-పుట్టిన రోజులు చేసుకుంటూ నిసిగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారు
-ఫామ్ హౌస్లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేదతీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు
-ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు
-మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
విషయం : గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితులు, సహయ చర్యల గురించి…
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. గల్లీ ఏరైంది.. కాలనీ చెరువైంది.. రహదారి సాగరమైంది. రోడ్లన్నీ చెరువులుగా మారిపోయాయి. బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతున నీళ్లు నిలిచాయి. లోతట్టు ప్రాంతాల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.
ఇటువంటి నేపథ్యంలో బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మీరు, ప్రజలను గోసను పట్టించుకోకుండా పత్తా లేకుండా పోయారు. పుట్టిన రోజులు చేసుకుంటూ ప్రజలను మీ చావు మీరు చావండి అని వారి మానానికి వారిని వదిలేసి అని నిసిగ్గుగా బాధ్యతల నుంచి పారిపోతున్నారు. ఫామ్ హౌస్లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేదతీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు.
సందర్భం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి తండ్రి కొడుకులు పోటీ పడుతుంటారు. యావత్ ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట్లు చెబుతుంటారు. ప్రపంచ దేశాల సంగతేమో గానీ నగర ప్రజలే బయటకు రావడానికి ఒకటికి పది సార్లు ఆలోచించుకునే దుస్థితిని హైదరాబాద్ కు కల్పించారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితిని కల్పించారు.
ఇవన్నీ చూస్తుంటే మీ అసమర్థత కారణంగా హైదరాబాద్ నగరం ఎలా అభివృద్ధి చెందిందో జనాలకు అర్థమైపోయింది. విశ్వనగరమో.. విషాద నగరమో తేలిపోయింది.హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రి కొడుకులు హైదరాబాద్ నగరాన్ని నరక కూపంగా మార్చారు. గత 9 ఏళ్లుగా నగరంలో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే దిశగా ఒక్క చర్య చేపట్టలేదు. మీరు ప్రచారం చేసుకుంటున్నట్లుగా అన్ని జరిగితే ఐటీ కారిడార్ నుంచి హయత్ నగర్ దాకా ట్రాఫిక్ జామ్ లు ఎందుకు నిత్యకృత్యంగా మారుతాయి.
ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుంది. రహదారుల నిర్వహణ మీకు అప్రాధాన్యత అంశంగా మారింది. ఫ్లైఓవర్ల కింద అండర్ పాస్ లు నీళ్ళు నిండిపోయి వాహనాలు వెళ్ళలేక జనాలు ఇబ్బందిపడుతున్నారు. కొన్ని కాలనీల్లో ఫీట్ మేర గుంతలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంటే స్ట్రాటజిక్ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా ఉత్తి డొల్ల అని తేలిపోయింది.
ఇటువంటి భారీ వర్షాలకే హైదరాబాద్ నగరం అతలాకుతలంగా మారుతోంది. ముంబైలో మాదిరిగా కుండపోత పడితే పరిస్థితి ఏమిటో తలుచుకుంటేనే భయపడే స్థితి దాపురించింది. దీనికి కారణం కమీషన్లు, డబ్బు కక్కుర్తితో నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలకు అనుమతిలవ్వడం, నాళాలు, చెరువులు కబ్జా. హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛగా భూములు, చెరువులు కబ్జా చేస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.
మున్సిపల్ శాఖ మంత్రిగా అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన మీరు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం అనే స్లోగన్… మీ పార్టీకి చెందిన నాయకుల అక్రమ నిర్మాణాల విషయానికి వచ్చే సరికి ఉత్తుత్తి పాదంగా మారిపోతుంది. హైదరాబాద్ లో ఇటువంటి పరిస్థితి రాబోతుంది..నగరం కాంక్రీట్ జంగిల్ గా మారబోతుందనే విషయాన్ని కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర భారీ నిర్మాణాల మాటున దాగి ఉన్న అవినీతిని వెల్లడించే సమయంలో పత్రికాముఖంగా ప్రస్తావించాను.
భారీ నిర్మాణాలకు అనుమతిలిస్తూ కాసుల వేట కోసం మీరు సాగిస్తున్న ఆటలో హైదరాబాద్, ఇక్కడి ప్రజలు బలి కాబోతున్నారని హెచ్చరించాను. అయిన పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన పడినట్లుగా మీ వ్యవహారం ఉంది.హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమయం మీకు లేదు. వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అయిన కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ప్రజల సహాయం కోసం హాహాకారాలు చేస్తున్న పట్టించుకునే తీరిక లేదు.
రోజు కూలీకి వెళ్తే తప్ప పుట గడవని వారి స్థితి మరింత దయనీయంగా మారింది. వారి ఆర్తనాదాలను పట్టించుకునే సమయం మీకు లేదు. నా కడుపు నిండితే చాలు అన్నట్లుగా మీ వ్యవహరం సాగుతోంది. కనీసం అధికారులకు అయిన ఆదేశాలివ్వాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్న మిమ్మల్ని ఏ విధంగా శిక్షించిన పాపం లేదు.
గతంలో వరదల సమయంలో మీడియా ముందుకు వచ్చి మీరు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ ను ఉద్దరిస్తామంటూ ప్రజలను ప్రకటనల ద్వారా మభ్య పెట్టడం మినహా మీరు చేసింది శూన్యం. అప్పట్లో ప్రకటించిన పది వేల సాయం ఎన్నికల పథకంగా మిగిలిపోయింది.
మీ చేతగానితనంతో గత కొంతకాలంగా హైదరాబాద్ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. మునుపు ముంపెన్నడూ లేని కొత్త ప్రాంతాల్లో ప్రజలు వరద తిప్పలు ఎదుర్కొంటున్నారు. 2020 నుంచి పరిశీలిస్తే వరద, ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి కారణం ఎవరూ అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకున్నా పాపాన పోలేదు.
ఇప్పటికైనా మీదైనా కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి ప్రజల కష్టాలను తీర్చే ప్రయత్నం చేయండి. లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరుల స్థూపం ర్యాలీగా వెళ్లి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మీ చేతగాని తనాన్ని ఎండగట్టి తగిన బుద్ధి చెబుదాం.
డిమాండ్లు
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహయ చర్యలు చేపట్టాలి.
ప్రభావిత ప్రజలకు రూ. 10 వేల సాయం ప్రకటించాలి.
వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని దినసరి కూలీలను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
దెబ్బతిన్న రోడ్లను యుద్ధప్రాతిపదిన మరమత్తులు చేపట్టాలి.
ఎ. రేవంత్ రెడ్డి,
ఎంపీ – మల్కాజ్ గిరి,
టీపీసీసీ అధ్యక్షుడు.