Suryaa.co.in

Andhra Pradesh

గుడివాడలో గడ్డం గ్యాంగ్ అంటూ విష ప్రచారం

– గుడివాడ అంటే కొడాలి నాని కొడాలి నాని అంటే గుడివాడ అని తెలియకపోతే వాళ్ళ ఖర్మ
– జగన్ కు మద్దతుగా ఉండడం వల్లే తప్పుడు రాతలు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

తాడేపల్లి, డిసెంబర్ 28: గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అని, ఈ విషయం ఏబీఎన్ రాధాకృష్ణకు, బీఆర్ నాయుడుకు ఇంకా తెలియకపోతే వాళ్ళ ఖర్మ అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. సోమవారం రాత్రి తాడేపల్లిలోని మీడియా పాయింట్ దగ్గర మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు. ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడులు గుడివాడలో గడ్డం గ్యాంగ్ ఏదో చేస్తున్నట్టుగా డబ్బా ఛానల్స్ లో ఊదర కొడుతున్నారన్నారు.

గుడివాడలో ఉండేవారు తనను ఎమ్మెల్యేగా గెల్పిస్తారని, అక్కడుండే వాళ్ళంతా నా వాళ్ళేనని అన్నారు. డబ్బా ఛానల్స్ లో గంటల తరబడి ఏదో ఒక సోది, రూ.కోటి పంచాయతీ అని చెప్పుకొచ్చారన్నారు. చనిపోయే ముందు రియల్టర్ రాసిన లెటర్లో నా పేరు రాశాడని, ఏమని రాశాడో దాన్ని మాత్రం ఈ గుడ్డి ఛానల్స్ చూపించవన్నారు. గుడివాడ నియోజకవర్గంలో నమ్మగల్గిన వ్యక్తి కొడాలి నాని అని, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఆయనను సంప్రదించమని, మిగిలిన వారంతా దొంగలని, నమ్మొద్దని, మనకు కొడాలి నాని సహాయం చేస్తాడని చనిపోయే ముందు రియల్టర్ తన కుమారుడికి లేఖ రాశాడన్నారు. ఈ పరిస్థితుల్లో నా గ్యాంగ్ డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కథనాలు ప్రసారం చేస్తున్నారన్నారు. డబ్బులు ఇచ్చేవాడు, ఇవ్వాల్సిన వాడు, మాట్లాడేవాడు నా వాళ్ళేనన్నారు. సీఎం జగన్ పై, తనపై ఏదో విధంగా తప్పుడు రాతలు రాస్తూ విషం కక్కుతున్నారన్నారు. జగన్ కు మద్దతుగా ఉండడం వల్ల కోడిగుడ్డుకు ఈకలు పీకే కార్యక్రమం చేస్తున్నారన్నారు. తాను దొంగమాటలు చెప్పి ఆయిల్ అమ్ముకోలేదని, చంద్రబాబుకు బ్రోకర్ పనులు చేయలేదని మంత్రి కొడాలి నాని అన్నారు.

LEAVE A RESPONSE