నవజాత శిశువులకు
తొలి పంతులమ్మ.. అమ్మ
బడి ఈడూ.. వచ్చేవరకు
అమ్మ ఒడే… అంగన వాడి
అమ్మ నీడలోనే పలుకు బడి!
పోలికలతో అచ్చులు నేర్పుతుంది
చేరికలలో హల్లులు కూర్చుతుంది
ఒడిలోనే నుడికారాలు నేర్పుతుంది
నడకలోనే గుణింతాలను నేర్పుతుంది!
చిన్నారులను ఇహ లోకానికి
పరిచయం చేసే తొలి గురువు
గోరుముద్దలను లీలగా తినిపిస్తూ
చందమామ కథలు చెబుతుంది
పుక్కిట పురాణాలను నేర్పిస్తుంది!
గుడ్డ ఊయలలో పరుండ బెట్టి
దొడ్డ అన్నమయ్య లాలిని పాడు
పొట్ట మీద ఎక్కించుకొని పిల్లలను
పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది
వీపు పైన బుడతలను హత్తుకుంటూ
అనుబంధాలకు అర్థం చెబుతుంది!
తాతతో తొలి పలుకులకు శ్రీకారం
అమ్మనాన్నల మాటలతో మమకారం
కుటుంబ సభ్యులతో పరిచయాలు
ఇరుగు పొరుగు వారితో కరచాలనాలు
చేయించేది.. అవనిలో అమ్మ ఒక్కతే!
ఏడ్చినపుడు రొమ్ము పాలిచ్చు
విసిగించినపుడు గోముగా దండించు
బుడి బుడి నడకలు వడివడిగా
బడి వైపు మారేంత వరకు అమ్మ
పసిడి పిల్లలకు… తొలి పంతులమ్మే!
– జి.సూర్యనారాయణ
6281725659