెలిపించినా, తమకు నయాపైసా ఉపయోగం లేదని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారా? చివరకు క్రైస్తవుల ఓట్లలో కూడా చీలిక వచ్చిందా? తమను వాలంటీర్లే ఒడ్డున పడేస్తారన్న ధీమాతో ఉన్న వైసీపీకి, ఇప్పుడు ఆ వాలంటీర్లు కూడా చేయిచ్చేందుకు సిద్ధవుతున్నారా? చంద్రబాబు ప్రకటించిన పదివేల రూపాయల హామీ, వారిని తటస్ధులను చేసిందా? ఏతావాతా వైసీపీ సంతృప్తికర స్థానంలో.. అంటే 62 స్థానాలతో విపక్షంగా మారనుందా?.. ఇదీ ఐ ప్యాక్ ఇచ్చిందంటూ సోషల్మీడియాలో జరుగుతున్న చర్చ.
వైసీపీకి మార్గదర్శి, ఆ పార్టీకి సలహా-సూచనలిచ్చే ఐ ప్యాక్ సైతం.. రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందన్న నివేదిక ఇచ్చిందన్న చర్చ సోషల్మీడియాలో ఆసక్తికరంగా సాగుతోంది. ఎప్పటికప్పుడు జనక్షేత్రంలో ఉంటూ, జనంనాడిని పార్టీకి నివేదించే ఐ ప్యాక్.. తాజా ఎన్నికల్లో ప్రజానాడిని పార్టీ నాయకత్వానికి సమర్పించిందన్న కథనాలు సోషల్మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రకారంగా ఎన్డీఏ కూటమికి 112, వైసీపీకి 62 సీట్లు వస్తాయని, వైసీపీకి 8 పార్లమెంటు స్థానాలు వస్తాయంటూ తన నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఆ ప్రకారంగా మహిళల్లో అత్యధిక శాతం వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారని, మిగిలిన ఇతర వర్గాలన్నీ కూటమి వైపే చూస్తున్నాయన్న నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ క్రైస్తవులంతా గంపగుత్తగా వైసీపీకే ఓటేస్తారన్న భావన, భ్రమే అని తేలిందట.
స్థానిక అభ్యర్ధులు, పార్టీల ఆధారంగా క్రైస్తవులు చీలిపోయారని, ఆ ప్రకారంగా 40 శాతం మంది క్రైస్తవులు టీడీపీ-జనసేన వైపే ఉన్నారని నివేదించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా కిందిస్థాయి, మధ్య స్ధాయి క్రైస్తవులు ధరలు-నిరుద్యోగం వంటి కారణాలతో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలిందట. అయితే బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీ లేదా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారని తన నివేదికలో పేర్కొందట.
అటు ముస్లిం వర్గాలు కూడా అధికార పార్టీ పట్ల విముఖంగానే ఉన్నారట. కడప, గుంటూరు, కర్నూలు, నంద్యాల వంటి ముస్లిం ప్రభావిత నియోజకర్గాల్లో సైతం అధికారపార్టీకి, ముస్లిం వర్గాల్లో స్పష్టమైన వ్యతిరేకత కనిపిస్తోందట. అయితే బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రం వారు వైసీపీ వైపే చూస్తున్నారట. టీడీపీ-జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఆ పార్టీలకే మద్దతునిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.
ఇక వైసీపీకి మానసిక మద్దతుదారుగా ఉన్న రెడ్డి సామాజికవర్గం కూడా.. అధికార పార్టీకి దూరంగా ఉన్నారని పేర్కొనడం ఆశ్చర్యకర పరిణామం. దానికి కారణం వాలంటీర్ల వ్యవస్థేనట. గ్రామాల్లో ప్రభావితం చేసే రెడ్లు ఎన్నికల సమయంలో పార్టీకి దూరంగా ఉంటే ప్రతికూల ఫలితాలు ఖాయమని నివేదించిందట.
వాలంటీర్ల వ్యవస్థ రాకముందు గ్రామాల్లో తమకు గౌరవం-విలువ ఉండేదని, వారు వచ్చిన తర్వాత తమకు కించిత్తు గౌరవం కూడా లేదన్న ఆగ్రహంతో రగిలిపోతున్నారట. టీడీపీ ప్రభుత్వం ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ, గ్రామాల్లో తమ విలువ తగ్గలేదన్నది రెడ్ల భావన. కానీ జగన్ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి తమ గౌరవాన్ని దెబ్బతీశారన్న ఆగ్రహంతో రగిలిపోతున్నారని తన నివేదికలో పేర్కొందట. అయితే కులాభిమానంతో పోలింగ్ రోజు వైసీపీకి మాత్రం ఓటు వేసి, ఇంటికి పరిమితం కావాలన్న నిర్ణయానికికొచ్చినట్లు చెబుతున్నారు.
అంటే గత ఎన్నికల్లో మాదిరిగా గెలుపు భారం మీద వేసుకుని, చేతి చమురు వదిలించుకోకూడన్న నిర్ణయానికి వచ్చినట్లు తేలిందట. జగన్ ప్రభుత్వం వాలంటీర్లను నెత్తినపెట్టుకుంది కాబట్టి, వాళ్లే గెలిపిస్తారన్న భావనతో రెడ్డి నేతలు మౌనంగా ఉండటం వల్ల… పోలింగ్రోజు కొంపకొల్లేరవుతుందన్న ఆందోళన వ్యక్తం చేసిందట.
పోనీ అటు వాలంటీర్లు ఏమైనా, పూర్తి స్థాయిలో పార్టీకి మద్దతునిస్తున్నారా అంటే అదీ లేదట. చంద్రబాబునాయుడు వాలంటీర్లకు పదివేల రూపాయం జీతం ప్రకటించక ముందు వరకూ, వాలంటీర్లలో 80 శాతం వైసీపీ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఎప్పుడైతే చంద్రబాబు పదివేల రూపాయల జీతం ఇస్తామని ప్రకటించారో, అప్పటినుంచి వాలంటీర్ల వైఖరిలో సమూల మార్పులు వచ్చినట్లు ఆ సంస్థ నివేదిక ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు పదివేల రూపాయల జీతం ప్రకటనతో, 80 శాతం మంది వాలంటీర్లు తటస్థంగా ఉండాలని, పోలింగ్ రోజు అసలు ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నారన్న నివేదిక ఇచ్చిందట.
వైసీపీ ద్వితీయ స్థాయి నేతల్లో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్లు ఆ నివేదిక తేల్చిందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ తమకు ఒక్క లోను కూడా ఇవ్వలేదని, చిన్న పనులు కూడా జరగలేదని, భాగస్వామ్యంతో చేసిన పనులకు బిల్లులివ్వలేదన్న ఆగ్రహం వారిలో బలంగా ఉందట. వైసీపీ అధికారంలో ఉన్నా తమకెలాంటి లాభం లేదుకాబట్టి, దానికోసం కష్టపడి టీడీపీకి ఎందుకు శత్రువు కావాలన్న ధోరణి గ్రామాల్లో కనిపిస్తోందట.
కాగా మహిళలు మాత్రం సంక్షేమ పథకాలతో, వైసీపీకి అనుకూలంగా ఉన్నారని పేర్కొందట. గ్రామాల్లో మహిళలు వైసీపీ వైపు 50 శాతం మంది ఉండగా, పట్టణాల్లో కేవలం 30 శాతం మహిళలే వైసీపీ వైపు ఉన్నారన్నది ఆ నివేదిక సారాంశమట. అయితే ఈ అనుకూలత శాతం.. పోలింగ్ నాటికి మరింత తగ్గే ప్రమాదం ఉందని, గెలిచే పార్టీకే ఓటేద్దామన్న భావన ఉంటే మాత్రం, మహిళల మద్దతుపై పార్టీ ఆశలు వదులుకోవాల్సిందేనని స్పష్టం చేసిందట. అయితే ఐప్యాక్ నివేదిక అధికారికంగా వెలువడలేదు. గతంలో కూడా ఇదేవిధంగా అది ఇచ్చిన నివేదికలంటూ దానిపై సోషల్మీడియాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే.