– 2వరకు శిబిరాలు కొనసాగింపు
– వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
– నున్న లో ఉచిత వైద్య శిబిరం సందర్శన
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 17 నుంచి ప్రారంభమైన “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా సుమారు 34 లక్షల మంది మహిళలకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. 16,000 పైగా వైద్య శిబిరాల ద్వారా మహిళలు ఉచిత పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు. మహిళలు 8 రకాల ఉచిత పరీక్షలు చేయించుకుంటున్నారన్నారు.
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నున్నలో ఏర్పాటు చేసిన “స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్” వైద్య శిబిరాన్ని మంత్రి గురువారంనాడు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వికల్ క్యాన్సర్), ఇతర స్క్రీనింగ్ పరీక్షలను చేస్తున్నట్లు తెలిపారు. ముందస్తు పరీక్షల ద్వారా అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించిన వారికి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
వచ్చే నెల 2వ తేదీ వరకు వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ శిబిరాల ద్వారా మహిళలు, చిన్నారులు, బాలబాలికలకు కలిపి కోటిన్నర మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్వస్థ్ నారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని, సశక్త్ పరివార్ అంటే ఒక శక్తివంతమైన కుటుంబంలో అత్యంత ముఖ్య భూమిక పోషించే మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా తయారవుతుందని మంత్రి వివరించారు.
క్యాన్సర్ పరీక్షలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ నోటి క్యాన్సర్ పరీక్షలు, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికీ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు, 30 ఏళ్లు నిండిన ప్రతి మహిళకీ సర్వైకల్ క్యాన్సర్ పరీక్షల్ని ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు.
మెడికల్ ఆఫీసర్లు, సూపర్ స్పెషలిస్ట్ లు, స్పెషలిస్టులు, ఎఎన్ఎంలు దాదాపు 18 వేల మంది రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. 24 గంటలూ పనిచేసే శాఖ ఏదైనా ఉందా అంటే అది ఒక్క వైద్యారోగ్య శాఖే అని, చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తున్న వైద్య సిబ్బందిని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు.
ఎన్టీఆర్ అంతటివారు పండిట్ దీన్ దయాళ్
మాజీ సిఎం ఎన్టీ రామారావు గురించి గొప్పగా ఎలా మాట్లాడుకుంటామో…. ఉత్తరాదిలో ఏ రాష్ట్రానికెళ్లినా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గురించి అలా చెప్పుకుంటారని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కుటుంబం కన్నా దేశహితం ముఖ్యమని, దేశంలో ఉంటున్న కోట్లాది ప్రజల అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమని ఆయన భావించారన్నారు. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలు పేదవారిని దృష్టిలో పెట్టుకొని తీసుకురావాలని మొట్టమొదట చెప్పిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశం కోసం పని చేయాలన్న ఉద్దేశంతో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయారన్నారు.