Suryaa.co.in

Editorial

‘షిర్డిసాయి’ని కాపాడుతుందెవరు?

(సుబ్బు)

అందరినీ షిర్డిసాయి కాపాడతాడంటారు. కానీ జగన్ జమానాలో వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు పట్టేసి, వందల ఎకరాలు లీజుకు తీసుకున్న ఈ షిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌ను మాత్రం మనుషులే రక్షిస్తున్నారు. మనుషులంటే.. ఐఏఎస్ అధికారులే. సరే విద్యుత్‌శాఖలో షిర్డిసాయి రెడ్డిగారి వెలుగుల గురించి లెక్కే లేదనుకోండి. జగన్ జమానాలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారే ఆయన బంధువు మరి. అవసరం లేకుండా వేలసంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు తయారీచేసిన ఘనత ఆ కంపెనీది.

దాని అక్రమాలపై ఎన్నికల ముందు ఒక సోమిరెడ్డి.. మరో పట్టాభి.. ఇంకో జీవీరెడ్డి.. ఒక లంకా దినకర్. ఇలా అంతా అస్త్రశస్త్రాలు సంధించారు. సోమిరెడ్డి అయితే ఏకంగా షిర్డిసాయి అక్రమాలపై కేసే వేశారు. అదిప్పుడు వాయిదాల పర్వంలో ఉంది. అది జగన్ బినామీ కంపెనీ అని, కూటమి అధికారంలోకి వస్తే దాని సంగతి తేలుస్తామని హెచ్చరించారు. వాటి అనుమతులు రద్దు చేసి, ప్రభుత్వం ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకుంటామని భరోసా ఇచ్చారు. సదరు కడపరెడ్డి గారి కంపెనీ బొక్కిన సంపదను కక్కిస్తామని ఆవేశపడ్డారు.

ఎన్నికలు ముగిశాయి. కూటమి నేతలు చేసిన ప్రజాయుద్ధంలో జగనన్న వైసీపీ ఓడిపోయి, బాబు-పవన్-లోకేష్ రెక్కల కష్టంతో కూటమి అధికారంలోకి వచ్చింది. మరి దానితో షిర్డిసాయి కంపెనీ విచారణకు వణికిపోవాలి కదా? తమకు ఇచ్చిన భూములు స్వాధీనం చేసుకుంటుందని భయపడాలి కదా? కానీ అలాంటి భయపడే సీన్లేమీ లేవు. అంతా కూల్. పైగా..కెనడా కంపెనీకి తన 80 శాతం వాటా అమ్మేసేందుకు, కూటమి నేతలు ఆరోపించిన జగన్-ఆయన బినామీ సిద్ధమవుతున్నారు. దాని విలువ కేవలం 25 వేల కోట్ల రూపాయల పైమాటేనట. అంటే తన వాటా అమ్ముకునే జగన్‌కు 25 వేల కోట్లు సమకూరుతాయన్నమాట. ఈ డీల్‌ను సెట్ చేసిందెవరంటే.. పూర్వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారబ్బాయి.

అయితే దీనికీ- కూటమి సర్కారుకూ సంబంధమేమిటన్నది బుద్ధిజీవుల సందేహం. యస్. అక్కడికే వద్దాం. కెనడా కంపెనీకి అమ్మే ముందు.. సదరు కంపెనీలకు సినిమా కష్టాలు రాకుండా.. అంటే సదరు కంపెనీపై విజిలెన్స్ దాడులు, ఇచ్చిన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోకుండా ఉండటం గట్రాలన్నమాట! అందుకే ఈ యవ్వారాన్ని సెట్ చేయడానికి, ఇప్పటివరకూ సదరు షిర్డిసాయికి సహకరిస్తూ వస్తున్న ఓ ఐఏఎస్ అధికారిని రంగంలోకి దింపింది.

పాలకుడెవరైనా.. ఇం‘ధన’శాఖలోనే ‘విజయ’వంతంగా దశాబ్దాల నుంచి వెలిగిపోతూ.. అందరివాడిగా ఘనకీర్తి తెచ్చుకున్న ఆ అధికారి లైజనింగ్‌పై, కడప రెడ్డిగారికి అంత గురి మరి! పెద్దాయన దగ్గర నుంచి చిన్నాయన వరకూ ఆ శాఖను ఆయనే వెలిగించిన అనుభవం ఉంది మరి. ప్రభుత్వంలో ఏ ఐఎఎస్ అయినా ఏడాదిన్నర, రెండేళ్లకు మించి ఆ శాఖల్లో ఉండరు. వారికి బదిలీలు తప్పనిసరి. కానీ ఈ ‘విజయ’వంతమైన అధికారికి మాత్రం, ఆ బదిలీలు మినహాయింపు. ఇం‘ధన’శాఖలో ఆయనకు మించిన మొనగాడు, నిపుణుడు మరొకరు లేనట్లు, ఏ సీఎం వచ్చినా ఆ శాఖను ఆయనే వెలిగిస్తుంటారు. అదొక ఆర్ట్‌ఆఫ్ లివింగ్!

దానితో రంగంలోకి దిగిన సదరు ఐఏఎస్, తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తున్నారట. కెనడా కంపెనీ కొనుగోలు చేయబోయే కడప రెడ్డిగారి కంపెనీని కరుణిస్తే.. ఇన్ని వేలకోట్లు ఇస్తారంటూ బంపర్ ఆఫర్ ఇస్తున్నారట. అన్నట్లు ఈ యవ్వారంలో ఓ ‘మెగా’ కంపెనీ కూడా ఉందట. మరి సీఎస్ పదవిపై కన్నేసిన సారు కలలు ఫలిస్తాయా? (అన్నట్లు తర్వాత కాబోయే సీఎస్ సారేనన్న ప్రచారం కూడా ఉంది) అసలు విద్యుత్ శాఖలో ఏం జరుగుతోంది? షిర్డిసాయి కంపెనీకి ఇచ్చిన భూములు ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? తన ప్రాణాలనే పణ ంగా పెట్టి రాక్షసులపై యుద్ధంలో గెలిచి, కూటమిని నిలబెట్టిన చంద్రబాబును అధికారులు ఎందుకు? ఎలా? మోసం చేస్తున్నారు? ఆయన కళ్లకు ఎందుకు గంతలు కడుతున్నారు?.. త్వరలో మీ ‘సూర్య’వెబ్‌సైట్ లో..

LEAVE A RESPONSE