దాదాపు యాభై ఐదేళ్ల నాటి ముచ్చట ఇది.అది 1970… 71 ప్రాంతం. గుంటూరులో కొత్తగా నెలకొల్పిన “జాగార్లమూడి కుప్పుస్వామి చౌదరి ( జేకేసీ) కళాశాల లో బీఏ రెండో సంవత్సరంలోనో… ఏమో ఉన్నాను. కళాశాలలో ఏఐఎస్ఎఫ్ (అల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్) భావజాలానికో, కార్యకలాపాలకో నేను ప్రతినిధిగా వ్యవహరించేవాడిని.
ఆ సమయం లోనే – ఇప్పటి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు, అప్పటి ఎంపీ వేములపల్లి శ్రీకృష్ణ గారి రెండో కుమార్తె కల్పన, గుంటూరు జిల్లా సిపిఐ కార్యదర్శి గంగాధరరావు గారి పెద్దబ్బాయి నాగార్జున వంటి అనేక మంది నాతో కలిసి ఏఐఎస్ఎఫ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు. సాయంత్రాలలో అన్ని కాలేజీల లోనివారం కొరిటపాడు పార్క్ లో సమావేశం అయ్యేవాళ్ళం.
మా అందరికీ ( గుంటూరు టౌన్ ) నాయకుడు… కే. నారాయణ. కొరిటపాడులోని ప్రభుత్వ ఆయుర్వేద కాలేజ్ లో అప్పటికే ఏ ఐదారేళ్ల నుంచో చదువు’కుంటు’న్నాడు. మాంచి ఎత్తు, నవ్వు మొహం. అన్ని కాలేజీలు తిరుగుతూ విద్యార్థులను సూదంటు రాయి లో ఆకర్షిస్తూ ఉండేవాడు.
మా అందరికీ, స్థాలిన్ గారు గాడ్ ఫాదర్. ఆజానుబాహుడు, కోపతాపాలకు అతీతుడా అన్న భావం కల్పించే ఆయన మాట్లాడుతుంటే… తన్మయత్వంలో మునిగిపోయే వాళ్ళం. ఆయన పక్కన, అడ్వకేట్ వెంకటప్పయ్య, పెద నాగేశ్వరరావు ఉండేవారు. ఎప్పుడు క్లాసులు అయిపోతాయా…. ఎప్పుడు వెళ్లి కొరిటపాడు పార్క్ లో పడదామా అన్నట్టుగా మా పరిస్థితి ఉండేది.
ఆ రోజుల్లో…. ప్లేట్ ఇడ్లీ గానీ, దోసె గానీ బేడా ఉండేది. (అంటే రెండు అణాలు. అంటే పన్నెండు పైసలు ).
గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లోనే…. శంకర్ విలాస్, సెంట్రల్ కేఫ్, గీతా కేఫ్… ఉండేవి, బ్రాడిపేట 4 వ లైన్ లోకి తిరిగితే, ఓ పెంకుటింట్లో మైసూర్ కేఫ్ ఉండేది. దాదాపుగా స్టూడెంట్స్ ఎక్కువమంది ఈ నాలుగైదు హోటళ్ళ లోనే అల్పాహారం తీసుకునే వారు.
(నేను, నా బెంచ్ మేట్ పులికొండ పాండురంగ గుప్త మైసూర్ కేఫ్ లోనే తినేవారం. రెండు ప్లేట్ ఇడ్లీ, ఉల్లి దోసెలు రెండు , రోస్ట్, ఆయిల్ ఎక్కువ, గట్టి చట్నీ, తాలింపు కలిపి – ఒక రూపాయి ముప్ఫయ్ అయిదు పైసలు )
ఒకరోజు… బిల్ ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది అని అడిగితే, ఇవ్వాల్టి నుంచి రేట్లు పెరిగినయ్ అని చెప్పారు ). వెంటనే మిగిలిన నాలుగు హోటల్స్ లో కనుక్కుంటే…. రేట్లు డబల్ డబల్ చేశారు.
ఇది ఘోరమైన దోపిడీ అనిపించింది.
ఆ సాయంత్రం ” కొరిటపాడు పార్క్ మీటింగ్ ” తీవ్రం గా చర్చించి, పెంచిన ధరలను తగ్గించేవరకు ” ఆందోళనలు ” చేయాలని నిర్ణయించాం.
హోటల్ యాజమాన్యాల ఈ ఏకపక్ష నిర్ణయాలపై, కలెక్టర్ జయభారత రెడ్డి కి వినతి పత్రం ఇచ్చాము. మూడు నాలుగు రోజులు వేచి చూసినా ఫలితం లేదు.
ఇక లాభం లేదు అనుకుని, కాలేజీలు బాయ్ కాట్ చేసేసి…. ఆ హోటళ్ళ ముందు పికేటింగ్ మొదలు పెట్టాం. రోడ్ల వెంట వెళ్లే వాళ్లకు కరపత్రాలు పంచడం, హోటళ్ళ లోనికి వెడదామనుకునే వారికి హోటళ్ళ ” దోపిడీ ” వివరించడం మొదలు పెట్టామ్.
