– నాయకత్వ వైఖరిని తేల్చుకోనున్న ఏపీ బీజేపీ సీనియర్లు
– జగన్‌తో ఉన్నామనుకుంటే అదే చెప్పండి
– జగన్‌తో జంగ్ అనుకుంటే ఆ ముక్కే చెప్పండి
– గోడ మీద ఉందామనుకుంటే అదీ చెప్పండి
– కానీ మమ్మల్ని మబ్బుల్లో ఉంచకండి బాసూ..
– పార్టీ వైఖరి చెప్పకపోవడం వల్ల అందరికీ నష్టమే
– నాయకుల భవిష్యత్తును ప్రమాదంలో పడేయకండి
– బాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందన్న భావన
– దానివల్ల పార్టీ భవిష్యత్తుకు నష్టం
– తెలంగాణలో సెటిలర్లు మనల్ని నమ్మడ ం లేదు
– పార్టీ అంటే మేమంతా అని గుర్తించండి
– జగన్‌పై నాలుగేళ్లు స్పష్టత ఇవ్వకపోవడం వల్లే గందరగోళం
– ఢిల్లీకి వెళ్లనున్న బీజేపీ సీనియర్ల బృందం
– స్పష్టత వచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశం?
– ఇటీవలి కోర్ కమిటీ భేటీలోనూ ఇవే ప్రశ్నలు
– పవన్ వైఖరిపైనా ఢిల్లీ నేతల వద్ద స్పష్టత కోరనున్న నేతలు
– నేతల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలన్న అభ్యర్ధన
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘నువ్వంటే మాకు ఇష్టం అత్తా. నువ్వు ఒకమాట చెప్పు. కష్టం నీ కాంపౌండ్ వాల్ దాటకుండా చూసుకుంటా. ఇక వెయిట్ చేయడం మావల్ల కాదత్తా. కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించు’’
– ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కల్యాణ్ … తనను పట్టించుకోని, అత్తనుద్దేశించి రైల్వేస్టేషన్లో వాడిన డైలాగ్ ఇది. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా, ఏపీ బీజేపీ సీనియర్లు వాడుతున్న డైలాగ్ కూడా ఇదే. కాకపోతే సినిమాలో సీన్, రైల్వేస్టేషన్ అయితే..ఏపీ బీజేపీ నేతల సీన్ బెజవాడ. ఇవన్నీ ఢిల్లీ నేతలనుద్దేశించి ఏపీ బీజేపీ నేతల డైలాగులు! అదొక్కటే తేడా. మిగిలినదంతా సేమ్ టు సేమ్.
‘‘మా సంగతేమిటి? ఏపీలో బీజేపీకి లీడర్లంటూ కొందరున్నారు. వారిని గుర్తించండి. ఏపీలో పార్టీని ఏం చేయదలచుకున్నారో చెప్పండి. అంతే కానీ మమ్మల్ని మబ్బుల్లో పెట్టకండి. వీలైతే మీ వైఖరి చెప్పండి. లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. జగన్‌తో రణమా? రాజీనా? ఏదో ఒకటి చెప్పి పుణ్యం కట్టుకోండి. ఈ టెన్షన్ మేం భరించలేకపోతున్నాం. నరాలు కట్టవుతున్నాయి రాజా! అవతల మా పరువు కృష్ణానదిలో కలుస్తోంది’’అని.. ఢిల్లీ పార్టీని, ఏపీ కమలదళాలు చేతులెత్తి మొక్కుతున్న పరిస్థితి.
ఏపీ బీజేపీ నేతలకు తమ పరిస్థితి ఏమిటో తమకు తెలియని విషాదం. తమ పార్టీది జగన్‌తో వియ్యమా? కయ్యమా? అన్నది రాష్ట్ర అధ్యక్షురాలికే తెలియని దుస్థితి. జగన్ సర్కారుపై రాళ్ల యుద్ధమా? బంతిపూల యుద్ధమా అన్నదానిపై, ఇప్పటివరకూ ఢిల్లీ పార్టీ స్పష్టత ఇవ్వని దయనీయం. ఓవైపు తాము జగన్ సర్కారుపై , ఏ అప్పులపైనయితే యుద్ధం చేస్తున్నామో.. అదే జగన్ సర్కారుకు, వేల కోట్ల అప్పులిస్తూ ఆదుకుంటున్న వింత వైఖరి.
ఢిల్లీకి ఫ్లైట్ ఖర్చులు పెట్టుకుని మరీ.. జగన్ సర్కారు నిధుల దారిమళ్లింపుపై ఫిర్యాదు చేసిన నెల తర్వాతనే, మళ్లీ కేంద్రం జగనన్న సర్కారుకు అప్పులిచ్చి ఆదుకుంటున్న వైచిత్రి. ఫలితంగా చేతిచమురు
వదిలించుకోవడం తప్ప, తమ ఫిర్యాదుకు విలువ లేదని తెలిసిన వాస్తవం. దానితో ఢిల్లీ-తాడేపల్లి మధ్య ఏం జరుగుతుందో తెలియక నరాలు కట్టవుతున్న పరిస్థితి.
గల్లీలో తాము జగన్‌తో రణ నినాదం చేస్తుంటే, ఢిల్లీలో అదే జగనన్నతో తమ పార్టీ రాజీ చేసుకుంటున్న విభ్రాంతికర ఘట్టాలతో, కమలదళాలు కుతకుతలాడుతున్నాయి. దానిపై తాడో పేడో తేల్చుకుని.. అసలు జగన్ సర్కారుపై పార్టీ వైఖరేమిటో స్పష్టత కోరేందుకీ, ఏపీ కమలదళం ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈవారంలో బీజేపీ సీనియర్లు బీజేపీ బాస్ నద్దాతో భేటీ అయి, ఏపీలో బీజేపీ భవిష్యత్తుపై స్పష్టత తీసుకువచ్చే ప్రయత్నం చేయనున్నారట. అయితే నేతల ఫిర్యాదులు వినడమే తప్ప, స్పష్టత ఇచ్చే అలవాటు లేని నాయకత్వం.. ఏపీ నేతల ఫిర్యాదులపై ఎలాంటి స్పష్టత ఇస్తుందో చూడాలి.
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన సీనియర్లంతా, ఈవారంలో ఢిల్లీబాట పట్టనున్నారు. పలు పార్టీల నుంచి ఎన్నో అంచనాలు- ఆశలతో బీజేపీలో చేరిన తమకు, గత నాలుగేళ్లుగా జరుగుతున్న పరిణామాలు అర్ధం కావడం లేదని బీజేపీ బాస్ నద్దాకు స్పష్టం చేయనున్నారు. ఇటీవల బెజవాడలో జరిగిన బీజేపీ కోర్‌కమిటీ భేటీలో, పలువురు సీనియర్లు దీనికి సంబంధించి చర్చించినట్లు సమాచారం.
నాలుగేళ్ల నుంచి ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందో, తమకు అర్ధం కావడం లేదని వారంతా వాపోయారట. అసలు ఏపీలో బీజేపీ అధికార వైసీపీకి
మిత్రపక్షమా? శత్రుపక్షమా అర్ధం కాకుండా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఉన్నత హోదాల్లో పనిచేసిన తమకే అర్ధం కాకపోతే, ఇక కిందిస్థాయి నేతలకు ఏం అర్ధమవుతుందని వాపోయాట.
ఒకవైపు తాము జగన్ సర్కారు కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తోందని, కేంద్ర ఆర్ధికమంత్రికి ఫిర్యాదు చేసిన నెల తర్వాత.. మళ్లీ ప్రభుత్వానికి అప్పులివ్వడం ఏమిటో అర్ధం కావటం లేదని బహు బాధపడ్డారట. అంటే జగన్ సర్కారుకు పార్టీ ఆశీస్సులున్నాయని అర్ధమవుతున్నా.. ఆ విషయాన్ని అధికారికంగా ఎందుకు చెప్పడం లేదన్నది సీనియర్ల సందేహం. మరి వాటికి జవాబిచ్చేవారేరీ?
ఎమ్మెల్యే, ఎంపీలు కావాలనుకునే లక్ష్యంతో పార్టీలో చేరిన నాయకులకు, ఈ పరిణామాలు గందరగోళంగా మారాయని ఆ భేటీలో కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేశారట. జగన్ సర్కారుపై అసలు పార్టీ వైఖరి ఏమిటని, గత నాలుగేళ్ల నుంచి తమకు ఒక్క ముక్క చెప్పలేదని వాపోయారట. ఇలాగైతే నాయకుల రాజకీయ భవిష్యత్తు, ఏం కావాలని ఆందోళన చెందారట. ఏపీ పార్టీ నుంచి ఢిల్లీ పార్టీకి వాస్తవ సమాచారం వెళ్లడం లేదని, కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేశారట.
ఇక ఎన్నికలు ఎంతో దూరంలో లేవు కాబట్టి.. అసలు ఏపీలో వైసీపీపై బీజేపీ నాయకత్వ వైఖరేమిటి? అని తేల్చుకునేందుకు ఢిల్లీబాట పట్టాలని, సీనియర్లు మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు భోగట్టా. జగన్ సర్కారుపై పార్టీది నిజమైన యుద్ధమా? ఉత్తుత్తి యుద్ధమా? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని నద్దాసాబ్ను కోరనున్నట్లు సమాచారం.
అంటే.. జగన్‌కు రాజ్యసభలో ఎంపీల బలం ఉంది కాబట్టి.. ఆ పార్టీతో సఖ్యతగా ఉందామనుకుంటే, అదే విషయాన్ని స్పష్టం చేయండి. చంద్రబాబు కంటే.. కేసులున్న జగన్‌తో ఉండటమే మంచిదనుకుంటే అదే చెప్పండి. ఇవన్నీ కాకపోతే అటు జగన్-ఇటు బాబు ఇద్దరూ మనకు ముఖ్యమేనని చెప్పండి.
లేకపోతే వైసీపీతో యుద్ధం చేద్దామనుకుంటే అదే ముక్క చెప్పండి. ఎలా చేయాలో మేం నిర్ణయించుకుని, మీ లక్ష్యం నెరవేరుస్తాం. పోనీ ఇవ న్నీ కాదు.. గోడమీద ఉందామకుకుంటే అదే చెప్పండి. అసలు ఏదీ చెప్పకుండా నాలుగేళ్లుగా నాన్చడం వల్ల , నాయకుల రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో నెట్టడం భావ్యం కాదని.. సీనియర్లు ఢిల్లీ పార్టీకి స్పష్టం చేయనున్నట్లు సమాచారం.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు వెనుక.. బీజేపీ హస్తం ఉందన్న చర్చ పార్టీకి నష్టమని, కోర్‌కమిటీలో సీనియర్లు స్పష్టం చేసినట్లు సమాచారం. దీన్ని ఖండించాలని తీర్మానించారు. అయితే.. బాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందన్న చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతోందని, బీజేపీ ప్రోత్సాహంతోనే జగన్ రెచ్చిపోతున్నారన్న చర్చ, కిందిస్ధాయిలో జరుగుతున్న విషయాన్ని నద్దాజీ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా చిత్తూరు వైసీపీ ఎంపీ రెడ్డప్ప కూడా.. కేంద్ర ఆదేశాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పడం, బీజేపీ ఇమేజీని మరింత డామేజీ చేసిందని కోర్‌కమిటీ భేటీలో వెల్లడించారట. తమ ఎంపీ వ్యాఖ్యలను వైసీపీ అధినేత జగన్ కూడా ఖండించకపోవడం వల్ల, బాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందన్న అనుమానం బలపడిందని విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావం ప్రధానంగా తెలంగాణ లో.. సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో అధికంగా ఉండటం, ఆందోళన కలిగించే అంశమని చర్చించారట.
ఇదిలాఉండగా.. బీజేపీ ప్రోత్సాహంతోనే జగన్ రెచ్చిపోతున్నారని, గుజరాతీలకు ఏపీలో ప్రాజెక్టులు దక్కడం వెనుక బీజేపీ హస్తం ఉందని సెటిలర్లు భావిస్తున్నారు. దీనికితోడు బీజేపీ ఆదేశాలు-అనుమతితోనే చంద్రబాబును అరెస్టు చేశారని, సెటిలర్లు బలంగా నమ్ముతున్నారు. ఇవన్నీ రానున్న తెలంగాణ ఎన్నికల్లో.. బీజేపీకి ప్రతికూలంగా-కాంగ్రెస్‌కు అనుకూల పరిణామాలేనని బీజేపీ నేతలు స్పష్టం చేయనున్నారు.
కాగా..ఏపీ బీజేపీ సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డి ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నందున, ఆయన స్థానంలో కొత్తవారిని నియమించాలని కూడా సూచించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడు వచ్చిన
తర్వాత , కొత్త సంఘటనా మంత్రిని నియమిస్తే బాగుంటుందని పార్టీ నాయకత్వానికి సూచించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కూడా అధ్యక్షుడిని మార్చిన తర్వాత.. సంఘటనా మంత్రి శ్రీనివాస్‌జీని మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అదేవిధంగా బాగా క్రియాశీలకంగా వ్యవహరించే కేంద్రమంత్రిని, ఏపీ ఇన్చార్జిగా నియమించాలని కోరనున్నారు. ప్రస్తుత ఇన్చార్జి మురళీధరన్ పార్టీకి సమయం ఇవ్వని విషయం తెలిసిందే. ఇక కో ఇన్చార్జిగా ఉన్న సునీల్
దియోధర్ స్థానంలో కొత్త వారిని నియమించాలని కోరనున్నట్లు తెలుస్తోంది. సునీల్‌ను జాతీయ కార్యదర్శి పదవి నుంచి తొలగించినప్పటికీ, ఇంకా ఆయన ఏపీ కో ఇన్చార్జిగా కొనసాగుతుండ టంపై, సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ బీజేపీని.. మాజీ సంఘటనా మంత్రి ఒకరు, తెర వెనుక నుంచి శాసిస్తున్నారని, అనేక ‘నైతిక ఆరోపణల’తో ఏపీ నుంచి ఒక రాష్ట్రానికి బదిలీ అయి, ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఆయన.. ఏపీలో తన వర్గాన్ని కాపాడుకునేందుకు, పార్టీని బలిచేస్తున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. సోము వీర్రాజు అధ్యక్ష పదవి నియామకం, ఆ తర్వాత పురందేశ్వరికి ఇష్టం లేని వారు సైతం.. రాష్ట్ర కమిటీలో చేరటం వెనుక, ఆ మాజీ సంఘటనా మంత్రి హస్తం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఏపీలో బీజేపీ దారెటు? జగన్‌పై పార్టీ వైఖరి ఏమిటి? అన్న కీలక అంశాలను తేల్చుకునేందుకు, బీజేపీ సీనియర్లు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కాగా టీడీపీతో జత కట్టిన పవన్ వైఖరిపైనా కోర్ కమిటీలో చర్చ జరిగిందట. దానిపై నిర్ణయం తీసుకునేంత సీన్ తమకు లేదు కాబట్టి… ఢిల్లీ పార్టీని అడిగి, స్పష్టత తీసుకోవాలని నిర్ణయించారట. అయితే.. పవన్ కూడా తమతో లేకపోతే.. నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయన్నది బీజేపీ నేతలు బెంబేలెత్తుతున్నారట.