అమరావ తి: రాజధాని అమరావ తిలో సీఎం చంద్రబాబు కొత్తగా కొనుగోలు చేసిన స్థలంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వచ్చే నెల (ఏప్రిల్) 9న భూమి పూజ చేయనున్నట్లు తెలి సింది. గత ఏడాది ఆఖరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందులో ఇంటి నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్సు 2 కి.మీ దూరంలోనే ఈ స్థలం ఉంది. అమరావతి పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. ఇంటి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. ఉద్యానం, రక్షణ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్, తదితర అవస రాలను కూడా నిర్మాణంలో పరిగణనలోకి తీసుకుంటారు.
వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న తలంపుతో ముఖ్య మంత్రి ఉన్నారు. సన్నాహక చర్యల్లో భాగంగా శుక్రవారం మంత్రి లోకేశ్ కార్యాలయ సిబ్బంది, వాస్తు సిద్ధాంతి వచ్చి స్థలాన్ని పరిశీలించారు. చదును చేసే పనులను కూడా ప్రారంభించారు. ఈ స్థలాన్ని నెలాఖరులోగా రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు తెలిసింది. ఈ ప్లాట్ గుండా వెళ్తున్న విద్యుత్తు స్తంభాలను మార్చనున్నారు.