Suryaa.co.in

Andhra Pradesh

బిట్రగుంట రైల్వే సెంటర్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టండి

– ఎంపీ వేమిరెడ్డి
– కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఎంపీ వినతి
– అభివృద్ధి చేస్తే జిల్లాతో పాటు రాష్ట్రానికి ఆదాయం
– సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

బుధవారం  నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ని కలిసి నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే సెంటర్‌ను అభివృద్ధి చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే సెంటర్‌ ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖ అందించారు. అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యతను అందులో వివరించారు.

బ్రిటిష్‌ హయాంలో బిట్రగుంట రైల్వే స్టేషన్‌ కు చాలా ప్రాధాన్యత ఉండేదని, దక్షిణ భారతదేశంలో ఒక చారిత్రక పాత్ర పోషించిందన్నారు. గతంలో అన్ని మౌలిక సదుపాయాలు కలిగి చిన్న ఇంగ్లండ్‌గా ప్రసిద్ధి చెందిందని వివరించారు. దాదాపు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైల్వే సెంటర్‌కు సంబంధించి ప్రస్తుతం 420 ఎకరాల భూమి అభివృద్ధి కోసం ఖాళీగా ఉందన్నారు.

అదేవిధంగా జాతీయ రహదారి-16కి ఆనుకుని ఉన్న బిట్రగుంటలో కార్యాలయ భవనాలు, రైల్వే క్వార్టర్స్, మెయింటెనెన్స్ డిపో, తగినంత నీటి సరఫరా, మెడికల్ రిలీఫ్ వ్యాన్, ఆఫీసర్స్ రెస్ట్ హౌస్‌లు, డ్రైవర్లు మరియు గార్డుల కోసం రన్నింగ్ రూమ్‌లు, రైల్వే హెల్త్ యూనిట్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే కృష్ణపట్నం ఓడరేవు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరియు రామాయపట్నం ఓడరేవులు బిట్రగుంట నుంచి కేవలం 20- 45 కి.మీ.ల దూరంలో ఉన్నాయని కేంద్ర మంత్రికి వివరించారు.

స్టీమ్ లోకోమోటివ్స్ ఉన్నకాలంలో బిట్రగుంట స్టేషన్‌ 24 గంటలూ పనిచేసేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని వనరులు ఉన్న బిట్రగుంట రైల్వే సెంటర్‌ను అభివృద్ధి చేస్తే రైల్వేలకు మంచి ఆదాయం సమకూరడంతో పాటు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి సహాయపడుతుందని వివరించారు. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) కి సంబంధించి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల యూనిట్‌ను బిట్రగుంటలో ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. ఇన్ని వసతులు ఉన్న బిట్రగుంట రైల్వేసెంటర్‌ను పరిశీలించి సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

LEAVE A RESPONSE