Suryaa.co.in

Andhra Pradesh

మైనార్టీల ద్రోహి జగన్ రెడ్డి

– టీడీపీ మైనార్టీ జీవన ప్రమాణాలు పెంచేందుకు పథకాలు తెస్తే వైసీపీ మైనార్టీ ఓట్ల కోసం పథకాలు
– టీడీపీ ఎమ్మెల్సీ ఎన్.ఎండి. ఫరూక్

మైనార్టీల ద్రోహి జగన్ రెడ్డి అని టీడీపీ ఎమ్మెల్సీ ఎన్.ఎండి. ఫరూక్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే… అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకు గౌరవం ఇవ్వటం లేదు. మంత్రి జోగి రమేష్ నాపై దుర్బాషలాడితే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసినా ఇంత వరకు జవాబు ఇవ్వలేదు. గతంలోను ఛైర్మన్ షరీఫ్ ను నువ్వే సాయిబుకే పుట్టావా అంటూ ఇష్టానుసారంగా మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో మైనార్టీల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ముస్లీంలకు ఆర్ధిక పరిపుస్టి కలిగించాలని అన్న ఎన్టీఆర్ 1985లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు.

కాని నేడు దానిని నిర్వీర్యం చేశారు. మైనార్టీ రెసిడెన్సియల్స్ స్కూల్స్ ఏమయ్యాయి? పేద ముస్లిం ఆడపిల్లలకు దుల్హన్ పథకాన్ని అమలు చేశాం. కాని జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే లక్ష రూపాయలు ఇస్తామన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ నెలలో అమలు చేస్తామన్నారు. కాని నేటికి ఒక్కరికి ఇవ్వలేదు సరి కదా అనేక ఆంక్షలు పెట్టి అర్హులను తగ్గించారు. ప్రతి ముస్లిం పండుగ చేసుకోవాలని రంజాన్ తోఫాను అందిస్తే నేడు జగన్ రెడ్డి దానిని రద్దు చేశారు. మైనార్టీలపై విచ్చల విడిగా దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేస్తామన్నారు. కాని నేటికి ఎంక్వైరీ ఎందుకు వేయలేదు. విదేశీ విద్యను ఎందుకు అమలు చేయడం లేదు?

మతపరమైన కార్యక్రమాల కోసం మసీదులు, షాదీఖానాలు కట్టుకునే స్థోమత ముస్లింలకు లేదు కాబట్టి టీడీపీ రూ.65 కోట్లు ఖర్చు చేసింది. కాని నేడు జగన్ రెడ్డి అన్నింటిని నిలిపివేశారు. ముస్లీంలకు 10 శాతం టిడ్కో ఇవ్వాలని మేము జీవోను తెస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. మసీదుల మరమ్మత్తుల కోసం నిధులు ఆపేశారు. ముస్లీంలకు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? 8 శాతం ఉన్న ముస్లీంలకు ఒక్క పదవి ఇవ్వలేదు. మీడియాకు ఎవరైనా సలహాదారుడిగా ఉంటారా? అప్పటికి ఇద్దరి వ్యక్తులు సలహాదారులున్నప్పుడు మూడో వ్యక్తిగా సినీ నటుడు అలీకి పదవి ఇచ్చారు.

గతంలో ముస్లింల కోసం కంప్యూటర్ సెంటర్లు పెడితే నేడు వాటన్నింటని పట్టించుకోవడం లేదు. నాడు ఉర్దూను రెండో భాషగా అమలు చేసిన చరిత్ర టీడీపీది. ఉర్దూ పాఠశాలలను ప్రారంభించి 1000 మంది ఉపాధ్యాయులను తీసుకున్నాం. అసలు ముస్లీంలకు రిజర్వేషన్ ను తీసుకువచ్చింది టీడీపీనే కాని ప్రభుత్వం మారడంతో తరువాత వచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసింది. ముస్లీంలకు సబ్ ప్లాన్ అమలుచేస్తామని హామీనిచ్చి నేడు మాట తప్పి మడమ తిప్పారు.

గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో గొడవలు సృష్టించిన వ్యక్తికి సలహాదారుడిగా పడవిని కట్టబెట్టారు.
మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలను జగన్ రెడ్డి అమలు చేయాల్సి ఉంది. వక్ఫ్ భూములు ఇష్టానుసారంగా కబ్జా చేస్తున్నారు. రాజధానికి 30వేల ఎకరాలు కాదు 50వేల ఎకరాలు కావాలని నాడు జగన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పి నేడు విశాఖను రాజధానిగా ఎలా అంటారు? రాయలసీమ ప్రజలకు విశాఖకు వెళ్లాలంటే సమయం, ధనం వృధా అవుతుందని టీడీపీ ఎమ్మెల్సీ ఎన్ ఎం డి ఫరూక్ తెలిపారు.

LEAVE A RESPONSE