– మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, శైలజానాధ్ కూడా?
– మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేరికపై సందిగ్థం
– గతంలోనే పల్లంరాజుతో కన్నా, పురంధీశ్వరి చర్చలు
– అప్పట్లోనే పార్టీలో చేరేందుకు అంగీకరించిన పల్లంరాజు
– కిరణ్‌కుమార్ రాకతో చేరికకు మార్గం సుగమం
– మరికొందరు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలతో కిరణ్ చర్చలు
– కిరణ్ అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేరికలు?
– పల్లంరాజును ‘మాజీల తరహాలోనే’ గౌరవిస్తారా?
– ఇప్పటికే పార్టీకి దూరంగా కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు
– పార్టీ కార్యక్రమాలకు దూరంగా మరో కేంద్రమాజీ మంత్రి సుజనా చౌదరి
– అంటీముట్టనట్లుగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి
– సీమ హక్కుల సాధన పోరాటాల్లో బైరెడ్డి బిజీ
– ‘కమలం’లో కొత్త వారికి గౌరవం ఉంటుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన సహచరులను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా తన మిత్రుడైన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజును, బీజేపీకి తీసుకురానున్నట్లు సమాచారం. ఆయనతో మరికొందరు కాంగ్రెస్ ప్రముఖులను, పార్టీలోకి తీసుకువచ్చేందుకు కిరణ్ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కేంద్ర మాజీ మంత్రి, కాపు సామాజికవర్గానికి చెందిన పల్లంరాజు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆమేరకు ఆయన స్నేహితుడైన, మాజీ సీఎం కిరణ్ ఆయనతో చర్చలు జరిపారు. నిజానికి పల్లంరాజు, అప్పట్లో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వద్ద బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
ఆ మేరకు వారిద్దరూ పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఆ తర్వాత చేరికలో పురోగతి కనిపించలేదు. ఈలోగా కేంద్ర మాజీ మంత్రి పురంధీశ్వరి కూడా, పల్లంరాజుతో చర్చించారు. కారణాలు ఏమైనప్పటికీ, పల్లంరాజు చేరిక ఆగిపోయింది. ఆయన కూడా కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించడం లేదు.
కిరణ్‌కుమార్ బీజేపీలో చేరిన తర్వాత, పల్లంరాజుతో కిరణ్ ఒక హోటల్‌లో చర్చలు జరిపిన నేపథ్యంలో.. పల్లంరాజు పార్టీలో చేరేందుకు మార్గం సుగమమయింది. కాగా ఆయనతోపాటు.. కిరణ్‌కుమార్ మంత్రివర్గంలో పనిచేసిన ఏరాసు ప్రతాపరెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ శైలజానాధ్‌ను కూడా బీజేపీలో వచ్చేలా కిరణ్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. కిరణ్ అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత, వీరంతా బీజేపీలో చేరతారంటున్నారు.
అయితే… ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు, కిరణ్ మంత్రివర్గ సభ్యుడు రఘువీరారెడ్డి కూడా, బీజేపీలో చేరే అంశంపై సందిగ్థం నెలకొందని చెబుతున్నారు. తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు, రఘువీరారెడ్డి చెబుతున్నప్పటికీ… ఒకవేళ తాను బీజేపీలో చేరితే గవర్నర్ వంటి ఉన్నత పదవులు గానీ, కర్నాటక బాధ్యతలు గానీ ఆయన ఆశిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా స్పష్టత రావలసి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా కేంద్రమాజీ మంత్రి పల్లంరాజుకు, నిజాయితీపరుడున్న పేరున్నప్పటికీ.. సొంత సామాజికవర్గమైన కాపులలో, పెద్ద ఆదరణ లేదన్న ప్రచారం ఉంది. సొంత అనుచరులకు సైతం సాయం చేయరని, అందుకే ఆయనను తాము తమవాడిగా సొంతం చేసుకోలేమని కాపు నేతలు బహిరంగంగానే చెబుతుంటారు. కాకపోతే..పల్లంరాజు చేరికతో, కాపు నేతతోపాటు మరో కేంద్రమాజీ మంత్రి బీజేపీలో చేరారన్న ప్రచారం, పార్టీకి ఉపయోగపడుతుందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పురంధీశ్వరి, సుజనాచౌదరి, కావూరి సాంబశివరావు బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే.
అయితే కావూరి పార్టీలో ఎక్కడా కనిపించడం లేదు. గతంలో ఆయనకు-పురంధీశ్వరికి మధ్య విబేధాలు వచ్చిన నేపథ్యంలో, అప్పటి బీజేపీ నాయకత్వం-సంఘటనా మంత్రి, కేంద్ర బీజేపీ నాయకత్వం ఆమె మాటకే ప్రాధాన్యం ఇచ్చి, కావూరిని అవమానించారన్న చర్చ జరిగింది. దానితో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఇక మరో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా, సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఎంపీలను కోర్ కమిటీ భేటీలకు పిలవని వైనాన్ని.. అవమానంగా భావించిన ఆయన, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా.. కార్యక్రమాలు నిర్వహించని రాష్ట్ర పార్టీ నాయకత్వంపై, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, జాతీయ నాయకత్వం స్పందించలేదు. దానితో సుజనా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఎంపి సీఎం రమేష్‌తో కలసి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నద్దాతో భేటీ అయ్యారు. అయితే రాష్ట్ర పార్టీ మాత్రం.. సుజనాను గౌరవించకపోయినప్పటికీ, విజయవాడలోని ఆయన ఫంక్షన్ హాల్‌ను, పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవడం ఆశ్చర్యం.
ఈ నేపథ్యంలో పల్లంరాజుతోపాటు పార్టీలో చేరే ప్రముఖులకు ఎలాంటి గుర్తింపు ఇస్తారో చూడాలి. రాయలసీమలో అనుచరవర్గం దండిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, గంగుల ప్రతాపరెడ్డి కూడా బీజేపీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డయితే.. రాయలసీమ హక్కుల సాధనకు సొంతగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు.
గత కొద్ది రోజుల క్రితం మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి.. పార్టీలో తనను పట్టించుకునేవారే లేరని, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, పార్టీలో చేరిన కొత్తవారిని సమన్వయం చేసుకునేవారని వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత, తమలాంటి వారిని పట్టించుకోవడం లేదని ఆయన మీడియాలో వాపోయారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు కూడా, పార్టీలో జరుగుతున్న అవమానాలు భరించలేక రాజీనామా చేసి, బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరుతున్న ప్రముఖులకు, ఏ స్ధాయిలో గౌరవం లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వీరందరికీ వెంటనే పదవులిస్తారా? కొంతకాలం చిత్తశుద్ధికి సంబంంధి శీలపరీక్ష చేస్తారా? చేస్తే అది ఎంత కాలం? అన్నది ప్రశ్న. చేరేవారంతా ప్రముఖులే కాబట్టి, వారికి ఏ స్ధాయి పదవులివ్వాలన్నది మరో గందరగోళం.
కేంద్రమంత్రిగా పనిచేసిన పల్లంరాజుకు జాతీయ స్ధాయిలో ఏదో ఒక పదవి ఇవ్వాల్సి ఉంటుంది. దానికంటే ముందు ఆయనను కోర్ కమిటీలో నియమిస్తారా? లేదా అన్నదానిపైనే, పల్లంరాజు ప్రాధాన్యం ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.