-జగన్-కేసీఆర్ జమిలి యుద్ధం
– రాష్ట్రాలే వేరు.. సేమ్ డైలాగ్స్
– కేంద్రంతో ఇక సంబంధాలు కటీఫేనా?
-తెగించనున్న ‘తెలుగు బ్రదర్స్’
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘మిమ్మల్ని వదలం.. మేం వేటాడుతాం. బీజేపీ దేశద్రోహులను తయారుచేసే ఫ్యాక్టరీనా? మాకేం వ్యాపారాలేం లేవు. మమ్మల్నేం చేయలేరు. ఈ దేశంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేసే పార్టీ బీజేపీనే. ఇతరులు చేస్తే వ్యభిచారం. మీరు చేస్తే సంసారమా? సిల్లీ బీజేపీ, సొల్లు బీజేపీ మాటలు నమ్మొద్దు. ఢిల్లీలో ధర్నా చేస్తాం’’- తెలంగాణ సీఎం కేసీఆర్
‘‘కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలతో తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయి’’- మంత్రి కేటీఆర్
‘‘ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’’ ‘‘ కేంద్రం పెట్రోల్-డీజిల్‌పై 3,35,000 కోట్లరూపాయల పన్నులు వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,475 కోట్లు మాత్రమే. అంటే కేవలం 5.80 శాతం మాత్రమే. వాస్తవంగా కేంద్రం వసూలు చేసే పన్నులలో రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచవలసి ఉన్నప్పటికీ, పెట్రో ఆదాయాన్ని విజిడబుల్‌పూల్ లోకి రాకుండా సెస్‌లు, సర్‌చార్జిల రూపంలో సుమారు 2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆమేరకు రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా? క్రూడాయిల్ ధరలు తగ్గిపోయినప్పటికీ 2019 మే లో లీటర్ పెట్రోల్ రు.76.89, లీటరు డీజిల్ రు.71.50గా ఉన్న ఆయిల్ ధరలు, నవంబర్1, 2021 నాటికి లీటర్ పెట్రోల్ రు.115.99, లీటర్ డీజిల్ రు.108.66కి చేరింది‘‘- జగన్ ప్రభుత్వ ప్రకటన

‘‘ పెట్రోల్ ధరలను భారీగా పెంచి డిస్కౌంట్ సేల్ పెట్టడమేమిటి? క్రూడాయిల్ ధరలు తగ్గినా ధరలు తగ్గించకపోవడం ప్రజలను వంచించడమే’’- ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
‘‘ ఉప ఎన్నికల్లో బీజేపీని పెట్రోల్ మంటల్లో తగులబెట్టినా ఇంకా బుద్ధిరాలేదు. దానికి సిగ్గూ, శరం రాలేదు. డిపాజిట్లు రాని గల్లీ పార్టీ సిల్లీగా వ్యవహరిస్తోంది. బెంగాల్‌లో జరిగిన నాలుగు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించారు. బీజేపీ నేతలు భ్రమల్లో బతుకుతున్నారు. కేంద్రంలోని బీజేపీ
జలగల్లాంటివాళ్లు. రాష్ట్రంలో బీజేపీని దేవుడు కూడా కాపాడలేడు- ఏపీ మంత్రి కొడాలి నాని
‘‘ కేంద్రం అదానీ, అంబానీలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటోంది’’- వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే.. కమలదళపతి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి సంజయ్, కొత్తగా ఈటల రాజేందర్ తన ప్రభుత్వంపై పెంచుతున్న ఎదురుదాడిని కేసీఆర్ సులభంగానే
గ్రహించారు. ముఖ్యంగా సంజయ్-అర్వింద్ అన్నింటికీ తెగించి కేసీఆర్‌పై సంధిస్తున్న పరుషపదజాల విమర్శలు, తిరుగుబాటు.. వారిద్దరి పై కేసీఆర్ చేస్తున్న ఎదురుదాడి వీడియోలు, సోషల్‌మీడియాలో తెలంగాణ సమాజానికి చేరువవుతున్నాయి.
