మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకున్నారు.
మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా రావు ప్రధానిగా ఉన్న సమయంలో, ఆర్థిక మంత్రిగా పని చేశారు మన్మోహన్ సింగ్. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు.
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.
ప్రపంచానికి భారత్ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ మంచి విజయాలు సాధించింది. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరిగా నిలిచారు.