– టీడీపీ,జనసేన నుంచి చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిద్దాం
– అప్పుడు కోటంరెడ్డి, ఆనం కూడా రాజీనామా చేయాల్సిందే
– 7 అసెంబ్లీ స్థానాలలో ఉప ఎన్నికలకు వెళదామని సూచన
– జంప్ జిలానీపై అప్రతిష్ఠ చెరిపేసుకునే ఆవకాశమని సీనియర్ల వాదన
– జనం మనవైపే ఉన్నారంటున్న వైసీపీ సీనియర్లు
– అన్ని స్థానాలూ గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మనదే గెలుపన్న బలమైన భావన
– సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు సంతృప్తి
– ప్రతి కుటుంబానికి లక్షన్నర రూపాయల లబ్థి
-ఉప ఎన్నికలతో పథకాల సంతృప్తిపై పరీక్ష పట్టాలని సీనియర్ల సూచన
– క్యాడర్ మనోగతం కూడా తెలిసిపోతుందన్న అభిప్రాయం
– ఫలితాలతో దిద్దుబాటు వ్యూహాలకు వెసులుబాటు
– ఫైనల్ పోటీకి ముందు ఇదో టెస్ట్‌సిగ్నల్స్ అంటున్న అధికార పార్టీ నేతలు
– జగనన్న నిర్ణయం కోసం ఎదురుచూపులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
పార్టీలో తిరుగుబాట్లు.. క్యాడర్ అసంతృప్తి.. విపక్షాల హడావిడి.. అగ్రనేతల పర్యటనలు.. కోర్టుల్లో ప్రతికూల ఫలితాలు.. సకాలంలో జీతాలు రాక ఉద్యోగుల అసంతృప్తి.. ద్వితీయ శ్రేణి నేతలకు బిల్లుల రాక అసంతృప్తి.. వంటి అంశాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వైసీపీ.. తన భవిష్యత్తును ముందస్తుగా నిర్దేశించుకునేందుకు వీలుగా, ఉప ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేయడం పార్టీలో సంచలనం సృష్టించింది. ఇంకా మరో ఏడాది అధికారం ఉండగనే, వారిద్దరూ పార్టీ అధినేత జగన్‌పై తిరుగుబాటు చేయడం, అటు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. వీరు కాకుండా.. చేసిన పనికి బిల్లులు రాక అధికార పార్టీ సర్పంచులు కూడా, అసంతృప్తితో రగిలిపోతున్నారు. సకాలంలో జీతాలు అందని ఉద్యోగ వర్గాలు, వైసీపీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మరోవైపు సాంప్రదాయక మద్దతుదారైన రెడ్డి సామాజికవర్గం కూడా, అసంతృప్తితో కనిపిస్తోంది.
ఇదే పరిస్థితి కొనసాగితే.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై, వీటి ప్రభావం ఉంటుందని పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని ముందస్తుగా నివారించి, ప్రజల పల్సు తెలుసుకునేందుకు.. ఉప ఎన్నికలకు వెళ్లటమే ఏకైక పరిష్కారమని పార్టీ అధినేత జగన్‌కు సూచిస్తున్నారు. ఉప ఎన్నికల్లో మొత్తం గెలిస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపు ఖాయమన్న భావన ప్రజల్లో స్థిరపడుతుందని స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై సలహాదారులు జగన్‌తో చర్చించాలని సూచిస్తున్నారు.
జనం బలం, వివిధ వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలు, అవినీతి రహిత పాలన కారణాల దృష్ట్యా, ఉప ఎన్నికలు నిర్వహించినా తిరిగి పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి కుటుంబానికి ఏడాదికి, లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల లబ్థి చేకూరుతోందని గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా మహిళలు పార్టీని ఆదరిస్తున్నారని, ఇది తమకు తిరుగులేని బలమేనని స్పష్టం చేస్తున్నారు.
టీడీపీ నుంచి చేరిన నలుగురు ఎమ్మెల్యేలయిన కరణం బలరాం, వ ల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ ఇప్పటికీ ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. అయినా వైసీపీ కండువాలు కప్పేసుకుని, వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ శాసనసభాపక్షం చాలాకాలం క్రితమే స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
అటు జనసేన నుంచి ఎన్నికయిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రాదరావు కూడా తన పార్టీకి రాజీనామా చేయకుండానే, వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వైసీపీ నుంచి ఆనం, కోటంరెడ్డి దూరమయ్యారు. టీడీపీ నుంచి వైసీపీ తీసుకున్న నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖలు ఇస్తే తామూ ఇస్తామని, కోటంరెడ్డి తాజాగా షరతు విధించారు. మీకో న్యాయం-మాకో న్యాయమా? అని నిలదీశారు. ఒకవేళ వైసీపీ అందుకు అంగీకరిస్తే, మొత్తం 7 అసెంబ్లీ స్థానాలకు, ఉప ఎన్నికలు జరగడం అనివార్యమవుతుంది.
ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు.. మరో ఏడాది సమయం ఉన్నందున, ఉప ఎన్నికలకు వెళ్లి పబ్లిక్ పల్సు ఎలా ఉందో తెలుసుకోవడమే మంచిదని వైసీపీ సీనియర్లు జగన్‌కు సూచిస్తున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జట్పీటీసీ, చివరకు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం.. మెజారిటీ సీట్లు వైసీపీ గెలిచిన వైనాన్ని సీనియర్లు గుర్తు చేస్తున్నారు.
తమ పార్టీ బలం, నేతల స్పీడు చూసి టీడీపీ పోటీ చేసేందుకు భయపడి, పారిపోవలసి వచ్చిందని వైసీపీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి కొనసాగుతోందంటున్నారు. తిరుపతి లోక్‌సభ, ఆత్మకూరు, బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తిరుపతి లోక్‌సభ తప్ప, మిగిలిన రెండు అసెంబీ ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా, పారిపోవడాన్ని విస్మరించకూడదని వైసీపీ సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు.
ఈ వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో .. మొత్తం 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తే, కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు , ఎటు వైపు ఉంటారన్న విషయం తేలిపోతుందని సీనియర్లు సూచిస్తున్నారు.పైగా తమ పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలను, ఫిరాయింపులకు ప్రోత్సహించిందన్న అప్రతిష్ఠకు తెరదించవచ్చని చెబుతున్నారు.
ప్రభుత్వ పథకాలు, స్థానిక నేతలపై ప్రజల అభిప్రాయం ఏమిటో ఉప ఎన్నికల్లో తేలిపోతే, వాటిని బట్టి దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు పార్టీకి టానిక్‌లా పనిచేస్తుందని, ఫలితాలను బట్టి పార్టీ భవిష్యత్తు వ్యూహాలు మార్చుకునే వెసులుబాటు ఉంటుందని సూచిస్తున్నారు.
ఉప ఎన్నికలు నిర్వహించినా.. ఈ పరిస్థితిలో మరో ఏడాది కోసం, డబ్బు ఖర్చు చేసి టీడీపీ పోటీ చేసే సాహసం చేయకపోవచ్చని, వైసీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిస్తే, అది వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ క్యాడర్‌కు బలమైన టానిక్‌లా పనిచేస్తుందని విశ్లేషిస్తున్నారు, కాబట్టి ఉప ఎన్నికలు వెళ్లడం ద్వారా, వాటి ఫలితాల మేరకు కొత్త వ్యూహాలు రచించుకునే అవకాశం జారవిడుచుకోవద్దని, సీనియర్లు తమ పార్టీ అధినేత జగన్‌కు సూచిస్తున్నారు. మరి జగనన్న ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.