– కుల మీడియా చేతిలో మరబొమ్మలుగా తండ్రీకొడుకులు
– ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2022 లో ఏపి అథ్లెట్ల ప్రదర్శన భేష్
– రాహుల్ గాంధీ ఈడీ విచారణ రాజకీయం చేయడం సరికాదు
– కర్మసిద్దాంతం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
గారడీ విద్య ప్రదర్శిస్తూ చుట్టూ గుమిగూడిన వారితో చప్పట్లు కొట్టించుకుని మురిసిపోయే అనామకుడి స్థాయికి చంద్రబాబు దిగజారాడని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. 40 ఏళ్ల రాజకీయ పార్టీకి స్థిరమైన ఎజెండా, దశ, దిశ లేకుండా పచ్చకుల మీడియా ఊతకర్రలతో నడవడం కన్నా దరిద్రం ఇంకేముంటుందని ఇక ఆఫీసుకు తాళం వేయడం మాత్రమే మిగిలిందని అన్నారు.
గాల్లో గిరగిరా తిప్పితే పిల్లలు వింత అనుభూతికి లోనవుతారని దించిన తరువాత కాళ్లపై నిలబడటం కష్టమని తెలుసుకుంటారని అన్నారు. అదే విధంగా కుల మీడియా గాల్లో ఎగరేసి ముద్దాడుతుంటే తుప్పు (చంద్రబాబు) పప్పు (లోకేష్) లు గాల్లో రెక్కలతో ఎగిరిన ఫీలింగ్ తో ఉన్నారని అన్నారు. మస్కా వేరు వాస్తవం వేరని పూర్తిగా మర్చిపోయారని కీ ఇస్తే ఆడే మరబొమ్మలయ్యారని అన్నారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2022 లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలలో ఏకంగా 13 మెడల్స్ సాధించిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన అథ్లెట్లకు శుభాభినందనలు తెలియజేసారు. నిరంతర సాధన, కష్టపడే తత్వం ఎప్పడూ విజయాన్ని అందిస్తాయని నిరూపించారని యువ అథ్లెట్లను కొనియాడారు. వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.
కర్మ సిద్ధాంతం చాలా గొప్పదని, దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, తాను ఆ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతానని తెలిపారు. రాహుల్ గాంధీ ఎదుర్కొంటున్న ఈడీ విచారణ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒకరు చేసిన పాపపుణ్యాలు ఫలాలు ఈ జీవితంలో గానీ వచ్చే జన్మలో గానీ తప్పక అనుభవిస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న ఆరోపణలను కొట్టిపారేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయమై కోర్టులో మొట్టమెదట ఒక పిల్ దాఖలు చేయడం జరిగిందని, అప్పటి ప్రభుత్వానికి దీనికీ ఏ మాత్రం సంబంధం లేదని పేర్కొన్నారు. పిల్ ద్వారా మాత్రమే ఇది బయటకు వచ్చిందని, కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ప్రభుత్వం విచారణ చేస్తోందని, దీనిని రాజకీయ కోణంలో చూడడం సరికాదని అన్నారు.