Suryaa.co.in

Features

తీరం దాటిన ప్రళయం!

అయ్యోఎంతఘోరం
ఈ తుఫాను ఒక ధ్వంస రచన
వరద బీభత్సం ఒక దగ్థగీతం

తెలుగునేల గుండెల్లో
ప్రకృతి విసిరిన జల ఖడ్గం

సుజలాం… సుఫలాం..
ముక్కలైన వాక్యాలు
నేడు ఖండిత హృదయమై…
భరతమాత

కనుచూపు మేరా నీటి ఎడారి
కనువిప్పు లేని మనిషి బికారి

కన్నీటి వరదలో
మునిగిన పేదరికం
నేలరాలిన చేలు
వెన్ను విరిగిన రైతన్నలు

తినే తిండి ఉండే గుడిసె
కట్టుకునే బట్ట గొడ్డు గోదా
సర్వం కృష్ణార్పణం
రామ్ తేరి గంగా మైలీ

ఆకుపచ్చని సముద్రం లో
అల్పపీడన ద్రోణి
కన్నీటి ద్వీపంలో గ్రామాలు
నీటి మంటల్లో కాలుతూ. ..

ఆకలి ఎలుగెత్తి పిలుస్తూంటే
ఆకాశంనుంచి రాలే
ఆహారపొట్లాలకై
ఎదురుచూస్తూ…సామాన్య జనం

మనిషితనమే ముంపుకు గురై..
అడవులను నరికేస్తూ
చెరువుల దురాక్రమణలో
చెరుపు చేసిన అధికారం
ఈ నీతితప్పిన స్వార్థ జగాన
నెపం ఎవరిపైన వేద్దాం ?

ప్రాణుల ఊపిరి లూదే నీరు
వెండిపట్టీలై భాసించే నీరు
వానబాణాలు వేస్తూ
వెంటాడి వేటాడుతుంటే
జలసమాథి లో నేలతల్లి

ఏ నీటి సంగ్రామం లో నైనా
బలయ్యేది బడుగుజీవులే కదా
బాల్యంలో కాగితపు పడవలు చేసి
ఆడుకునే వాళ్ళం
ఇప్పుడిక్కడ వరదొస్తే చాలు
మా బతుకులే చిల్లుపడవల ఇల్లులైనాయి

లోకమే కాదు కాలమూ
కలుషితమైన నేపథ్యంలో.
విషతుల్యమైన పర్యావరణం
నెత్తుటి జెండా ఎగురేస్తూ…

ప్రకృతి కాంత ను ప్రేమిస్తే ప్రణయం
ద్వేషిస్తే ప్రళయం

ఓవైపు కరువు తాండవం
మరోవైపు తుఫాను విలయం
కాలమెప్పుడూ రెండంచుల కత్తే

నీరైనా కన్నీరైనా తీరం దాటితే
ఎగిరేది ఏడవనెంబరు జెండా

ఇప్పుడిక్కడ
నీట మునిగిన నేలతల్లికి
చేయుత నిచ్చేందుకు
ఆపన్న హస్తాలు కావాలి

మనిషిభాష తెలిసిన వారెవరైనా
దయచేసి అనువదించండి
అందరం మానవహారమై
కలసికట్టుగా కదలిరావాలి అని

ఎలుగెత్తి చాటండి
ఎగిరే జాతీయ పతాకాలై

-సరికొండ నరసింహ రాజు

LEAVE A RESPONSE