ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును, గతంలో ఎస్ఐబీలో సీఐగా పని చేసిన గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ విచారిస్తున్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్ రావు అమెరికా వెళ్లిపోయారు. దర్యాఫ్తు బృందం లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు.
రాధాకిషన్, గట్టు మల్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్లపై నిఘా పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రతిపక్ష నేతలను అనవసరంగా నిర్బంధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రముఖ వ్యక్తులపై నిఘా పెట్టిన వీరు… ప్రభుత్వం మారిన తర్వాత హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, భుజంగరావు, తిరుపతన్నలను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీపై ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.