మూడు రోజులు అయ్యేటప్పటికి హోటల్ యజమానులకు చమటలు పట్టేశాయి. యధావిధిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. వారు వచ్చారూ అంటే… శాంతి -భద్రతలకు భంగం అయినట్టేగా! లేకపోతే, వాళ్లకు నిద్ర పట్టదు కదా! వచ్చీ రావడం తోనే, లాఠిలకు పని చెప్పారు. సాయిబాబా అని సీఐ ఒకరు ఉండేవారు. లాఠీ కర్రంతే ఉండేవారు. బుల్లెట్ మోటార్ సైకల్ పై కూర్చుంటే, రెండు కాళ్ళు నేల మీద ఆనేవి కావు.
వాళ్ళు వచ్చేసి, హోటళ్ళ లోకి వెళ్లి… పీకల దాకా శుభ్రం గా తినేసి, బయటకు వస్తూనే మామీద పడిపోయారు.
దాంతో మేము, శంకర్ విలాస్ ఎదురుగా ఉన్న రోడ్ మీద బాచీపట్లు వేసుకుని కూర్చున్నాం. నో స్లొగన్స్. నో సౌండ్స్. ముందు వరసలో నారాయణ, పెద నాగేశ్వర రావు, అడ్వకేట్ వెంకటప్పయ్య, వేములపల్లి కల్పన. వెనకాల మేము. అలా ఓ వందమందిమి కూర్చున్నాం.
సన్నగా చినుకులు పడుతున్నాయ్ గానీ, కదల లేదు. సాయంత్రం 5 గంటల ప్రాంతం లో కలెక్టర్ గారి దగ్గరి నుంచి కబురు, బంగాళా కు రమ్మని.
ధర్నా విరమించాం. మొత్తం ఓ యాభై మందిమి…. నారాయణ నాయకత్వం లో నినాదాలు చేసుకుంటూ… బ్రాడిపేట నాలుగో లైన్ లో నడుచుకుంటూ, పద్నాలుగో అడ్డ రోడ్డు లు రైల్వే గేట్ దాటి, కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న కలెక్టర్ బంగాళా వద్దకు చేరుకున్నాం. మమ్ముల్ని పోలీసులు గేట్ వద్దే ఆపేశారు. చినుకులు సన్నగా పడుతూనే ఉన్నాయ్.
నలుగురినే కలెక్టర్ గారు లోపలికి రమ్మన్నారని ఓ పోలీసాయన లోపలినించి వచ్చి చెప్పాడు.
“కుదరదు, అందరం లోపలికి వస్తాం. లేదంటే, కలెక్టర్ గారినే గేట్ దగ్గరకు రమ్మని చెప్పండి ” అని తెగేసి చెప్పాం. ఈ తడిక రాయబారాలు కాసేపు ముందుకు…. వెనక్కు నడిచాక ; కలెక్టర్ గారే స్వయంగా వస్తున్నారు అనే కబురు వచ్చింది.. దానితో మా విద్యార్థుల్లో ఒక్కసారిగా వెయ్యి ఓల్టు ల బల్బులు వెలిగినట్టయింది.
కాసేపటికి కలెక్టర్ – జయభారత రెడ్డి గారు వచ్చారు. గొప్ప అందగాడు. ఆజానుబాహువు. చక్కని కంఠస్వరం. నవ్వుతూ…నిదానం గా, పొడి పొడి ఇంగ్లీష్ లో… మృదుమధురం గా మాట్లాడుతూ…. మా సమస్య ఏమిటో చెప్పామన్నారు. చెప్పాము, రేట్లు పెంచడం వల్ల విద్యార్థులం బాగా ఇబ్బంది పడుతున్నామని, రేట్లు యధాతధంగా తగ్గించాలని. ఆయన ఓపికగా విన్నారు.
నవ్వి, ” I also used to be emotional during my student days. But let us be little practical.. ” అన్నారు.
నాగస్వరం ముందు పాములు తల ఊపినట్టు, మేము ఒక్క మాట కూడా మాట్టాడలేదు.
చివరకు – బేడా కాదు…. పావలా కాదు, ప్లేట్ ఇడ్లీ మూడు అణాలు, దోసె మూడు అణాలు చేద్దాం. అప్పుడు మీరూ ఓడిపోయినట్టు కాదు. హోటల్ వాళ్లు గెలిచినట్టు కాదు…. అన్నారు.
అంతటి కలెక్టర్…. ఆ చీకట్లో…. వర్షపు చినుకుల్లో కూడా…. నడుచుకుంటూ గేటు వద్దకు వచ్చి…. వీలైనంత సౌమ్యంగా….. మాకు అర్ధమయ్యేలా ఇంగ్లిష్ లో మాట్టాడడం తోనే ; నిరుత్తరులం అయిపోయాం.
మా ఆందోళన విజయవంతం అయిందన్న సంతోషంతో, నారాయణకు అభినందనలు తెలుపుతూ అక్కడినుంచి కదిలాం. నిజానికి అది పెద్ద విజయం.
అన్నట్టు ఆ గీత కేఫ్, సెంట్రల్ కేఫ్ లో ఇప్పుడు ప్లేట్ ఇడ్లీ ఎంత!?
-భోగాది వేంకట రాయుడు