బీజేపీలో కోవర్టులున్నా, మారిన పరిస్థితులు తనకు ప్రతికూలమవుతున్నాయన్న ముందస్తు సంకేతాలతో, కేసీఆర్ కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధమవుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో..
బలహీన అభ్యర్ధులను నిలబెట్టే అంశంలో ‘ఉస్మానియా యూనివర్శిటీ-సీఎంఓ సాక్షిగా’ ఒప్పందం జరిగినా, కాలం ఖర్మం కలసిరాక అదే బలహీన టీఆర్‌ఎస్ అభ్యర్ధులే, విజయం సాధించడం బహిరంగ రహస్యమే. కాంగ్రెస్‌ను అణచివేస్తే, బీజేపీ ఎదుగతుందన్న అంచనా రాజకీయ దురంధరుడయిన కేసీఆర్ గ్రహించకపోవడమే, నేటి దుస్థితికి కారణమన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. ఒకరకంగా నేటి కమలవికాసానికి కేసీఆర్ వ్యూహవైఫల్యమే కారణమన్నది గులాబీదళాల మాట.
హుజూరాబాద్ ఓటమితో… తెరాస సర్కారు పతనం ప్రారంభమయిందన్న భావన కింది స్థాయికి చేరకముందే, బీజేపీపై ఎదురుదాడి చేయడం ద్వారా.. తన ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని తిరిగి అదుపులో పెట్టే లక్ష్యం… కొత్తగా తిరుగుబాటు భావన పుట్టకూడదన్న ముందస్తు వ్యూహంతోనే , తాజాగా కేసీఆర్ హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎందుకంటే హుజూరాబాద్ పరాజయం చిన్న సన్నదేమీకాదు. కేసీఆర్‌ను సవాలు చేసి బతికిబట్టకట్టడం నరేంద్ర నుంచి విజయశాంతి లాంటి వారికే సాధ్యం కాలేదు.

చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలన్న కేసీఆర్ సిద్ధాంతం, హుజూరాబాద్ ఉప ఎన్నికలో వర్కవుటవలేదన్నది నిర్వివాదం. ఎప్పుడూ విజయంపై అతి విశ్వాసం ప్రకటించే కేసీఆర్.. ‘‘గెలిస్తే ప్రజాసేవ చేస్తాం. లేకుంటే ప్రతిపక్షంలో ఉంటామ’’న్న సర్దుబాటు ప్రకటన, తొలిసారి చేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న విశ్లేషణ. అయితే కేంద్రంపై కేసీఆర్ తిరుగుబాటు తర్వాత.. ఏ పార్టీ ఆయనతో కలసి వచ్చినా, రాకపోయినా, వామపక్షాలు మాత్రం బీజేపీపై కేసీఆర్ చేసే యుద్ధంలో ఆయనతో కలసివస్తాయన్నది ఒక అంచనా. పూర్వానుభవాల నేపథ్యంలో, అటు కాంగ్రెస్ కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు. పైగా రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చిన తర్వాత, పడిలేచిన కెరటంలా ఎగసిపడుతోంది.


అందుకే ఇక బీజేపీకి చెందిన ‘నలుగురు ప్రముఖులు’ వైసీపీ సర్కారుతో అంటకాగుతున్నా, వారిపై ‘అవసరార్ధం కోసమే’.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నదీ అంతే నిజం. అప్పట్లో జగనన్నతో కో ఆర్టినేషన్ కోసమే, కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్న వ్యాఖ్యలను తోసిపుచ్చలేం. ఒకప్పుడు ఏ సీబీఐ అయితే జగన్ జైలుకు వెళ్లేందుకు కారణమయిందో, ఇప్పడు అదే సీబీఐ… జగన్ కేసులో బలంగా వాదించకుండా, మీనమేషాలు లెక్కిస్తుందంటే.. జగన్ న్యాయవాది అందులో వాదిస్తున్నారంటే.. ఢి ల్లీ స్థాయిలో బీజేపీ-వైసీపీ బంధం, ఫెవికాల్ మాదిరిగా ఎంత పెనవేసుకుందో ఊహించడానికి మేధావి కానక్కర్లేదు.

