– రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి చంద్రబాబే కారణం
– చంద్రబాబు బాగు చేస్తాడని ఎవరూ అనుకోవడం లేదు
– వైసీపీని దించడం, ఎత్తడం సోము వీర్రాజు చేతుల్లో లేదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
తాడేపల్లి, డిసెంబర్ 28: 2019 లో 50 శాతం ఓటింగ్ తో సీఎం జగన్మోహనరెడ్డి ప్రభంజనం ప్రారంభమైందని, ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మున్సిపల్, కార్పోరేషన్ తదితర ఎన్నికల్లో 60 నుండి 65 శాతానికి ఓటింగ్ చేరిందని, దీన్ని కూడా ప్రజావ్యతిరేకతగా భావించే వాళ్ళను ఈ ప్రపంచంలో ఎవరూ బాగుచేయలేరని, పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడమే మంచిదని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు లాంటి పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తుంటే కేసీఆర్ టీడీపీని విబేధించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే తెలంగాణా వెనకబాటుకు గురైందని, సర్వనాశనం అవుతోందని టీఆర్ఎస్ పార్టీని నెలకొల్పి తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు.
రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి చంద్రబాబు లాంటి అసమర్ధుడు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కారణమన్నారు. అటువంటి చంద్రబాబు రాష్ట్రాన్ని బాగు చేస్తాడని ఏ ఒక్కరూ అనుకోవడం లేదన్నారు. చంద్రబాబు పరమ శుంఠ, సన్నాసి అని, తన రాజకీయాలు, పదవి కోసం సొంత మామను చంపిన వ్యక్తి, అవసరం ఉంటే అడ్డమైన వారి కాళ్ళు, గడ్డం పట్టుకుని బతిమాలతాడని, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తి అని అన్నారు. గ్రాఫిక్స్ చూపించి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టాడు కాబట్టే మాడు పగిలిపోయేలా గత 2019 ఎన్నికల్లో చిన్న మెదడు చితికిపోయేట్టు చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్ కు బుద్ధి చెప్పారన్నారు. 2024 తర్వాత చంద్రబాబు రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదన్నారు.
చంద్రబాబు, ఆయన గ్రూపు మాట్లాడే చిల్లర మాటలు, ఉత్తర కుమార ప్రగల్భాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సోము వీర్రాజుపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దించడం, ఎత్తడం సోము వీర్రాజు చేతుల్లో లేదని, ప్రజల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఈసారి ఎన్నికల్లోనైనా బీజేపీకి 20 శాతం సీట్లలో కనీసం డిపాజిట్లు రావడానికి కృషి చేస్తే సోము వీర్రాజు జన్మ ధన్యమైనట్టేనని అన్నారు. అలా జరిగితే ఈ రాష్ట్రంలో ఒక అద్భుతాన్ని సాధించిన వ్యక్తిగా సోము వీర్రాజు మిగిలిపోతారని మంత్రి కొడాలి నాని అన్నారు.