– కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
గన్నవరం టిడిపి కార్యాలయంపై కర్రలు, రాళ్లతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేయడాన్ని కృష్ణాజిల్లా గుడివాడ నియోజవర్గ టిడిపి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే రావి ఒక ప్రకటన విడుదల చేశారు.
టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంతో పాటు కార్యాలయం ఎదుట ఉన్న వాహనాలను కూడా తగలబెట్టడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పోలీసుల కళ్ళెదుట ఇంత జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. టిడిపి కార్యకర్తల ఇళ్లపైన కూడా దాడులకు తెగబడ్డారని, బెదిరింపులకు కూడా దిగుతున్నారన్నారు. టిడిపి కార్యాలయంపై దాడికి వెళుతున్న వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోలేకపోయారన్నారు.
దాడులు చేస్తున్న వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. పోలీసులు సీరియస్ గా వ్యవహరించి ఉంటే టిడిపి కార్యాలయంపై దాడి జరిగి ఉండేది కాదన్నారు. వైసిపి నేతల దురాగతాలను ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు తగవని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా పోలీసులు జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకొని దాడులకు దిగిన వైసిపి శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు.