-ఉదయం 9 గంటలకల్లా ఫొటో పంపించాల్సిందే
-స్కూల్లోనే ఉండి ఫొటో పంపించాల్సిందే
-ఒక్క నిమిషం లేటయినా జీతం కట్టవుతుందంతే
-స్మార్ట్ ఫోన్లు లేని వాళ్ల సంగతేమిటన్న టీచర్ల సంఘాలు పిలుపు
-సిమ్స్-ఏపీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఫ్యాప్టో పిలుపు
ఆంధ్రాలో పంతుళ్లకు జగన్ ప్రభుత్వం ‘బొమ్మ’ చూపిస్తోంది. అదేదో సినిమాలో బొమ్మ పడుద్ది అనే డైలాగును ఇప్పుడు స్వయంగా సర్కారే పంతుళ్లకు చెబుతోంది. అంటే.. దూకుడు సినిమాలో బ్రహ్మానందం మాదిరిగా, సెల్‌ఫోన్ కెమెరా ముందు నిలబడి తన అటెండెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నమాట. ఇంకా అర్ధం కాలేదా?.. ఇకపై ప్రతి టీచరూ స్కూలుకొచ్చి తన ఫొటో పంపించాల్సిందే. అది కూడా ఉదయం 9 గంటలకే. ఐదారు నిమిషాలు లేటయినా ఫర్వాలేదు, నిమ్మళంగా పోవచ్చులేనని లైట్ తీసుకుంటే, జీతం కట్టయిపోద్దంతే. అంతేనా.. ‘ఆలస్యంగా వచ్చినందుకు తమరు ఈరోజుకు సెలవు తీసుకోవచ్చు’ అని సదరు యాప్ సందేశం ఇస్తుంది. మరి టీచర్ల సెలవులు, గట్రాలూ ఎవరు అప్‌లోడ్ చేస్తారనే కదా మీ డౌటనుమానం? ఇంకెవరు హెడ్మాష్టరేనండీ! ఆయనే టీచర్ల సెలవుల వంటి వివరాలను సర్కారీ యాప్‌లో రూపొందించాలి. అంటే ప్రతి ఒక్క టీచరు ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తీరాలన్న మాట. కానీ ’ఫ్యాఫ్టో’ మాత్రం ఠాట్.. ఈ బొమ్మలూ, గిమ్మలూ జాన్తానై. ఎవరూ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని చెబుతోంది. ఇవీ ఏపీలో ‘టీచర్ల’ బొమ్మ కష్టాలు! ఆ కష్టాల కథేమిటో వినండి.
ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయులకు రేపటి నుంచి కొత్త హాజరు విధానం రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న బయోమెట్రిక్, ఐరిస్ హాజరు విధానం స్థానంలో ఫేషియల్ రికగ్నిషన్‌ను విద్యాశాఖ తీసుకొచ్చింది. దీని కోసం ‘సిమ్స్-ఏపీ’ అనే మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేసే అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్‌లో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదు చేయాల్సి ఉంటుది. వారికి ఎన్ని సెలవులు ఉన్నాయో కూడా అందులో పేర్కొనాలి. అనంతరం వారి ఫొటోలను మూడు యాంగిల్స్‌లో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వారు పాఠశాలకు వచ్చిన వెంటనే యాప్‌లో లాగిన్ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఉదయం 9 గంటలలోపే చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా యాప్ అంగీకరించదు. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. కాబట్టి లీవ్ పెట్టకోవాలని సూచిస్తుంది. అలాగే, ఎక్కడున్నా 9 గంటలలోపు ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేస్తామంటే కుదరదు. జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను గుర్తిస్తారు. కాబట్టి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. అంటే, ఉపాధ్యాయులు కచ్చితంగా 9 గంటలలోపు స్కూల్లో ఉండాల్సిందే.
బయోమెట్రిక్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వల్లే ‘సిమ్స్-ఏపీ’ యాప్‌ను తీసుకొచ్చినట్టు ప్రభుత్వం చెబుతున్నా.. స్మార్ట్‌ఫోన్ లేని ఉపాధ్యాయుల సంగతేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏజెన్సీ, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య ఉంటుందని, అప్పుడెలా అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ ఇబ్బందులు, బస్సుల ఆలస్యం వంటిసమస్యలు కూడా ఉంటాయంటున్నారు. ఈ నేపథ్యంలో సిమ్స్-ఏపీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఉపాధ్యాయులకు సూచించింది.