అంటే ఏపీకి సంబంధించి.. అటు జగన్ – ఇటు చంద్రబాబు జుట్టు తన చేతిలో పట్టుకుని, సమయం వచ్చినప్పుడు.. ఒకరిని మరొకరిపై ప్రయోగించాలన్న, బీజేపీ రాజకీయ క్రీడ పామరులకూ అర్ధమయింది. కానీ దానికి ముగింపు పలికే పరిస్థితి ఇంత త్వరగా వస్తుందని.. తన చేతిలో పావుగా ఉన్న జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలసి హటాత్తుగా ఎదురు తిరుగుతారని, బహుశా బీజేపీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అప్పట్లో అంత శక్తిమంతురాలైన సోనియానే లెక్క చేయని జగనన్న, తనకు లొంగుతారని భావించడమే బీజేపీ అమాయకత్వం.
ఇప్పుడు రఘురామకృష్ణరాజు చెప్పినట్లు… సకలశాఖ మంత్రయిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కొడాలి నాని, కన్నబాబు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య వినిపిస్తున్న మోదీ-బీజేపీ ధిక్కార స్వరాల వెనుక.. జగన్ ఉన్నారన్నది, ‘ మెడపై తల ఉంటుందన్న’ంత నిజం. అవును. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించడమంటే, మోదీ-అమిత్‌షాతో యుద్ధం చేయడమే. సహజంగా ప్రాంతీయ పార్టీల్లో అధినేతలదే ఫైనల్. అందులో పనిచేసేవాడు ఎంత మొనగాడయినా, అధినేత చెప్పినట్లు చేయాల్సిందే. అది చంద్రబాబయినా, జగనయినా! ఇప్పుడు సజ్జల, కన్నాబాబు, కొడాలి బీజేపీపై ఒంటికాలితో లేచారంటే.. దానికి జగనన్న అనుమతి ఉందన్నది, బుర్ర బుద్ధీ ఉన్న ఎవరికయినా సులభంగా అర్ధమవుతుంది. పైగా కేంద్రంతో వ్యవహారం కాబట్టి, వారంతా తమంతట తాము ప్రెస్‌మీట్లు పెట్టేంత సీను ఉండదు. ప్రాంతీయ పార్టీలో ఏ అంశంపై ఎలా స్పందించాలి? ఎవరితో ఏం మాట్లాడించాలన్నది ఉదయమే ఫిక్సవుతుంది. కాబట్టి.. ఇప్పుడు బీజేపీపై ధ్వజమెత్తుతున్న సజ్జల, కన్నబాబు, కొడాలి నాని.. జగనన్న అనుమతి లేకుండానే ‘స్వయంకపోతాల’తో, ప్రెస్‌మీట్లు పెట్టారనుకునే వారిని అర్జంటుగా ‘ అంతర్జాతీయ అమాయకరత్న’ బిరుదిచ్చి సత్కరించాల్సిందే. బీజేపీ అంత అమాయకురాలేమీ కాదు. కాబట్టి.. ‘వాళ్లు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేదు. అవన్నీ వారి వ్యక్తిగత అభిప్రాయాలే’నని రేపు జగనన్న చెప్పినా, ఆ పప్పులు ఢిల్లీ బీజేపీ ముందు ఉడకవు.
అయితే… రాష్ట్రంలో జరిగే అన్ని వ్యవహారాలూ మోదీ-అమిత్‌షాకు చెప్పే చేస్తున్నామని గతంలోనే సెలవిచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం.. తాజా ఎపిసోడ్‌లో కేంద్రంపై విరుచుకుపడకుండా, ఎందుకు మౌనంగా ఉన్నారన్నదే అందరి ఆశ్చర్యానికి కారణం. బహుశా ఇది కూడా జగనన్న వ్యూహంలో భాగమనుకోవాలా?
