-ముఖ్య అతిథిగా హాజరయ్యి నివాళులు అర్పించిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-అటవీ సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి భాద్యత
-అటవీ సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
తిరుపతి, నవంబర్ 10: అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణ లో ప్రాణ త్యాగాలు చేసిన అటవీ అమరవీరులను స్మరించుకోవడం, అటవీ సంరక్షణ మన ప్రతిఒక్కరి భాద్యత అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
తిరుపతి జూ పార్క్ సమీపంలో గురువారం ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా విధి నిర్వహణ లో ప్రాణ త్యాగాలు చేసిన అటవీ అమరవీరులకు పుష్ప గుచ్చాలు సమర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. కొంత మంది అటవీ అధికారులకు ఆయుధాలు పంపిణీ చేసిన అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పూర్వ కాలం నుండి ఎంతో మంది అటవీ సంపద దోచుకుంటుంటే, ఆ సంపదను రక్షించే పనిలో అటవీ శాఖ సిబ్బంది నిమగ్నమై ఉన్నారని , అటవీ సిబ్బంది కష్టాల గురించి ఆలోచన చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అటవీ శాఖ మంత్రిగా అధికారులకు 360 కొత్త వాహనాలు అందించామని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఎర్ర చందనం అధికంగా ఉన్న 24 డివిజన్ ల ఐఎఫ్ఎస్ అధికారులకు గన్ మ్యాన్ లను అందించామని తెలిపారు. రాష్ట్రంలో 1939 నుండి నేటి వరకు 23 మంది అటవీ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ లో ప్రాణాలు అర్పించండం బాధాకరమని, అందులో నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ఉన్నారని ప్రాణ త్యాగాలు చేసిన వారిలో అత్యధిక శాతం మన ప్రాంతం నుండే ఉన్నారని ఎర్రచందనం ను కాపాడుకునే బాధ్యత లో వారు అసువులు బాసారని విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.
రాష్ట్రవాసి, రాజమండ్రికి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి పి.శ్రీనివాస్ 1991 లో కర్ణాటక లోనీ చామరాజనగర్ లో విధులు నిర్వహిస్తూ 1991 నవంబర్ 10 న గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ చేతిలో అసువులు బాసారని అప్పటి నుండి ఈరోజు ను అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపు కుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 1.62 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం లో 37392 చదరపు కిలోమీర్లకు పైగా అటవీ ప్రాంతం విస్తరించి ఉందని ఇది 22.94 శాతం మాత్రమే ఉందనీ, అటవీ విస్తరణ ను మరింతగా పెంచేందుకు సిఎం శ్రీ వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఇందులో భాగంగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి అవెన్యూ ప్లాంటేషన్ చేశామని, ఫారెస్ట్ నర్సరీ అభివృద్ధి చేయడం, అటవీ జంతువుల సంరక్షణతో పాటు, ఆదాయార్జన పై కూడా దృష్టిపెట్టి ఇప్పటికే ఎకో టూరిజం ను అందుబాటులోకి తెస్తున్నామని తద్వారా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం మాత్రమే కాకుండా అటవీ పై మరింత అవగాహన పెరిగేందుకు ఉపయోగ పడుతుందని తద్వారా స్మగ్లింగ్ తగ్గే అవకాశం ఉందని అన్నారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఎర్ర చందనం మన రాష్ట్రంలోని ఇదే ప్రాంతంలో, ఇదే శేషాచలం అడవుల్లో ఉండటం మనకు గర్వ కారణమని గతంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జూ లో యనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కోసం ఒక డైరెక్టర్ పోస్ట్ ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో జూ పార్క్ లను అభివృద్ధి చేసేందుకు మరింత కృషి చేస్తామని తెలిపారు. సమావేశ అనంతరం ప్రాంగణంలోని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పిసిసిఎఫ్ మధుసూధన్ రెడ్డి, ఎంపి గురుమూర్తి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అడిషనల్ పి.సి.సి.ఎఫ్ గోపీనాథ్, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగేశ్వర్ నాయుడు, జూ పార్క్ క్యురేటర్ సెల్వం, తిరుపతి డి.ఎఫ్.ఓ సతీష్ రెడ్డి, చైతన్య కుమార్, ఎస్.వి.యు బయోట్రిమ్ అధికారి యశోద బాయి, నరేంద్రన్, అనురాగ్ మీనన్ తదితరులు పాల్గొన్నారు.