ఆగస్టు 8: ప్రముఖ లెఫ్ట్ నేత, సీనియం సీపీఎం నాయకుడు, పశ్చిమబెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (80) గురువారం కన్నుమూశారు.
గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. చూపు మందగించడంతో పాటు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. అందుకే కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. గతేడాది అతనికి న్యుమోనియా సోకడంతో లైఫ్ సపోర్టు పెట్టాల్సి వచ్చింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 80 ఏళ్ల వయసులో బుధవారం ఉదయం కోల్‌కతాలోని స్వగృహంలో కన్నుమూశారు. బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు.
కాగా 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించిన బుద్ధదేవ్ భట్టాచార్య 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. బెంగాల్ ఏడో ముఖ్యమంత్రిగా 11ఏళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశారు. పార్టీ కోసం చాలా కీలకంగా పనిచేశారు. 1972 నుంచి రాజకీయాల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ బెంగాల్‌లో కమ్యూనిస్టుల మార్క్‌ను కొనసాగించారు. బుద్ధదేవ్ భట్టాచార్య జ్యోతిబసు తర్వాత అత్యున్నత పదవిలో అధికాలం కొనసాగారు.