Suryaa.co.in

Telangana

ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి

– పాత ప్రాజెక్టుల నిర్వహణ పై దృష్టి పెట్టండి
– నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, వీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన సాగునీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో వారు పలు అంశాలు చర్చించారు.

ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని, AMRP లో ఐదవ పంపు ఏర్పాటు చేసుకునే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పూర్తిగా స్టడీ చేసి గోదావరి నీటితో పాలేరు రిజర్వాయర్ ను పరిపుష్టం చేసే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదావరి పరిధిలో బస్వాపూర్ మొదలు సింగూరు వరకు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏదుల నుంచి వట్టెం – ఏదుల కాలువలు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.

డిండి ఎత్తిపోతల పథకం పరిధిలో చివరి దశకు చేరుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని ఇరువురు మంత్రులు ఆదేశించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టుల కింద ఉన్న భూ సేకరణ, పాత ప్రాజెక్టుల నిర్వహణ, క్యాపిటల్ వర్క్స్ పై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునికరించుకోవడం, కాలువలకు లైనింగ్ ద్వారా ప్రాజెక్టుల జీవితకాలం పెరుగుతుందని, అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు.

గత పది సంవత్సరాల పాటు పరిపాలించిన వారు కేవలం ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి సారించి, రాష్ట్రంలో ఉన్న పాత ప్రాజెక్టుల నిర్వహణ అంశాన్ని గాలికి వదిలేయడంతో అవి ప్రమాదంలో పడే పరిస్థితి ఎదురైందని వివరించారు. పాత ప్రాజెక్టులను కాపాడుకునేందుకు మెయింటెనెన్స్ పనులు చేసుకుంటూనే, కేంద్ర నుంచి వివిధ పథకాల ద్వారా నిధులు రాబట్టేందుకు ఉన్న అవకాశాలను త్వరితగతిన పరిశీలించాలని మంత్రులు తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక లీగల్ టీం ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని మీడియం, మైనర్ ప్రాజెక్టుల గేట్ల పరమతులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువలను బలోపేతం చేసుకునే పనులపై దృష్టి పెట్టాలని సూచించారు.

గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు అడ్డగోలుగా ఎక్కువ వడ్డీ రేట్లు కు అప్పులు తేవడంతో ఆ భారం ప్రస్తుత ఖజానా నిర్వహణపై పడుతుందని తెలిపారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన వారు 10% వడ్డీ రేటుకు అప్పులు తేగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వడ్డీ రేట్లు 8 శాతానికి తగ్గించేందుకు అధికారులు మంచి ప్రయత్నం చేశారని మంత్రులు తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఈ పథకం నిర్వహణలో ఇబ్బందులు తలెత్తకుండా పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు.

సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య దాస్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ENC జనరల్ అనిల్, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, R &R కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి, O &m ENC విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE