Suryaa.co.in

Editorial

నెలాఖరు నుంచి పదవుల పండగ

  • కార్పొరేషన్ పదవుల పంపిణీ షురు


  • కృష్ణయ్యతో ప్రారంభం


  • పార్టీ ఆఫీసు నేతలకు నోచాన్స్?


( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలుగు తమ్ముళ్లతోపాటు, కూటమి నేతలు గత మూడు నెలలుగా ఎదురుచూస్తున్న పదవుల పండగ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. ఆ మేరకు సీఎం చంద్రబాబునాయుడు తన మనసులోని మాటను, పార్టీ నాయకుల వద్ద వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఆయన అటు, బీజేపీ- జనసేన నాయకత్వాలతో చర్చించారు. కాకపోతే టీటీడీకి సంబంధించి బీజేపీ నుంచి ఢిల్లీ స్థాయిలో ఎక్కువ ఒత్తిళ్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్‌షా నుంచి నద్దా వరకూ, చాలామంది టీటీడీ పాలకమండలికి సిఫార్సు చేశారంటున్నారు.

ఇక 60: 20:10 నిష్పత్తిలో జరిగే పదవుల పంపిణీ ప్రకియలో, తమ వాటా కొంచెం పెంచాలని చంద్రబాబును కలిసిన బీజేపీ సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అభ్యర్ధించినట్లు తెలుస్తోంది. అంటే అదనంగా మరో రెండు, మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులను బీజేపీ ఆశిస్తోందన్నమాట.

ఇదిలాఉండగా తొలి విడతలో.. గత ఎన్నికల్లో పొత్తులో సీటు కోల్పోయిన నేతలు, పార్టీకి ప్రత్యక్షంగా-పరోక్షంగా సేవలందించిన వర్గాలకు, నామినేటెడ్ పదవులివ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే పిఠాపురం వర్మ, వర్ల రామయ్య, పట్టాభి, జీవీరెడ్డి, దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణరాజు, ఆనం వెంకటరమణారెడ్డి లాంటి నేతలకు తొలి దశలోనే పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు.

ఇక తెలంగాణలో బక్కని నర్శింహులు, నర్శిరెడ్డి, అరవిందకుమార్‌ గౌడ్, కాట్రగడ్డ ప్రసూన, తిరునగరి జ్యోత్స్న వంటి నేతల్లో ఒకరిద్దరికి కూడా నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వవచ్చంటున్నారు. ఏపీ టీటీడీలోనే పోటీ ఎక్కువగా ఉన్నందున, తెలంగాణ నేతలకు శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ దేవస్థానం కమిటీలలో స్థానం కల్పించవచ్చంటున్నారు. నిజానికి ఏపీలో పార్టీలోపాటు, కూటమి నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నందున తెలంగాణకు పదవులివ్వలేనని, ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇక పార్టీ ఆఫీసులో తిష్ఠవేసిన వారికి కాకుండా, క్షేత్రస్థాయిలో పనిచేసే సామాజికవర్గాల నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివిధ సామాజికవర్గాలకు చెందిన నాయకులు, చాలాకాలం నుంచి క్షేత్రస్థాయిలో పార్టీ ప్రత్యర్ధులతో పోరాడుతున్నారు. వీరిపై జగన్ ప్రభుత్వంలో కేసులు కూడా నమోదయ్యాయి.

వీరికి ప్రతిసారీ పదవులు దక్కడం లేదు. కానీ ఆ అవకాశాలు, వారికి కాకుండా.. వారి సామాజికవర్గం నుంచి, పార్టీ ఆఫీసులో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకే దక్కుతున్న సంప్రదాయం, చాలాకాలం నుంచి కొనసాగుతోంది. నిజానికి వీరు ఎవరర్నది ఆ సామాజికవర్గాలకే తెలియదు. వారికి పోరాటాలు తెలియవు. కానీ పార్టీ ఆఫీసులో పెద్దల ప్రాపకం సంపాదించి, కులంకార్డుతో పార్టీ ఆఫీసు నాయకులుగా చలామణి అవుతున్న వైనం.. ఆయా సామాజికవర్గాల మనుసులను గాయపరుస్తోంది.

ఈ విషయం ఆలస్యంగా గ్రహించిన నాయకత్వం.. పార్టీ ఆఫీసునేతలకు కాకుండా.. క్షేత్రస్థాయిలో పోరాడి న వారికే, పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చె బుతున్నాయి.

పదవుల పండగను మాజీ ఐఏఎస్ అధికారి, పార్టీకి కొన్నేళ్ల నుంచి విశేష సేవలందిస్తున్న కృష్ణయ్యతో ప్రారంభించడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు చైర్మన్‌గా కృష్ణయ్యను నియమిస్తూ, తాజాగా ఉత్తర్వులు వెలవడ్డాయి. ఆయన ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల నామినేషన్ వ్యవహారాలతోపాటు, ఎన్నికల కమిషన్‌కు ఉత్తర ప్రత్యుత్తరాలు-ఫిర్యాదులతో పాటు చంద్రబాబు అప్పగించిన, అనేక టాస్కులను విజయవంతంగా ముగించిన విషయం తెలిసిందే. కృష్ణయ్య మాదిరిగా గత ఎన్నికల ముందు నుంచీ పార్టీకి ప్రత్యక్షంగా-పరోక్షంగా పనిచేసిన వారి సేవలను కూడా ప్రభుత్వం వినియోగించుకోనుంది.

సీపీఆర్‌ఓ ఏరీ?..

కాగా ఇప్పటివరకూ సీఎంఓలో సీపీఆర్‌ఓను నియమించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చి మూడునెలలు దాటినప్పటికీ, ఇప్పటివరకూ కీలకమైన సీపీఆర్‌ఓను భర్తీ చేయకపోవడమే ఆశ్చర్యం. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా సీపీఆర్‌ఓ అంటూ ఎవరినీ నియమించలేదు. మీడియాతో లైజనింగ్ చేసే కీలకమైన ఈ పోస్టును, జగన్ సీఎం అయిన రెండురోజుల్లోనే భర్తీ చేసిన విషయం తెలిసింది. జగన్ సీఎంఓలో దాదాపు అరడజను మంది జర్నలిస్టులను వివిధ హోదాలతో నియమించారు. కాగా ప్రస్తుతం సీపీఆర్‌ఓ అంటూ ఎవరూ అధికారికంగా ఎవరూ లేకపోయినప్పటికీ, చంద్రబాబు వద్ద పనిచేస్తున్న, మాజీ జర్నలిస్టు ఆలూరు రమేష్ ఆ బాధ్యతలు చూస్తున్నారు.

LEAVE A RESPONSE