-హర్షం వ్యక్తం చేసిన అర్చక, బ్రాహ్మణ సంఘాలు
-ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రైవేటు దేవాలయాలు, అర్చకులు తమ పేర్లు దేవాదాయ శాఖ వద్ద నమోదు చేసుకోవాలి
అమరావతి: బుధవారం గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో అర్చకులకు, దేవాలయాలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రభుత్వం ఏర్పడి 50 రోజుల్లోనే కనీసం ధూప,దీప, నైవేద్యాలకి నోచుకోని సుమారు 6,000 దేవాలయాలకు గతంలో పనిచేసిన చంద్రబాబు ప్రభుత్వంలోనే ఇచ్చిన 5,000 రూ/- ల నుండి 10000 రూ/- లు పెంచటం పట్ల రాష్ట్రంలో ఉన్న అర్చక సంఘాలు, అర్చకులు, భక్తులు, బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో దేవదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయానికి వారికి శ్రీధర్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలానే ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ కింద సుమారు 27,872 దేవాలయాలు పనిచేస్తున్నట్లు అవి కాక ప్రైవేట్ దేవస్థానాలు సుమారు 3 వేల నుంచి 6 వేల ప్రవేట్ దేవాలయాలు ఈ 26 జిల్లాల్లో ఉన్నట్లు శ్రీధర్ తెలియజేశారు. అయితే వీటిలో కనీసం అర్చకుడికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో మరియు దేవాలయాలకు ధూప,దీప, నైవేద్యాలు కూడా ఇవ్వలేని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రవేట్ కమిటీ దేవాలయాలు ఉన్నట్లు శ్రీధర్ తెలియజేశారు.
అయితే ధూప దీప నైవేద్యాలకు, అర్చకులకు జీతాలు ఇవ్వలేని దేవాలయాలను, ఆయా అర్చకులను దేవాదాయ శాఖ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవలసినదిగా దేవాదాయ శాఖ మాత్యులు కొత్తగా మెమో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, అందువల్ల ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది పడుతున్న దేవాలయాలు మరియు అర్చకలకు జీతాలు ఇవ్వలేని దేవాలయాలు తప్పనిసరిగా తమ దేవాలయం పేరు, అర్చకుడు పేరు ఈ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా శ్రీధర్ పిలుపునిచ్చారు.
ఇలా నమోదు చేసుకున్న ప్రవేట్ దేవాలయాలకు ధూప దీప నైవేద్యాల పథకం వర్తించే విధానంతోపాటు అర్చకుల కుటుంబ జీవన విధానాలకు తగ్గట్టుగా తగిన ప్రణాళికలు దేవాదాయ శాఖ రూపొందిస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు. ఈ విధానం ద్వారా అర్చక వ్యవస్థ కాపాడుతుందని బలపడుతుందని శ్రీధర్ తెలియజేశారు.
గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో ఇదే ధూప దీప నైవేద్య పథకం కింద (డిడిఎన్ఎస్) 5,000₹ నుండి 10,000₹ చేయమని దేవాలయాల అర్చకులు, వైసిపి పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రాధేయపడిన కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని, అదే చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికల్లో అర్చకులకు, దేవాలయాలకు మేనిఫెస్టో ద్వారా ఇచ్చిన హామీని నిలుపుకోవడం పట్ల శ్రీధర్ చంద్రబాబు ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్లమూడి రాజ, ఎండపల్లి శబరి, వడ్డమాను ప్రసాదు, వి.చైతన్య, సిహెచ్ ఫణి తదితరులు పాల్గొన్నారు.